తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగింది. రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించిన రెండు ముఖ్యమైన బిల్లులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాలని ఈ నిరసన ద్వారా ఒత్తిడి పెంచుతోంది. ఈ ధర్నాలో కాంగ్రెస్ అగ్ర నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ఇతర ఇండియా కూటమి నాయకులు కూడా పాల్గొనడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఢిల్లీకి చేరుకున్నారు. ఈ నిరసన కేంద్రంపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఈ నిరసనకు ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించి, రాష్ట్రపతి ఆమోదం కోసం పంపిన రెండు బిల్లులు. మొదటిది, తెలంగాణ వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు (విద్యా సంస్థలు, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు) బిల్లు, 2025. ఈ బిల్లు ప్రకారం, విద్యా సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీలకు 42%, ఎస్సీలకు 15%, ఎస్టీలకు 10% రిజర్వేషన్లు కల్పించాలని కోరింది. అయితే, ఇది సుప్రీంకోర్టు నిర్దేశించిన 50% పరిమితిని మించి ఉన్నందున, దీనికి కేంద్ర ప్రభుత్వం చట్టం చేయాల్సి ఉంది. రెండవది, తెలంగాణ వెనుకబడిన తరగతులు (స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు) బిల్లు, 2025, ఇది స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని కోరుతుంది.
Whatsapp New Feature : వాట్సాప్లో కొత్త ఫీచర్.. అకౌంట్ లేని వారితోనూ చాట్ చేయొచ్చు!
ఈ రెండు బిల్లుల ఆమోదం కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చే లక్ష్యంతో ఈ నిరసనను చేపట్టారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. రాష్ట్రం నలుమూలల నుంచి సుమారు 1200 మందికి పైగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ప్రత్యేక రైలులో ఢిల్లీకి తరలివెళ్లారు. పార్లమెంట్‌లో కూడా ఈ విషయంపై చర్చించేందుకు కాంగ్రెస్ ఇప్పటికే వాయిదా తీర్మానాన్ని ఇచ్చింది. ఈ ధర్నా ద్వారా తమ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి, త్వరితగతిన పరిష్కారం లభించాలని కోరుతున్నారు.
బీసీల రాజకీయ, సామాజిక సాధికారతకు ఈ రిజర్వేషన్లు ఎంతో కీలకం అని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ప్రత్యేకించి బీసీల ఓటు బ్యాంకును ఆకర్షించడంలో, వారికి మేలు చేయడంలో ఈ బిల్లులు కీలక పాత్ర పోషిస్తాయని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ ధర్నా ద్వారా తమ నిబద్ధతను చాటి చెప్పడం ద్వారా ప్రజల్లో విశ్వాసం పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పుడు బంతి కేంద్రం కోర్టులో ఉంది, ఈ డిమాండ్లపై కేంద్రం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.