T Congress : తెలంగాణ కాంగ్రెస్ `యాత్ర` స్పెష‌ల్‌

అస‌లు సిస‌లైన గేమ్ తెలంగాణ కాంగ్రెస్ లో మొద‌లైయింది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స‌త్తా ఏమిటి ఈసారి తెలియ‌నుంది.

  • Written By:
  • Updated On - July 29, 2022 / 12:06 PM IST

అస‌లు సిస‌లైన గేమ్ తెలంగాణ కాంగ్రెస్ లో మొద‌లైయింది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స‌త్తా ఏమిటి ఈసారి తెలియ‌నుంది. ఏడాది పూర్తి చేసుకున్న రేవంత్ రెడ్డి నాయ‌క‌త్వంపై ఇప్ప‌టి వ‌ర‌కు ఏఐసీసీ పూర్తి విశ్వాసాన్ని ఉంచింది. ఒక వేళ మునుగోడు ఉప ఎన్నిక‌ల వ‌స్తే, ఆ ఫ‌లితాల ఆధారంగా ఆయ‌న లీడ‌ర్ షిప్ బ‌లం ఏమిటో తేల‌నుంది. పైగా ఆయ‌న పాద‌యాత్ర‌కు అనుమ‌తి కూడా మ‌నుగోడు అంశంపై ఆధార‌ప‌డే అవ‌కాశం ఉంది.ఇటీవ‌ల ఆయ‌న వేస్తోన్న ఎత్తుగ‌డలు ఏఐసీపీ కూడా గ‌మ‌నిస్తోంది.

పాద‌యాత్ర చేయాల‌ని తొలి నుంచి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్ర‌య‌త్నం చేస్తున్నారు. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న‌కు ఏఐసీసీ నుంచి ఎలాంటి అనుమ‌తి ల‌భించ‌లేదు. వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న‌ప్పుడు రైతు పాద‌యాత్ర చేసిన పీసీసీ బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత అయోమ‌యంలో ప‌డ్డారు. ఆయ‌న పాద‌యాత్ర లీకులు రాగానే , మిగిలిన లీడ‌ర్లు కూడా తామున్నామంటూ ముందుకొస్తున్నారు. ఇప్ప‌టికే శాస‌న స‌భాప‌క్ష నేత‌గా ఉన్న భ‌ట్టీ విక్ర‌మార్క్ పాద‌యాత్ర‌ను ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో చేప‌ట్టారు. ఇంకో వైపు శ్రీథ‌ర్ బాబు కూడా పాద‌యాత్ర‌కు ప్లాన్ చేసుకుంటున్నారు. నిజామాబాద్ కేంద్రంగా మ‌ధుయాష్కీ కూడా పాద‌యాత్ర‌కు యోచిస్తున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీలోని ప‌లువురు పాద‌యాత్ర‌ల‌కు సిద్ధం అవుతూ రేవంత్ రెడ్డిక పోటీగా త‌యారు అవుతున్నారు.

స్టార్ కాంపెయిన‌ర్ గా ఉన్న కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి ద‌స‌రా నుంచి పాద‌యాత్ర‌కు ముహూర్తం పెట్టుకున్నార‌ని తెలుస్తోంది. ఆ మేర‌కు ఆయ‌న అభిమానులు బ్లూ ప్లింట్ త‌యారు చేస్తున్నార‌ని వినికిడి. బూదాన్ పోచంప‌ల్లి నుంచి పాద‌యాత్ర‌ను మొద‌లు పెట్టి తెలంగాణ వ్యాప్తంగా కొన‌సాగించాల‌ని ప్లాన్ చేస్తున్నారు. ఆయ‌న సోద‌రుడు కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేస్తోన్న వేళ బ్ర‌ద‌ర్ వెంక‌ట‌రెడ్డి పాద‌యాత్ర‌కు షురూ చేస్తున్నారు. వాళ్లిద్ద‌రి వ్య‌వ‌హారం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది.

సాధార‌ణంగా పాద‌యాత్ర‌కు ఏఐసీసీ అనుమ‌తి ఇవ్వాలి. క‌నీసం మౌళిక ఆదేశం ఇస్తేనే పాద‌యాత్ర‌కు ఎవ‌రైనా ముందుకు క‌ద‌లాలి. గ‌తంలో మాజీ సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి విష‌యంలోనూ అదే జ‌రిగింది. ఆ త‌రువాత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఓదార్పు విష‌యంలో ఏఐసీపీ సీరియ‌స్ గా అనుమ‌తి నిరాక‌రించింది. ధిక్క‌రించిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి సొంత పార్టీ పెట్టుకుని కాంగ్రెస్ పైనే తిర‌గ‌బ‌డ్డారు. ఇప్పుడు తెలంగాణ‌లోనూ ఏఐసీపీ అనుమ‌తి లేకుండా ఎవ‌రైనా పాద‌యాత్ర చేప‌డితే అదే జ‌రుగుతుంది. బ‌హుశా కోమ‌టిరెడ్డి ఏఐసీసీ నుంచి అనుమ‌తి తీసుకున్న త‌రువాత పాద‌యాత్ర ముహూర్తం పెట్టుకుని ఉంటారు. ఇప్ప‌టి వ‌ర‌కు రేవంత్ రెడ్డికి ఎలాంటి సంకేతం పాద‌యాత్ర గురించి ల‌భించ‌లేద‌ని తెలుస్తోంది.

రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా పాద‌యాత్ర చేసే స‌మ‌యంలో ఆయ‌న వెంట మాత్ర‌మే న‌డిచే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. కానీ, ఆయ‌న అభిమానులు మాత్రం. వ‌చ్చే ఏడాది 119 నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ రేవంత్ పాద‌యాత్ర ఉంటుంద‌ని చెబుతున్నారు. మొత్తం మీద మునుగోడు ఎమ్మెల్యే రాజ‌గోపాపాల్ రెడ్డి రాజీనామా వ్య‌వ‌హారం ఒక కొలిక్కి రాక‌ముందే పాద‌యాత్ర‌ల లొల్లి కాంగ్రెస్ పార్టీలో మొద‌ల‌యిందన్న‌మాట‌. దీనికి ఏఐసీపీ ఎలాంటి ఫుల్ స్టాప్ పెడుతుందో చూడాలి.