CM KCR : నేడు జ‌గిత్యాల జిల్లాలో సీఎం కేసీఆర్ ప‌ర్య‌ట‌న‌

జ‌గిత్యాల జిల్లాలో నేడు సీఎం కేసీఆర్ ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ ప‌ర్య‌ట‌న‌ చాలాకాలంగా వాయిదా ప‌డుతూ వ‌స్తుంది...

  • Written By:
  • Publish Date - December 7, 2022 / 06:55 AM IST

జ‌గిత్యాల జిల్లాలో నేడు సీఎం కేసీఆర్ ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ ప‌ర్య‌ట‌న‌ చాలాకాలంగా వాయిదా ప‌డుతూ వ‌స్తుంది. అయితే ఎట్ట‌కేల‌కు ఈ రోజు జిల్లాలో సీఎం కేసీఆర్ ప‌ర్య‌టించ‌నున్నారు. 20 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన నూతన కలెక్టరేట్ కాంప్లెక్స్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించ‌నున్నారు… కొత్తగా మంజూరైన మెడికల్ కాలేజీకి శంకుస్థాపన, టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్నిఆయ‌న ప్రారంభించ‌నున్నారు.అనంత‌రం సీఎం కేసీఆర్ బ‌హిరంగ స‌భ‌లో పాల్గొననున్నారు. ఈ స‌భ‌కు రెండు లక్షల మంది ప్రజలు హాజ‌ర‌య్యే అవ‌కాశం ఉంది. బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర కూడా ఈ రోజు (బుధ‌వారం) జగిత్యాల జిల్లాలోకి ప్రవేశిస్తోంది. సీఎం బహిరంగ సభను అడ్డుకునేందుకు బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించవచ్చని ఇంటిలిజెన్స్‌ విభాగం అధికారులకు సమాచారం అందింది.

కొండగట్టు బస్సు ప్రమాద మృతుల కుటుంబ సభ్యులు కూడా నిరసనకు దిగనున్న‌ట్లు స‌మాచారం. అయితే పోలీసులు బీజేపీ నేతలను హౌస్ అరెస్ట్‌లు చేయడం ప్రారంభించారు. కొండగట్టు బాధిత కుటుంబాలు.. సీఎం కాన్వాయ్‌కు అంతరాయం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ముగ్గురు మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌తో పాటు ఎమ్మెల్యేలు సంజయ్‌కుమార్‌, కె.విద్యాసాగర్‌రావు, ఎమ్మెల్సీలు కె.కవిత, ఎల్‌.రమణ, టి.భానుప్రసాద్‌, పాడి కౌశిక్‌రెడ్డిలకు బాధ్యతలు అప్పగించారు. జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి, కరీంనగర్, చొప్పదండి, వేములవాడ, హుజూరాబాద్ నియోజకవర్గాల నుంచి బహిరంగ సభకు జన సమీకరణ చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌ పర్యటన కార్యక్రమం సజావుగా సాగేందుకు జగిత్యాల జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సింధు శర్మ, రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి, డీఎస్పీలు ప్రకాష్, రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తును కట్టుదిట్టం చేశారు. దాదాపు 2,325 మంది పోలీసు సిబ్బంది విధుల్లో ఉన్నారు. అధికార, విపక్షాల మధ్య వాగ్వాదం తారాస్థాయికి చేరుకోవడంతో బీజేపీపై కేసీఆర్ ఏ విధంగా దాడి చేయబోతున్నారనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. టీఆర్ఎస్ నేతలపై జాతీయ దర్యాప్తు సంస్థలు ఇప్పటికే తమ కార్యకలాపాలను ముమ్మరం చేశాయి.