Site icon HashtagU Telugu

MLA Rajagopal Reddy Resigns: రాజగోపాల్ రెడ్డి రాజీనామా!

Rajagopal Reddy

Rajagopal Reddy

అందరూ ఊహించినట్టుగా తెలంగాణ కాంగ్రెస్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు మంగళవారం రాత్రి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజీనామా ద్వారా మునుగోడు ప్ర‌జ‌ల‌కు మేలు జ‌రుగుతుంద‌ని భావిస్తున్న‌ట్లు రాజ‌గోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో బ‌ల‌హీన ప‌డ‌టంతో పార్టీలో ఉండి కూడా తాను ఏమీ చేయ‌లేక‌పోయాన‌ని ఆయ‌న ఆవేదన వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లాలో అవ‌కాశ‌వాద రాజ‌కీయాలు చేసే నేత‌లు ఉన్నార‌ని కూడా ఆయ‌న వ్యాఖ్యానించారు. కాంట్రాక్టుల కోస‌మే కాంగ్రెస్ పార్టీకి తాను రాజీనామా చేస్తున్నాన‌ని కొంద‌రు ఆరోపిస్తున్నార‌ని మండిపడ్డారు. రాజీనామాతో మునుగోడుకు జ‌ర‌గ‌నున్న ఉప ఎన్నిక‌లో ఎవ‌రు గెలవాలనేది ప్రజలే నిర్ణయిస్తారని రాజ‌గోపాల్ రెడ్డి అన్నారు.

మునుగోడు ప్రజల నిర్ణయం మేరకే నా నిర్ణయం ఉంటుంది. మునుగోడులో అసలు అభివృద్ధి లేదు. ఇచ్చిన ఏ ఒక్క హామీని ప్రభుత్వం నెరవేర్చలేదు. కనీసం ప్రతిపక్ష ఎమ్మెల్యే హోదాలో కూడా నాకు అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వట్లేదు. పోడు భూముల సమస్యలపై ప్రభుత్వం ఇంతవరకూ ఏమీ చేయలేదు. గిరిజనులను అధికారులు వేధిస్తున్నారు. పోడు భూములకు పాస్‌ బుక్‌లు ఇప్పించాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారాయన.

కేసీఆర్ అవినీతి పాలన అంతమొందించాలంటే మోడీ, షా ద్వయం వల్లనే సాధ్యమని రాజగోపాల్ రెడ్డి అన్నారు. తాను ఏ నిర్ణయానికి కట్టుబడి ఉన్నానో.. ఆ నిర్ణయాన్ని కచ్చితంగా గౌరవిస్తానని అన్నారు. తాను కేవలం పార్టీ మాత్రమే మారుతున్నానని, కాంగ్రెస్ మీద ఎలాంటి ఆరోపణలు చేయబోనని Rajagopal Reddy స్పష్టం చేశారు. తెలంగాణ భవిష్యత్తు కోసం ఏ నిర్ణయమైతే బాగుంటుందో, ఆ నిర్ణయం తీసుకుంటానని, తాను డబ్బులకు అమ్ముడుపోయే వ్యక్తి ని కాదు అని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యనించారు.

Exit mobile version