KCR New Party : బీఆర్రెస్సా? గిఆర్రెస్సా? ఎవ‌రు చెప్పిన్రురా బాయ్‌!

తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజ‌కీయాల‌పై మ‌ళ్లీ యూట‌ర్న్ తీసుకున్నార‌ని ఫాంహౌస్ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.

  • Written By:
  • Updated On - June 24, 2022 / 04:30 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజ‌కీయాల‌పై మ‌ళ్లీ యూట‌ర్న్ తీసుకున్నార‌ని ఫాంహౌస్ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చే ప్ర‌తిపాద‌న‌కు శాశ్వ‌తంగా తెర‌ప‌డింద‌ని తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నిక‌లు స‌మీపిస్తోన్న వేళ బీఆర్ఎస్ పార్టీ ప్ర‌యోగం విక‌టించే అవ‌కాశం ఉంద‌ని తెలిసిపోయింద‌ట‌. అందుకే, 2018 ఎన్నిక‌ల‌కు ముందుగా ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ఎలా మూల‌న‌ప‌డిందో, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా క‌నుమ‌రుగు అయిన‌ట్టేన‌ని గులాబీ శ్రేణుల్లోని తాజా టాక్‌.

ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌పై ప్ర‌జ‌లు చ‌ర్చించుకుంటోన్న‌ స‌మ‌యంలో జాతీయ స్థాయి ప్ర‌త్యామ్నాయం అంటూ కేసీఆర్ కొంత కాలం నాట‌కం న‌డిపారు. దుబ్బాక‌, హుజూరాబాద్ ఎన్నిక‌ల ఓట‌మి త‌రువాత కేసీఆర్ స‌ర్కార్ వైఫ‌ల్యాల మీద ప్ర‌తిచోటా చ‌ర్చ మొద‌లైయింది. ఆ విష‌యాన్ని గ్ర‌హించిన కేసీఆర్ తొలుత వ‌రి ధాన్యం కొనుగోలు అంశాన్ని గ‌ల్లీ నుంచి ఢిల్లీ వ‌ర‌కు లొల్లి న‌డిపారు. రెండు నెల‌ల పాటు బీజేపీ, టీఆర్ఎస్ పార్టీ న‌డుమ వ‌రి ధాన్యం కొనుగోలు అంశం న‌డిచింది. చివ‌ర‌కు ఆయ‌న మెడ‌కు ఆ ఇష్యూ చుట్టుకుంటుంద‌ని గ్ర‌హించి కంటితుడుపు చ‌ర్య‌గా కేసీఆర్ స‌ర్కార్ ధాన్యం కొనుగోలు కేంద్రాల‌ను ప్రారంభించింది. ఇన్నేళ్లుగాలేని వ‌రి ధాన్యం కొనుగోలు అంశాన్ని ఈ ఏడాది ర‌చ్చ చేయ‌డంలో కేసీఆర్ రాజ‌కీయంగా స‌క్సెస్ అయ్యారు.

ధాన్యం కొనుగోలు అంశం ముగిసిన త‌రువాత జాతీయ ప్ర‌త్యామ్నాయం అంటూ తెలంగాణ ప్ర‌జ‌ల దృష్టిని ఢిల్లీ వైపే ఉంచ‌గ‌లిగారు. గ‌త నాలుగు నెల‌లుగా రాష్ట్రంలోని ప‌రిపాల‌న మీద మాట్లాడుకోకుండా చేయ‌గ‌లిగారు. స‌ర‌దాగా వివిధ రాష్ట్రాల‌కు వెళ్ల‌డం, అక్క‌డి సీఎంల‌తో భేటీ కావ‌డం వంటి కార్య‌క్ర‌మాల‌తో రెండు నెల‌లు ర‌క్తిక‌ట్టించారు. ఆ త‌రువాత బీఆర్ఎస్ పార్టీ అంటూ ఫాంహౌస్ కేంద్రంగా ప్ర‌శాంత్ కిషోర్‌, విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్‌, త‌మిళ హీరో విజ‌య్ త‌దిత‌రుల‌తో నాట‌కాన్ని ర‌క్తిక‌ట్టించారు. ద‌స‌రా రోజున పార్టీ ఆవిర్భావం ఉంటుంద‌ని లీకులు ఇవ్వ‌డం ద్వారా మీడియా నుంచి కావాల్సినంత ప్ర‌చారం పొందారు. జాతీయ స్థాయి రాజ‌కీయాల గురించి త‌ప్ప ఆయ‌న ప‌రిపాల‌న వైఫ‌ల్యాల‌పై మాట్లాడుకోకుండా తెలంగాణ ప్ర‌జ‌ల మైండ్ ను సెట్ చేశారు. విప‌క్షాలు కూడా ఆయ‌న ట్రాప్ లో ప‌డిపోయాయి. రాష్ట్రంలోని ప‌రిపాల‌న వైఫ‌ల్యాల‌పై ఒక్క‌సారిగా విప‌క్షాలు క్షేత్ర‌స్థాయి పోరాటం ఆపివేయ‌డంతో కేసీఆర్ అనుకున్న‌ది సాధించ‌గ‌లిగారు.

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చీఫ్ ష‌ర్మిల‌, ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ మిన‌హా ప్ర‌ధాన పార్టీలు క్షేత్ర‌స్థాయి ప‌ర్య‌ట‌న‌ల‌కు ప్ర‌స్తుతం దూరంగా ఉన్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ 9ల‌క్ష‌ల కోట్ల అవినీతి చేశాడ‌ని పాల్ సీబీఐకి ఫిర్యాదు చేశారు. గ‌తంలో ఇలాంటి ఆరోప‌ణ‌లు చేసిన బీజేపీ, కాంగ్రెస్ ప్ర‌స్తుతం మౌనంగా చూస్తున్నాయి. ఇదే కేసీఆర్ కు కూడా కావాల్సింది. మొత్తం మీద గ‌త నాలుగు నెల‌లుగా ఫౌంహౌస్ కేంద్రంగా ఆడిన మైండ్ గేమ్ ఫ‌లించ‌డంతో తెలంగాణ‌ ప‌రిపాల‌న గురించి సామాన్య ఓట‌రు కూడా పెద్ద‌గా ప్ర‌స్తావించ‌డంలేదు. ఏ ఇద్ద‌రు క‌లిసిన‌ప్ప‌టికీ కేసీఆర్ పెట్ట‌బోయే బీఆర్ఎస్ పార్టీ గురించి ప్ర‌స్తావించుకోవ‌డం క‌నిపించింది. దానితో పాటు టీఆర్ఎస్ పార్టీ విలీనంపై ప‌లు ర‌కాలుగా మాట్లాడుకోవ‌డం సర్వ‌త్రా వినిపిస్తోంది.

జాతీయ పార్టీ ఆవిర్భావాన్ని ఖరారు చేసేందుకు, టీఆర్‌ఎస్‌కు భారతీయ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)గా నామకరణం చేసేందుకు పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశాన్ని తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిసింది. జూన్ 14న సీఎం కొద్దిమంది మంత్రులు, ఎంపీలు, సీనియర్ నేతలతో మాట్లాడిన సందర్భంగా జూలై 18, 19 తేదీల్లో ఈ అంశాలపై చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని ప్రతిపాదించారు. ప్రతిపాదిత తేదీలను జూన్ 21, 22 తేదీలకు వాయిదా వేసినా కార్యవర్గ సమావేశం జరగలేదు. ఈ సమావేశం ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై పార్టీ వర్గాల్లో స్పష్టత లేదని తెలుస్తోంది. దీంతో పార్టీ అధినేత పున‌రాలోచ‌న చేస్తున్న‌ట్టు ఊహాగానాలు ఊపందుకున్నాయి. సీఎం ఆదేశాల మేరకు మంత్రులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు జాతీయ పార్టీ గురించి మాట్లాడడం ఒక్క‌సారిగా మానేశారు.

జాతీయ రాజకీయాల్లో టీఆర్‌ఎస్ పాత్రపై చర్చించేందుకు జూన్ 15 నుంచి 20 వరకు సీనియర్ నేతలతో వరుస సమావేశాలు నిర్వహించారు కేసీఆర్. వారి నుండి అభిప్రాయాన్ని సేకరించారని, మెజారిటీ అభిప్రాయం జాతీయ పార్టీని ప్రారంభించడానికి అనుకూలంగా ఉందని లీకులు ఇచ్చారు. అయితే టిఆర్‌ఎస్ పేరును బిఆర్‌ఎస్‌గా మార్చడానికి అనుకూలంగా లేదని పార్టీ వర్గాలు తెలిపాయి. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీ పేరు పెడితే రాజకీయంగా పెను ప్రమాదం తప్పదని గ్ర‌హించార‌ట‌. ఈ నేప‌థ్యంలో జాతీయ ప్ర‌త్యామ్నాయ ఎజెండా కు మ‌రింత స‌మ‌యం తీసుకోవాల‌ని సిఎం నిర్ణ‌యించ‌డంతో పాటు రాష్ట్ర క‌మిటీ స‌మావేశాన్ని నిరవధికంగా నిలిపివేసినట్లు తెలుస్తోంది. మొత్తం మీద కేసీఆర్ ఆడిన మైండ్ గేమ్ లో అంద‌రూ ప‌డిపోయారు. అంతా తూచ్ అని తెలుసుకునేలోపు అసెంబ్లీ ఎన్నిక‌లు స‌మ‌యం వ‌చ్చేస్తుంద‌న్న‌మాట‌.