Site icon HashtagU Telugu

CM Revanth: ‘అదానీ రూ.100 కోట్లు అక్కర్లేదు.. మాకు వద్దని లేఖ రాశాం’ : సీఎం రేవంత్

Telangana Cm Revanth Reddy Rejects 100 Crore Donation From Adani

CM Revanth: అదానీ గ్రూపు అధినేత గౌతం అదానీ సోలార్ పవర్ ప్రాజెక్టులను దక్కించుకునేందుకు రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్లకు ముడుపులు ఇచ్చారనే అభియోగాలతో ఇటీవలే అమెరికాలో కేసులు నమోదయ్యాయి. ఈనేపథ్యంలో ఇవాళ తెలంగాణలో కీలక పరిణామం చోటుచేసుకుంది.  తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ‘యంగ్ ఇండియా’ స్కిల్స్ యూనివర్సిటీకి అదానీ గ్రూపు ఇస్తానన్న రూ. 100 కోట్ల విరాళాన్ని తీసుకునేది లేదని సీఎం రేవంత్ రెడ్డి  అధికారికంగా ప్రకటించారు. గత నాలుగైదు రోజులుగా అదానీ గ్రూపు వ్యవహారంపై తీవ్ర చర్చ జరుగుతున్న  తరుణంలో తాము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. కొంతమంది కుట్రపూరిత దురుద్దేశంతో అదానీ గ్రూపునకు తెలంగాణ ప్రభుత్వంతో లింకులు పెడుతున్నారని రేవంత్ మండిపడ్డారు. ‘‘కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) పాలసీ కింద యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి రూ. 100 కోట్ల విరాళాన్ని ఇస్తామని అదానీ గ్రూపు తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మేం ఆ డబ్బులు తీసుకోవటానికి రెడీగా లేం. ఈవిషయాన్ని మేం లేఖ ద్వారా అదానీ గ్రూపునకు తెలియజేశాం’’ అని సీఎం రేవంత్ చెప్పారు. అదానీ గ్రూపుపై నమోదైన అభియోగాలతో తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి  సంబంధం లేదని తేల్చి చెప్పారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్న తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ రేవంత్ ఈ వివరాలను తెలియజేశారు.

Also Read :Constitution Day 2024 : భారత రాజ్యాంగం@75 ఏళ్లు.. రేపు పార్లమెంటు, సుప్రీంకోర్టులో ప్రధాని ప్రసంగం

‘‘కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు అదానీ గ్రూపుతో ఒప్పందాలు కుదుర్చుకోవడంపై కొందరు అనవసర రాద్ధాంతం చేశారు. మా నాయకుడు రాహుల్ గాంధీని నానా ప్రశ్నలు అడిగారు.  దీనిపై మేం అప్పటికప్పుడు వివరణలు జారీ చేశాం. మా నేత రాహుల్ గాంధీ కూడా దీనిపై వివరణ ఇచ్చారు. చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా టెండర్లను పిలిస్తే అందరికీ సమాన అవకాశాలు ఉంటాయి. ఆ టెండర్లను దక్కించుకునే ప్రక్రియలో ఇతర కంపెనీలతో పాటు అదానీ గ్రూపు కూడా పాల్గొనవచ్చు అని స్వయంగా మా నేత రాహుల్ చెప్పారు. నిబంధనల ప్రకారం అర్హతలు కలిగిన కంపెనీలకు టెండర్లు దక్కుతాయి. ఈవిషయంలో అస్సలు రాజకీయ జోక్యం అనేది ఉండదు’’ అని సీఎం రేవంత్ తెలిపారు.

Also Read :Constitutions Preamble : రాజ్యాంగ ప్రవేశికలోని ‘సెక్యులర్’, ‘సోషలిస్ట్’ పదాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

ఢిల్లీకి వెళ్తున్నా.. లోక్‌సభ స్పీకర్ కూతురి వివాహానికి హాజరవుతా

తన ఢిల్లీ పర్యటనపైనా విమర్శలు చేస్తున్నారని సీఎం రేవంత్ (CM Revanth) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కూతురు వివాహానికి ఢిల్లీకి వెళ్తున్నట్లు తెలిపారు. ఈరోజు జరిగే పర్యటనలో రాజకీయ కోణం అనేది లేదన్నారు. రేపు (మంగళవారం) ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలతో సమావేశమై పార్లమెంట్‌లో లేవనెత్తాల్సిన అంశాలపై డిస్కస్ చేస్తానన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై పార్లమెంట్‌లో మాట్లాడాలని ఎంపీలకు సూచిస్తానని రేవంత్ పేర్కొన్నారు. ఈసారి తన ఢిల్లీ పర్యటనకు తెలంగాణలో మంతివర్గ విస్తరణతో సంబంధం లేదన్నారు. అయితే తెలంగాణలోని వివిధ శాఖల పెండింగ్ పనులకు సంబంధించి పలువురు కేంద్ర మంత్రులను కలుస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులను రాబట్టుకోవడానికి ఎన్నిసార్లైనా ఢిల్లీకి వెళ్తామన్నారు.