తెలంగాణ లో ఈ ఏడాది క్రైమ్ రేట్ (Telangana Crime Rate) విపరీతంగా పెరిగిందన్నారు రాష్ట్ర డీజీపీ జితేందర్ (State DGP Jitender). ఈ మేరకు వార్షిక క్రైమ్ రేట్ రిపోర్ట్ ను విడుదల చేసారు. రాష్ట్రంలో క్రైమ్ రేట్ 9.87 శాతం పెరిగిందని , ఈ ఏడాది మొత్తం 33,618 సైబర్ క్రైమ్ కేసులు నమోదైనట్లు ఆయన తెలిపారు. డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం పోలీసులు కృషి చేస్తున్నారని, ఇప్పటివరకు 142.95 కోట్లు విలువ చేసే మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. 4682 మంది నిందితులను అరెస్ట్ చేసి, సుమారు 1800 వెబ్‌సైట్లను బ్లాక్ చేసినట్టు తెలిపారు.
డయల్ 100కి ఈ ఏడాది 16,92,173 ఫిర్యాదులు అందినట్లు డీజీపీ చెప్పుకొచ్చారు. సైబర్ నేరాల విషయంలో బాధితులకు రూ.180 కోట్లను తిరిగి అందజేశామని పేర్కొన్నారు. ఈ ఏడాది 703 దొంగతనం కేసులు, 1525 కిడ్నాప్‌లు, 856 హత్యలు, 2945 లైంగిక దాడి కేసులు నమోదయ్యాయని వివరించారు. నూతన చట్టాల అమలుతో 85,190 కేసులు నమోదైనట్లు తెలిపారు. ముఖ్యంగా సైబరాబాద్‌లో 15,360, హైదరాబాద్‌లో 10,501, రాచకొండలో 10,251 కేసులు నమోదయ్యాయని వివరించారు. చట్టవిరుద్ధంగా ప్రైవేట్ ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని, సోషల్ మీడియాపై ప్రత్యేక మానిటరింగ్ ఏర్పాటు చేశామని డీజీపీ పేర్కొన్నారు. సైబర్ క్రైం ఇన్వెస్టిగేషన్‌లో పోలీసులు కీలకంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు.
అలాగే పోలీసుల ఆత్మహత్యలపై కూడా డీజీపీ స్పందించారు. వ్యక్తిగత సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సంక్షోభాలు, పని ఒత్తిడి కారణంగా పోలీసులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని , పోలిసుల సమస్యల నివారణకు ఫ్యామిలీ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామని, పోలీసు వ్యవస్థలో మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నామని వెల్లడించారు. ఓవరాల్ గా తెలంగాణలో క్రైమ్ రేట్ పెరుగుదలపై డీజీపీ చేసిన ప్రకటనలు నేరాల నియంత్రణకు మరింత శ్రద్ధ అవసరాన్ని తెలియజేస్తున్నాయి. అటు ఏపీలో మాత్రం క్రైమ్ రేట్ గతంతో పోలిస్తే ఈ ఏడాది తగ్గడం విశేషం.
Read Also : Pawan Tweet : నితీష్ రెడ్డిపై పవన్ ట్వీట్..ఇది కదా ట్వీట్ అంటే ..!!