గత ఎనిమిదేళ్లుగా తెలంగాణ కాంగ్రెస్ కు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది టీఆర్ఎస్. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. కానీ భవిష్యత్తులో ఈ పరిస్థితి ఉండకపోవచ్చేమో అన్నట్టుగా రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. కారణం ప్రశాంత్ కిషోర్. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇప్పటికే పీకేతో చర్చలు జరిపింది. ఆయనకు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. దీంతో ఆయన వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా బ్లూప్రింట్ ను ఇచ్చారు. ఇదే క్రమంలో లోకల్ పార్టీలతో పొత్తుల విషయాన్నీ ప్రస్తావించారు. తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడు గుబులు రేపుతోంది ఇదే.
పీకే వ్యూహాన్ని అనుసరించి.. అధిష్టానం ఎక్కడ తమను టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోమంటుందో అని తెలంగాణ కాంగ్రెస్ నేతలు మధనపడుతున్నారు. అందుకే అసలు కారుతో కలిసి ప్రయాణించే ఛాన్సే లేదంటూ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ మాణిక్కం ఠాగూర్ తోపాటు ముఖ్యనేతలంతా వరుస ప్రకటనలు చేస్తున్నారు. ఒకవేళ పొత్తుకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. టీపీసీసీ పరిస్థితి ఏమిటి?
పీకే వ్యూహం ప్రకారం 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-టీఆర్ఎస్ ల మధ్య పొత్తు లేకపోయినా.. 2024 లోక్ సభ ఎన్నికల్లో మాత్రం పొత్తు పెట్టుకోమంటారేమో అని కాంగ్రెస్ వర్గాల్లో అనుమానం ఉంది. ఇదే అభిప్రాయంతో కాంగ్రెస్ క్యాడర్ ఉంటే.. అది అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఫలితం చూపిస్తుందని దానివల్ల ఓటమి తప్పదని ఆందోళన చెందుతోంది. అందుకే రాహుల్ గాంధీతో వరంగల్ సభలోనే ఆ విషయాన్ని చెప్పించడానికి ప్లాన్ చేస్తోంది.
ఎన్నికలకు ఆరు నెలల ముందే అభ్యర్థులను ప్రకటించి ఒంటరిగా బరిలోకి దిగేలా కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన చేస్తోంది. దీంతో టీఆర్ఎస్ పై పోరాడడానికి అన్ని అవకాశాలు ఉంటాయి. దీనివల్ల 2014, 2018 నాటి పరిస్థితి రిపీట్ కాదు. అందుకే టీఆర్ఎస్ తో ఎలాంటి పొత్తు లేదన్న సంకేతాలు పంపించడానికి నానా విధాలుగా ప్రయత్నిస్తోంది.