Formula E race Case : ఫార్ములా ఈ-రేస్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్‌పై అవినీతి కేసు నమోదుకు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ఏసీబీకి అనుమతి మంజూరు చేశారు. ఫార్ములా ఈ రేస్ నిర్వాహకులకు రూ.55 కోట్ల చెల్లింపుల్లో చోటుచేసుకున్న అక్రమాల అభియోగాలలో అర్వింద్ కుమార్ పాత్రపై ఏసీబీ దర్యాప్తు చేయనుంది. 1988-అవినీతి నిరోధక చట్టంలోని 17(ఏ) నిబంధన కింద అర్వింద్ కుమార్‌ను ఏసీబీ విచారించనుంది. ఇక ఈ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్‌ను విచారించేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి కోసం ఏసీబీ(Formula E race Case) ఎదురు చూస్తోంది. ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించి, కేటీఆర్ విచారణకు అనుమతించాలని ఇప్పటివరకు తెలంగాణ గవర్నర్‌కు సీఎం రేవంత్ మూడుసార్లు రిక్వెస్ట్ చేశారని తెలుస్తోంది. ఈవిషయంలో భారత ప్రభుత్వ అటార్నీ జనరల్ సలహాను గవర్నర్ జిష్ణుదేవ్ అడిగినట్లు సమాచారం. అటార్నీ జనరల్ నుంచి వచ్చే సలహా మేరకు గవర్నర్ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ‘‘పబ్లిక్ సర్వెంట్స్(ఐఏఎస్‌లు)పై విచారణ జరపాలంటే గవర్నర్ నుంచి ముందస్తు అనుమతులను పొందాల్సి ఉంటుంది. అందుకే మేం ఈవిషయంలో తొందరపాటు వైఖరితో నిర్ణయాలు తీసుకోదల్చలేదు’’ అని సీనియర్ ఏసీబీ అధికారి ఒకరు తెలిపారు.
Also Read :Railway Tickets : రూ.100 రైల్వే టికెట్‌లో రూ.46 మేమే భరిస్తున్నాం : రైల్వే మంత్రి
బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్‌లో ఫార్ములా ఈ-రేస్‌ను నిర్వహించినప్పుడు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) కమిషనర్‌గా అర్వింద్ కుమార్ వ్యవహరించారు. సంబంధిత ప్రభుత్వ విభాగాల అనుమతులు లేకుండానే అప్పట్లో ఫార్ములా ఈ రేస్ నిర్వాహకులకు రూ.55 కోట్లు రిలీజ్ అయ్యాయనే ఆరోపణలు ఉన్నాయి. ఇందుకోసం ఆనాడు సంబంధిత శాఖకు మంత్రిగా ఉన్న కేటీఆర్ మౌఖిక ఆదేశాలు ఇచ్చారనే అభియోగాలు ఉన్నాయి. ఈ కేసు రానున్న రోజుల్లో ఎలాంటి మలుపులు తీసుకుంటుందో వేచిచూడాలి.