Cong Leaders: ముగ్గురు కాంగ్రెస్ ఎంపీలు… మూడు ముచ్చట్లు

కేసీఆర్ తనపై తాను నమ్మకం కోల్పోయి సునీల్ అనే రాజకీయ వ్యూహకర్తను కన్సల్టెంట్ గా నియమించుకున్నారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ తెలిపారు.

కేసీఆర్ తనపై తాను నమ్మకం కోల్పోయి సునీల్ అనే రాజకీయ వ్యూహకర్తను కన్సల్టెంట్ గా నియమించుకున్నారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ తెలిపారు. సునీల్ ఎవరో, అమిత్ షాకు సంబంధమేంటి, గతంలో ఎవరితో కలిసి పని చేశాడనే వివరాలు త్వరలోనే వివరాలు బయటపెడతానని రేవంత్ తెలిపారు. కేసీఆర్ వ్యూహకర్త సునీల్ సూచనల మేరకు టీఆర్ఎస్, బీజేపీ వడ్ల కొనుగోలు అంశాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయ డ్రామా ఆడుతున్నారని ధ్వజమెత్తారు. రాజకీయ వ్యూహకర్తల చక్రబంధంలో, టీఆర్ఎస్, బీజేపీ రాజకీయ రాక్షస క్రీడలో తెలంగాణ రైతులు బలవుతున్నారని మండిపడ్డారు. పార్లమెంట్ లో కేంద్రాన్ని నిలదీయకుండా పారిపోయిన టీఆర్ఎస్ ఎంపీలు మళ్లీ ఢిల్లీకి వచ్చి నాటకాలు ఆడుతున్నారని రేవంత్ విమర్శించారు. రాజకీయ స్వార్థం, ప్రయోజనం కోసం అమిత్ షా డైరెక్షన్ లో కేసీఆర్ నటిస్తున్నారని ధ్వజమెత్తారు. రెండు పార్టీలు ఆడుతున్న రాజకీయ డ్రామాను కాంగ్రెస్, కిసాన్ సెల్ ఆధ్వర్యంలో “రైతులతో రచ్చ బండ” పేరుతో ప్రజలకు వివరిస్తామని స్పష్టంచేశారు.

ప్రభుత్వం, సీఎం కేసీఆర్ అసమర్థత కారణంగా ఖరీఫ్ లో రైతులు తీవ్రంగా నష్టపోయారని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. కొనుగోలు, రవాణా, ఐకేపీ కేంద్రాల ఏర్పాటులోనూ ప్రభుత్వం తీవ్ర జాప్యం చేసిందని మండిపడ్డారు. అకాల వర్షాలతో పంట తడిసిపోవడం వల్ల రైతులకు నష్టం వాటిల్లిందని, ఇందుకు కేసీఆరే కారణమని ధ్వజమెత్తారు. పోయిన రబీ సీజన్ లో 52 లక్షల ఎకరాల్లో వరి పండించామని చెబుతూనే, ఈ సారి వరి అసలే వేయొద్దని చెప్పడం తుగ్లక్ చర్య అని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వరిపై ఆంక్షలు విధించకుండా వరి ధాన్యం కొనుగోలుపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు.

తెలంగాణాలో
రైతులకు ఎక్కడా మద్దతు ధర లభించలేదని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ధాన్యం సేకరించాల్సిన మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని దివాళా తీయించారని ధ్వజమెత్తారు. హంగు, ఆర్భాటాల కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న కేసీఆర్ రైతుల కోసం రెండు, మూడు వేల కోట్ల రూపాయలు కేటాయించలేరా అని ఎంపీకోమటిరెడ్డి ప్రశ్నించారు. పార్లమెంట్ లో టీఆర్ఎస్ ఎంపీలు నాటకాలు ఆడారని కోమటిరెడ్డి మండిపడ్డారు. కేంద్రంతో ధాన్యం కొనుగోలు చేయించే బాధ్యత. సీఎం కేసీఆరే తీసుకోవాలని కోమటి రెడ్డి తేల్చిచెప్పారు. కాంగ్రెస్ హయాంలో ఐకేపీ కేంద్రాలు ఏర్పాటు చేసి, రైతులకు మద్దతు ధర ఇప్పించామని టీఆర్ఎస్ వచ్చాక రైతులను నాశనం చేస్తున్నారని కోమటిరెడ్డి తెలిపారు.