Meenakshi Natarajan : తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షీ నటరాజన్ క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులపై ఫోకస్ పెట్టారు. అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల స్థాయిలో రాజకీయాలు ఎలా ఉన్నాయి ? ఆయా చోట్ల కాంగ్రెస్ పార్టీ బలాబలాలు ఏమిటి ? అనేది తెలుసుకునే దిశగా ఆమె కసరత్తు చేస్తున్నారు. ఈక్రమంలోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అసెంబ్లీ స్థానాల్లో ఓడిపోయిన పార్టీ అభ్యర్థులు, ఆయా లోక్‌సభ నియోజకవర్గాల ముఖ్య నేతలతో మీనాక్షీ నటరాజన్ వరుస సమావేశాలు జరుపుతున్నారు. తాజాగా బుధవారం రోజు హైదరాబాద్‌లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఆదిలాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, నిజామాబాద్, జహీరాబాద్, మెదక్, మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే అభ్యర్థులతో ఆమె భేటీ అయ్యారు. ఆ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ మీటింగ్‌లో ఒక్కో నేతకు మాట్లాడేందుకు మీనాక్షి 10 నిమిషాల టైం ఇచ్చారు. తాను అడిగిన ప్రశ్నలకు పార్టీ నేతలు చెప్పిన సమాధానాలను ఆమె నోట్ చేసుకున్నారు. ఈవివరాలను మీనాక్షి(Meenakshi Natarajan) క్రోడీకరించి అధిష్టానానికి నివేదిక అందజేస్తారని తెలుస్తోంది. ఈరోజు(గురువారం) కూడా పలు లోక్‌సభ నియోజకవర్గాల నేతలతో మీనాక్షి నటరాజన్ సమావేశం కానున్నారు.
Also Read :Kavitha : ఆ పత్రికది జర్నలిజమా ? శాడిజమా.. ? కవిత ట్వీట్
మీనాక్షీ నటరాజన్ అడిగిన ప్రశ్నలివీ..
- క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితేంటి?
- కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇప్పుడు ఏమనుకుంటున్నారు?
- తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు ఎలా జరుగుతోంది?
- రాష్ట్ర ప్రభుత్వం గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు?
- కాంగ్రెస్ పార్టీ పదవులు ఇచ్చేందుకు పరిగణనలోకి తీసుకోవాల్సిన ప్రాతిపదిక ఏమిటి?
- తెలంగాణలో అసలైన రాజకీయ ప్రత్యర్థిగా బీఆర్‌ఎస్‌ను పరిగణించాలా? బీజేపీని తీసుకోవాలా?
- ఇటీవలే జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణాలు ఏమిటి ?
- ఆదిలాబాద్ జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వెనుకబడటానికి కారణం ఏమిటి ?
కాంగ్రెస్ నేతలు చెప్పిన సమాధానాలివీ..
- కొందరు కాంగ్రెస్ నేతలు పలువురు మంత్రుల వ్యవహారశైలిపై ఫిర్యాదు చేసినట్టు సమాచారం.
- ‘‘ఆపరేషన్ సిందూర్‌ను అకస్మాత్తుగా ఆపాక బీజేపీ, మోడీ గ్రాఫ్ పడిపోయింది.. బీఆర్‌ఎస్‌లో కుటుంబ కలహాలతో కేడర్ నిస్తేజంలో ఉంది.. ఈ టైంలో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళితే మంచి ఫలితాలు వస్తాయి’’ అని పలువురు నేతలు మీనాక్షికి సూచించారు.
- ‘‘నేతల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది’’ అని కొందరు తెలిపారు.
- మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్‌లు తమకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని కోరారు.
- సరస్వతి పుష్కరాల సందర్భంగా అధికారులు ప్రొటోకాల్ పాటించలేదని పెద్దపల్లి ఎంపీ వంశీ, ఆయన తండ్రి వివేక్‌లు మీనాక్షికి ఫిర్యాదు చేశారు.