Site icon HashtagU Telugu

Telangana Cop: అడిషనల్ ఎస్పీ డీజీపీ ఆఫీస్‌కు అటాచ్

Asp Naik

Asp Naik

మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ప్రచారం చేసినట్లు గుర్తించడంతో జోగులాంబ- గద్వాల్ జిల్లా అదనపు పోలీస్ సూపరింటెండెంట్ రాములు నాయక్‌ను తెలంగాణ డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు. ఈ నెల ఒకటి నుంచి సెలవుపై వెళ్లిన రాములు నాయక్ మునుగోడు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని కలిసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మునుగోడు ఎన్నికల ప్రచారంలో రాజగోపాల్‌రెడ్డి తరఫున ప్రచారం కూడా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆయన అధికారిక వాహనంలో గద్వాల్ జిల్లా నుంచి మునుగోడు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఆయనకు అక్కడ ఎటువంటి అధికారిక బాధ్యతలు అప్పగించలేదని విచారణలో తేలింది. ప్రచార సమయంలో ఆయన మునుగోడులో ఉండటం అనుమానాలకు దారి తీసింది.

సంస్థాన్ నారాయణపురంలో బీజేపీ స్థానిక నేతలతో కలిసి ప్రచారంలో పాల్గొన్నట్లు వార్తలొచ్చాయి. ఆయనకు ఆ నియోజకవర్గంలో బంధువులు ఉండటం కూడా అనుమానాలకు తావిచ్చింది. అయినప్పటికీ ఆ సమయంలో ఆయన మునుగోడుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో తాము పరిశీలిస్తున్నామని తెలంగాణ పోలీసు సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. రాములు నాయక్ వాహనంలో నగదు స్వాధీనం చేసుకున్నట్లు వచ్చిన వార్తల్లో నిజంలేదని ఆయన తెలిపారు. లా అండ్ ఆర్డర్ అదనపు డీజీపీ జితేందర్ ఈ విషయమై దర్యాప్తు చేస్తున్నారు.