Telangana Congress Manifesto : కుంభస్థలాన్ని కొట్టిన కాంగ్రెస్ మేనిఫెస్టో

ఎన్నికల మేనిఫెస్టో (Manifesto) మొదటి రెండు అంశాలలోనే కేసిఆర్ మీద కాంగ్రెస్ పార్టీ (Telangana Congress) కీలకమైన బాణాన్ని ఎక్కు పెట్టింది.

  • Written By:
  • Updated On - November 18, 2023 / 01:05 PM IST

By: డా. ప్రసాదమూర్తి

Telangana Congress Manifesto : తెలంగాణ సెంటిమెంట్ తో ముడిపెట్టి మరోసారి అధికారంలోకి రావాలని కేసిఆర్ ఎన్ని ప్రయత్నాలు చేసినా, చరిత్రను ఎంత తిరగదోడినా, కాంగ్రెస్ పార్టీ మీద ఎన్ని ఆరోపణలు చేసినా, కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల ప్రచారంలో తన పంథాలో తాను ముందుకు దూసుకుపోతోంది. తమ పార్టీ చేసిన ఆరు పథకాల వాగ్దానంతో పాటు 66 కీలకంశాలను జోడించి, 42 పేజీల ఎన్నికల మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ నాయకులు నిన్న విడుదల చేశారు. ఎన్నికల మేనిఫెస్టో (Manifesto) మొదటి రెండు అంశాలలోనే కేసిఆర్ మీద కాంగ్రెస్ పార్టీ (Telangana Congress) కీలకమైన బాణాన్ని ఎక్కు పెట్టింది. ప్రజాస్వామ్య పాలన, ప్రతిరోజూ ప్రజా దర్బారు అనే వాగ్దానంతో ఎన్నికల మేనిఫెస్టో మొదలవుతుంది. కేసీఆర్ మీద ప్రజలలోను, నాయకులలోను నిరంతరం వ్యక్తమయ్యే అసంతృప్తి ఒకటే. కేసిఆర్ ప్రజలకు అందుబాటులో ఉండరనేదే ఆ అసంతృప్తి. తమ సమస్యలు విన్నవించుకోవడానికి, తమ గోడు వెల్లడించుకోవడానికి రాజుగారు ప్రజలకు అందుబాటులో లేకుంటే ప్రజల గోడు పట్టించుకునే నాధులు ఎవరు? ఈ విషయంలో కేసీఆర్ తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. సరిగ్గా ఆయువుపట్టు లాంటి ఆ పాయింట్ మీదే కాంగ్రెస్ మేనిఫెస్టో (Manifesto)లో మొదటి వాక్యంలో మొదటి అంశంతోనే దెబ్బ కొట్టింది.

We’re Now on WhatsApp. Click to Join.

ప్రతిరోజూ ప్రజాదర్బార్ ఉంటుందని కాంగ్రెస్ వాగ్దానం చేసింది. అంతేకాదు, కేసీఆర్ గానీ, కేటీఆర్ గానీ ఈమధ్య ప్రతి ఎన్నికల సభలోనూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు అన్యాయం చేసిందని, మొదటిసారి ఉద్యమంలోనూ రెండోసారి ఉద్యమంలోనూ వందలాదిమంది తెలంగాణ కోసం ప్రాణాలు కోల్పోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీయే (Telangana Congress) అని, కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు చేసింది ఏమీ లేదని, మహోధృతంగా ఉద్యమం పైకి లేచిన సందర్భంలో ఇక మరో గత్యంతరం లేక ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ పూనుకుందని బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు. వారే కాదు మరోవైపు బిజెపి కూడా తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసింది కాంగ్రెస్ పార్టీ అని, తెలంగాణ ఉద్యమకారులను చంపించింది కాంగ్రెస్ పార్టీ అని ప్రచారం చేస్తోంది. ఈ విషయంలో ఎంఐఎం కూడా తక్కువ తినలేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో తెలంగాణ సాధన కోసం అమరులైన వారి మీద కేసులన్నీ ఎత్తివేస్తామని, అమరవీరుల ప్రతి కుటుంబానికీ 250 గజాల స్థలాన్ని ఇస్తామని, వారికి పెన్షన్ లాంటి మరిన్ని సదుపాయాలు కలుగ చేస్తామని వాగ్దానం చేసింది. ఈ వాగ్దానం చాలా కీలకమైంది. తెలంగాణ సాధనలో అమరులైన వారి కుటుంబాలను ఆదుకుంటామని అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎన్ని చెప్పినా, అది అమలు జరగలేదన్న అసంతృప్తి వేలాది కుటుంబాల్లో నెలకొని ఉంది.

తెలంగాణ తెచ్చింది మేమేనని ఎన్ని మాటలు చెప్పుకుంటున్నా, ఆచరణలో అమరవీరుల కుటుంబాలకు చేసింది ఏమీ లేదని, అధికారంలోకి వస్తే తామే ఆ కుటుంబాలను ఆదుకుంటామని, ఇది కేవలం వాగ్దానం కాదని, ఏ విధంగా ఎలా ఆదుకుంటారో కూడా వివరంగా ఈ మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ తెలియజేసింది. ఇది కూడా అధికార బీఆర్ఎస్ పార్టీకి ఖంగు తినిపించే విషయమే. చరిత్రలో ఏం జరిగిందో చెప్పుకుంటూ పోతే కాదు, ఇప్పుడు ఆచరణలో ఏం చేస్తామో, చేశామో అనేదే ముఖ్యం.

Telangana Congress Manifesto New 17 Nov 2023

Telangana Congress Manifesto Leaflet PDF

ఉద్యోగాల కల్పనలో కాంగ్రెస్ (Telangana Congress) స్పష్టమైన వాగ్దానం:

గత పదేళ్ళుగా అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఎదుర్కొంటున్న వ్యతిరేకతకు అసలైన కారణం యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించలేదనే అంశమే. ఈ అంశం మీద కాంగ్రెస్, మేనిఫెస్టోలో ఒక స్పష్టమైన వాగ్దానంతో ముందుకు వచ్చింది. ఇప్పటికే రాష్ట్రంలో నోటిఫికేషన్లు రావడం, అవి రద్దు కావడం, పరీక్షలు జరగడం అవి రద్దు కావడం, వాయిదాల మీద వాయిదాలు పడడం, ఇలా ఏళ్ల తరబడి యువత భవిష్యత్తు గందరగోళంలో పడిపోయింది. ఈ విషయంలో తెలంగాణ మొత్తం యువత గుండెల్లో కోపాగ్ని సెగలు రగులుకుంటున్నాయి. అందుకే కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే ఉద్యోగావకాశాలు మెరుగుపరుస్తామని కేవలం వాగ్దానం చేయడమే కాకుండా, ఈ మేనిఫెస్టోలో ఒక జాబ్ క్యాలెండర్ను కూడా రిలీజ్ చేసింది. ఏయే తేదీల్లో డీఎస్సీ, గ్రూప్ 2, గ్రూప్ 1 పరీక్షలు నిర్వహిస్తారో, ఏ తేదీల్లో నియామకాలు నిర్వహిస్తారో సవివరంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొంది. అధికారంలోకి రాకముందే ఇలా తిధులు నక్షత్రాలతో కాంగ్రెస్ పార్టీ వాగ్దానాలు చేయడం విచిత్రంగా ఉందని అధికారంలో ఉన్నవారు అవహేళన చేయవచ్చు. కానీ అధికారంలో ఉండగా ఆ పార్టీ వారు చేయని పనులను ఇదిగో మేము చేస్తామని మాకు ఒక రూట్ మ్యాప్ ఈ విషయంలో స్పష్టంగా ఉందని తెలియజేయడానికే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఈ విధమైన తేదీల వారీగా వాగ్దానం చేసింది.

దీంతోపాటు కీలకమైన ధరణి పోర్టల్ విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఒక స్పష్టమైన వాగ్దానం కనిపించింది. రైతులకు రెండు లక్షల రుణమాఫీ, అలాగే రైతులకు మూడు లక్షల దాకా వడ్డీ లేని రుణ సదుపాయం అంటూ మరో కీలకమైన వాగ్దానాన్ని కాంగ్రెస్ పార్టీ ఈ మేనిఫెస్టోలో పొందుపరిచింది. ఇది కూడా బీఆర్ఎస్ చెబుతున్న రైతుబంధు పథకానికి మెరుగైన ప్రత్యామ్నాయ వాగ్దానంగా ప్రజల ముందుకు తీసుకురావాలని కాంగ్రెస్ యోచనగా కనిపిస్తోంది. ధరణి పోర్టల్ లో ఉన్న అవకతవకలను తొలగించి ‘భూమాత’ పేరు మీద ఒక వ్యవస్థను తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నట్టు తెలియజేసింది. ధరణి పోర్టల్ రద్దు చేస్తారని, మళ్ళీ పటేల్ పట్వారి వ్యవస్థను కాంగ్రెస్ వారు తిరిగి తీసుకొస్తారని కేసిఆర్ చేస్తున్న విమర్శను తిప్పి కొట్టడానికి కాంగ్రెస్ పార్టీ భూమాత వ్యవస్థను ప్రజలకు వాగ్దానం చేసింది.

ఇలా పథకాలు, వాటి అమలు తీరుతెన్నులు విషయంలో తమకు ఎంత స్పష్టత ఉందో కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టో ద్వారా తెలియజేసింది. ఇంకా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువతికి ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ తదితర అంశాలతో కూడిన వాగ్దానాలు కూడా ఈ మేనిఫెస్టోలో ఉన్నాయి. మొత్తం మీద ఎక్కడెక్కడ అధికార బీఆర్ఎస్ పార్టీ లోపాల లోయల్లో కూరుకుపోయిందో అక్కడక్కడ స్పష్టమైన పథకాలతో కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందు నిలవడానికి కఠినమైన పరిశ్రమతో ఈ మేనిఫెస్టో తీసుకు వచ్చినట్లు అర్థమవుతుంది. చూడాలి.

మేనిఫెస్టో ప్రకటించడం వేరు ఆచరణలో అమలు చేయడం వేరు. ఎన్నికల వాగ్దానాలు నీటి మీద రాతలు లాంటివని ప్రజలు ఇప్పటికే తమ అనుభవంతో అనుకుంటూ ఉంటారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఈ వాగ్దానాలన్నీ అమలు చేస్తుందా లేదా అనేది తర్వాత విషయం. కానీ ఈ వాగ్దానాలను ప్రజలు నమ్ముతున్నారా లేదా అనే విషయం మాత్రం డిసెంబర్ 3వ తేదీనే అర్థమవుతుంది.

Also Read:  కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన బాలకిషన్ యాదవ్