Site icon HashtagU Telugu

CM KCR : ‘షా’ పై కేసీఆర్ జార్ఖండ్ స్కెచ్?

Kcr Soren Amitshah

Kcr Soren Amitshah

జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవ‌ల త‌ర‌చూ భేటీ అవుతున్నారు. రెండు నెల‌ల వ్య‌వ‌ధిలోనే మూడోసారి క‌లుసుకోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ శ‌నివారం హైదరాబాద్ కు చేరుకున్నారు. ఆయన మూడోసారి సీఎం కేసీఆర్ తో సమావేశమయ్యే ఛాన్స్ ఉంది. అంతకముందు హేమంత్ సోరెన్ తో రెండు సార్లు కేసీఆర్ భేటీ అయిన సంగతి తెలిసిందే. తొలుత ప్ర‌గ‌తి భవన్ లో కేసీఆర్ తో హేమంత్ సోరెన్ సమావేశమయ్యారు. ఆ తర్వాత కొన్ని రోజులకు సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి జార్ఖండ్ వెళ్లారు. సోరెన్ కుటుంబంతో ఆత్మీయ సమావేశం అయ్యారు. హేమంత్ తండ్రి శిబూ సోరెన్ తోనూ కేసీఆర్ సమావేశమై కీలక విషయాలను చర్చించారు. దీంతో శ‌నివారం జ‌రిగే తాజా సమావేశంలో ఎలాంటి అంశాలు చర్చిస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది.

ఢిల్లీ కేంద్రంగా ఎన్టీయే ప్ర‌భుత్వంపై రాజ‌కీయ బాంబు పేల్చుతార‌ని కేసీఆర్ అనుచ‌రులు ఇటీవ‌ల భావిస్తున్నారు. అక్టోబ‌ర్ 2వ తేదీన జాతీయ రాజ‌కీయాల‌పై జెండా, అజెండాను చెబుతార‌ని మంత్రి మ‌ల్లారెడ్డి ఇటీవ‌ల వెల్ల‌డించారు. అదే స‌మ‌యంలో తెలంగాణ ప్ర‌భుత్వం మారబోతుంద‌ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ నాలుగు రోజుల క్రితం వ్యాఖ్యానించారు. ఇంకో వైపు తెలంగాణ బీజేపీ నేత‌లు కేసీఆర్ త్వ‌ర‌లోనే జైలుకు వెళ్ల‌డం ఖాయ‌మంటూ బ‌ల్ల‌గుద్ది చెబుతున్నారు. హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ కు ఈడీ స‌మ‌న్లు ఇచ్చిన రోజున నెక్ట్స్ కేసీఆర్ వంతు అంటూ ప‌లు ప‌త్రిక‌ల్లోనూ, సోష‌ల్ మీడియాలోనూ న్యూస్ వైర‌ల్ అయింది. స‌రిగ్గా ఇలాంటి టైంలోనే హేమంత్ సోరెన్ మూడోసారి సీఎం కేసీఆర్ ను క‌లుస్తున్నారు. గ‌త మూడు నెల‌లుగా ఝార్ఖండ్‌, తెలంగాణ సీఎం ల మ‌ధ్య జ‌రుగుతోన్న భేటీల వెనుక జాతీయ రాజ‌కీయాల కంటే స్నూప్ గేట్ వ్య‌వ‌హారంపై చ‌ర్చించుకున్నార‌ని అత్యంత విశ్వ‌స‌నీయంగా తెలుస్తోంది.

మరో ‘ఎన్‌కౌంటర్’ కేసులో – 2004లో గుజరాత్ పోలీసులచే చంపబడిన 19 ఏళ్ల మహిళ ఇష్రత్ జహాన్ కేసులో సిబిఐ షా పాత్రను విచారించింది. అయితే సీనియర్ అధికారులతో పాటు అతనిని నిందితుడిగా చేయడానికి ఎటువంటి ఆధారాలు లేవని తేల్చింది. కానీ, తెలంగాణ‌లో పోలీసులు ఎన్ కౌంట‌ర్ చేసిన న‌యీమ్ కు , సోహ్రాబుద్దీన్ కు కొన్ని లింకులు ఉన్నాయ‌ని అప్ప‌ట్లో ప్ర‌చారం జ‌రిగింది. గ‌త కొన్నేళ్లుగా న‌యిమ్ డైరీలోని ప‌లు అంశాల‌పై తెలంగాణ పోలీసులు అధ్య‌య‌నం చేస్తున్నారు. ఆ క్ర‌మంలో గుజ‌రాత్ లో ఎన్ కౌంట‌ర్ అయిన సోహ్రాబుద్దీన్ కు కేసు కు లింకు ఉండే కొన్ని అంశాలు న‌యిమ్ డైరీలో దొరికాయ‌ని వినికిడి. సోహ్ర‌బుద్దీన్ కేసును జాతీయ స్థాయిలో తిర‌గతోడే ప్ర‌య‌త్నం ఏదో జ‌రుగుతుంద‌ని కేసీఆర్ గురించి బాగా తెలిసిన బీజేపీ నేత‌లు అనుమానిస్తున్నారు.

సోహ్రాబుద్దీన్‌ షేక్‌, తులసీరామ్‌ ప్రజాపతి బూటకపు ఎన్‌కౌంటర్‌లో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాపై వచ్చిన అభియోగాలు వెనుక రాజకీయ నేపథ్యం గురించి ఎన్డీయే ప్ర‌భుత్వం ఏర్ప‌డ‌క ముందు హ‌ల్ చ‌ల్ చేసింది. సెప్టెంబర్ 2012లో, షాతో సహా 37 మంది నిందితులపై సిబిఐ గుజరాత్ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. షా తనపై కేసు రాజకీయ ప్రేరేపితమని పేర్కొంటూ డిశ్చార్జ్ దరఖాస్తును దాఖలు చేశారు. దాని విచార‌ణ చేసిన త‌రువాత ఆయ‌న‌కు సీబీఐ క్లీన్ చిట్ ఇవ్వ‌డంపై మ‌రోసారి ప్ర‌త్య‌ర్థి పార్టీలు పోస్ట్ మార్టం చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఆ క్ర‌మంలో జార్ఖండ్ సీఎం హేమంత్ సొరెన్, ఆయ‌న తండ్రి శిబూసొరెన్ తో తెలంగాణ సీఎం కేసీఆర్ ర‌హ‌స్య చ‌ర్చ లు జ‌రిపిన‌ట్టు కేంద్ర బీజీపీ అనుమానిస్తోంద‌ట‌.

రెండోసారి సీఎం హేమంత్ సొరెన్, తెలంగాణ సీఎం కేసీఆర్ తో భేటీ అయిన వెంట‌నే ఝార్ఖండ్ లో ఐటీ, ఈడీ దాడులు జ‌రిగాయి. సీఎం హేమంత్ సొరెన్ కు అత్యంత స‌న్నిహితంగా ఉండే ఐఏఎస్ లు ఇత‌ర ఉన్న‌తాధికారుల ఇళ్ల‌లో సోదాలు చేయ‌డం జ‌రిగింది. అంతేకాదు, ఆయ‌న బంధువుల ఇళ్ల‌లోనూ త‌నిఖీలు నిర్వ‌హించ‌డం ద్వారా కోట్లాది రూపాయాల‌ను ఈడీ సీజ్ చేసింది. మ‌నీ ల్యాండ‌రింగ్ జ‌రిగిందని ఈడీ కేసు న‌మోదు చేసింది. ప్ర‌స్తుతం హేమంత్ సొరెన్ తో పాటు ప‌లువురిపై ఈడీ విచార‌ణ కొన‌సాగిస్తోంది. ఇలాంటి త‌రుణంలో మూడోసారి సీఎం కేసీఆర్ ను హేమంత్ క‌లుసుకోవ‌డం గ‌మ‌నార్హం. రేపోమాపో సీఎం కేసీఆర్ తో పాటు ఆయ‌న కుటుంబీకుల ఇళ్ల‌లో త‌నిఖీలు జ‌రుగుతాయ‌ని ప్ర‌చారం ఊపందుకున్న త‌రుణంలో ఇద్ద‌రు సీఎంల భేటీ ప్రాధాన్యం సంత‌రించుకుంది.

ఇటీవలే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో ఆయన భేటీ అయిన విషయమూ విదితమే. ఆ తర్వాత పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తో కలిసి ఢిల్లీ ఉద్యమంలో పాల్గొని ప్రాణాలర్పించిన రైతులకు నివాళులర్పించారు. వారి కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేశారు. అదే సమయంలో యూపీ ప్రతిపక్ష నేత అఖిలేశ్ యాదవ్ తోనూ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఆ తర్వాత బెంగళూరుకు వెళ్లిన కేసీఆర్.. మాజీ ప్రధాని దేవెగౌడ, ఆయన కుమారుడు కుమారస్వామితోనూ మంతనాలు జరిపారు. ప్ర‌స్తుతం హేమంత్ సొరెన్ తోనూ జాతీయ రాజ‌కీయాల‌పై చర్చిస్తార‌ని ప్ర‌గ‌తిభ‌వ‌న్ వ‌ర్గాలు చెబుతున్నాయి. కానీ, తెలంగాణ‌లోనూ, జార్ఖండ్ లోనూ జ‌రుగుతోన్న ప‌రిణామాల‌ను సునిశితంగా ప‌రిశీలిస్తే, ఝర్ఖండ్ కేంద్రంగా బీజేపీ అగ్ర‌నేత‌ల సంచ‌ల‌న `క్లూ`ల‌ను బ‌య‌ట‌పెట్టే ప్ర‌య‌త్నం కేసీఆర్ చేస్తున్నారనే ప్ర‌చారం లేక‌పోలేదు.

తాజాగా కేసీఆర్ పై ఈడీ దాడులు జ‌రుగుతాయ‌ని విస్తృతంగా ప్ర‌చారం జ‌రుగుతోన్న క్ర‌మంలో సొహ్ర‌బుద్దీన్ ఎన్ కౌంట‌ర్ వెనుక వ్య‌వ‌హారాన్ని బ‌య‌ట‌కు తోడేందుకు ప‌క్కా ప్లాన్ జ‌రుగుతోంద‌ని కేసీఆర్ వ్యూహాల గురించి తెలిసిన వాళ్లు ఎవ‌రైనా అనుమానించ‌కుండా ఉండ‌లేరు. ఇదే విష‌యంపై టీఆర్ఎస్ కు చెందిన ఒక కీల‌క నేత ప‌లు అంచ‌నాలు వేశారు. పేరు చెప్ప‌డానికి ఇష్ట‌ప‌డ‌ని ఆయ‌న త్వ‌ర‌లోనే ఢిల్లీ కేంద్రంగా సోహ్ర‌బుద్దీన్ ఎన్ కౌంట‌ర్ వెనుక దాగిన ర‌హ‌స్యాలు జాతీయ స్థాయిలో చ‌ర్చ‌కు వ‌స్తాయ‌ని అంటున్నారు. ఇదంతా కేసీఆర్ బ‌యట పెడ‌తారా? అని ప్ర‌శ్నిస్తే ఆయ‌న మాత్రం ఏమో అంటూ దాట‌వేశారు. మొత్తం మీద జార్ఖండ్ బాంబ్ ను పెట్టి బీజేపీ అగ్ర‌నేత‌ల‌పై పేల్చ‌డానికి కేసీఆర్ సిద్ధం అయ్యాడ‌ని తెలుస్తోంది.