T Congress Rajya Sabha MP Candidates : తెలంగాణ కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన అధిష్టానం..

  • Written By:
  • Publish Date - February 14, 2024 / 07:38 PM IST

కాంగ్రెస్ అధిష్టానం (Telangana Congress) రాజ్యసభ (Rajya Sabha) ఛాన్స్ ఎవరికీ ఇస్తుందో అని గత కొద్దీ రోజులుగా ఎదురుచూస్తుండగా.. బుధువారం ఆ ఎదురుచూపులు తెరదించింది అధిష్టానం. రేణుకాచౌదరి (Renuka Chowdary), యూత్‌ కాంగ్రెస్‌ జాతీయ కార్యదర్శి అనిల్‌కుమార్‌ యాదవ్‌ (Anil Kumar Yadav)కు పేర్లను ఖరారు చేస్తున్నట్లు ఏఐసీసీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. అలాగే కర్ణాటక నుంచి సైతం కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సీట్లు- ఖరారు చేసింది. అజయ్‌ మాకెన్‌, సయ్యద్‌ నాసిర్‌ హుస్సేన్‌, జీసీ చంద్రశేఖర్‌ పేర్లు ప్రకటించింది.

ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిర్ణయం తీసుకున్నారని పార్టీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటన జారీ చేశారు. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తనయుడే అనిల్ కుమార్ యాదవ్. ఈయన ప్రస్తుతం సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. రాజ్యసభ విషయంలో అనూహ్యంగా ఆయన పేరు తెరపైకి వచ్చింది. యూత్ కాంగ్రెస్ కోటలో అనిల్ కు పార్టీ అధిష్టానం అవకాశం కల్పించింది. తెలంగాణ నుంచి ఏఐసీసీ కోటాలో ఒకరికి అవకాశం ఇస్తారని ప్రచారం జరిగినా చివరకు రెండు సీట్లకు రాష్ట్రం నుంచే ఎంపిక చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

కాంగ్రెస్‌ పార్టీకి వచ్చే రెండు రాజ్యసభ సీట్లలో ఒకటి ఓసీకి, ఇంకొకటి బీసీకి అవకాశం కల్పించారు. మాజీ మంత్రులు జానారెడ్డి, చిన్నారెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు వి. హనుమంతరావు, పీసీసీ ఉపాధ్యక్షులు జి. నిరంజన్‌ పేర్లు కూడా వినిపించినప్పటికి.. చివరకు రేణుకాచౌదరి ( కమ్మ), అనిల్‌కుమార్‌ యాదవ్‌ ( బీసీ) లకు కాంగ్రెస్‌ అధిష్టానం అవకాశం ఇచ్చింది. ఇటీవలనే ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ ఎన్నికల్లో బల్మూరి వెంకట్‌ ( ఓసీ వెలమ), మహేష్‌కుమార్‌గౌడ్‌ ( బీసీ), గవర్నర్‌ కోటాలో కోదండరామ్‌ ( రెడ్డి), అమిర్‌అలీఖాన్‌ ( మైనార్టీ)లకు అవకాశం ఇచ్చారు. అయితే గవర్నర్‌ కోటాలో ఎంపికైన వారి అభ్యర్థిత్వాల విషయంలో కోర్టులో కేసు నడుస్తున్న విషయం తెలిసిందే.

మధ్యప్రదేశ్ నుంచి అశోక్ సింగ్ పోటీ చేయనున్నారు. నామినేషన్ల దాఖలుకు రేపటి (గురువారం) వరకూ అవకాశం ఉండడంతో వీరంతా గురువారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. తెలంగాణ నుంచి ప్రకటించిన అభ్యర్థులు మాజీ మంత్రి రేణుకాచౌదరి ఖమ్మం లోక్‌సభ టికెట్‌ కోసం, అనిల్‌కుమార్‌ యాదవ్‌ సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ సీటు కోసం దరఖాస్తులు చేసుకున్నారు. వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో లోక్‌సభకు పోటీ చేయాలని భావించినప్పటికి.. రాజ్యసభ సీటు కోసం కూడా ప్రయత్నం చేసుకుని సాధించుకున్నారు.

Read Also : Harirama Jogaiah : హరిరామ జోగయ్య డిమాండ్.. టీడీపీకి కష్టమే..?