ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) కొనసాగుతున్న క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth) తీసుకున్న నిర్ణయం దేశప్రజల హృదయాలను గెలుచుకుంది. పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Terror Attack) బాధితుల కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ, కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నెలవేతనాన్ని నేషనల్ డిఫెన్స్ ఫండ్‌కు విరాళంగా ఇవ్వాలని సీఎం సూచించారు. ఈ నిర్ణయం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో చర్చించిన అనంతరం తీసుకోవడం గమనార్హం. దేశ భద్రత కోసం తమ వంతు పాత్ర పోషించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ శాసనసభ్యులు విరాళాల ప్రకటన చేశారు.
Operation Sindoor : అగ్నివీర్ చనిపోతే.. కేంద్రం ఎంత పరిహారం ఇస్తుందంటే..!!
ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో తెలంగాణలో విస్తృత స్థాయిలో జాగ్రత్త చర్యలు తీసుకోవడం జరిగింది. సైనిక దాడులు, యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఎమర్జెన్సీ సర్వీస్ ఉద్యోగుల సెలవులు రద్దు చేశారు. అంతేకాక, సైబర్ సెక్యూరిటీని అప్రమత్తం చేసి ఫేక్ న్యూస్ వ్యాప్తిని నిరోధించే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పోలీసు, ఆర్మీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులతో సమీక్ష నిర్వహించి భద్రతా చర్యలపై దృష్టిసారించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆసుపత్రులు, బ్లడ్ బ్యాంకులు సన్నద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
తెలంగాణలో కేంద్ర సైన్యానికి మద్దతుగా భారీ స్థాయిలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం, ప్రతిపక్ష పార్టీలను కూడా ఇందులో భాగస్వామ్యం చేయడం ద్వారా సీఎం రేవంత్‌రెడ్డి తన నాయకత్వ నైపుణ్యాన్ని చూపారు. ప్రజా ప్రతినిధుల వేతనాన్ని డిఫెన్స్ ఫండ్‌కు విరాళంగా ఇవ్వడం ద్వారా ఆయన దేశ భద్రతపట్ల తన నిబద్ధతను ప్రదర్శించారు. ఇటువంటి క్లిష్ట సమయంలో ప్రజల్లో నైతిక స్థైర్యం నింపుతూ, సైనికులకు పునాదిగా నిలుస్తూ సీఎం రేవంత్ దేశమంతటా ప్రశంసలు అందుకుంటున్నారు.