CM KCR : ఢిల్లీ పీఠంపై తెలంగాణ మోడ‌ల్ పాలిటిక్స్

భావోద్వేగాలు, సెంటిమెంట్ నుంచి రాజ‌కీయాన్ని రాజ్య‌ధికారం దిశ‌గా తీసుకెళ్ల‌డం టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కు వెన్న‌తో పెట్టిన విద్య‌.

  • Written By:
  • Publish Date - June 11, 2022 / 02:07 PM IST

భావోద్వేగాలు, సెంటిమెంట్ నుంచి రాజ‌కీయాన్ని రాజ్య‌ధికారం దిశ‌గా తీసుకెళ్ల‌డం టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కు వెన్న‌తో పెట్టిన విద్య‌. తెలంగాణ సెంటిమెంట్ ను ఆత్మాభిమానం కింద‌కు మార్పుచేసి ప్ర‌త్యేక రాష్ట్రాన్ని సాధించిన దిట్ట ఆయ‌న‌. రాజ్యాధికారం కోసం క్షేత్ర‌స్థాయి ప్ర‌ణాళిక‌, రాజ‌కీయ వ్యూహాలు ఉండాల‌ని తొలి నుంచి కేసీఆర్ నమ్ముతుంటారు. అందుకే, ఆయ‌న తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో క్షేత్ర‌స్థాయి సెంటిమెంట్ ను రెచ్చ‌గొడుతూనే రాజ‌కీయ వ్యూహాల‌కు ప‌దును పెట్టారు. ఫ‌లితంగా రెండు ఎంపీల‌తో ప్ర‌త్యేక రాష్ట్రాన్ని సాధించారు. ఇప్పుడూ జాతీయ స్థాయిలో ప్ర‌త్యామ్నాయ ఎజెండా అంటూ ఆయా రాష్ట్రాల‌కు వెళుతున్నారు. రాజ‌కీయ శూన్య‌త ఉన్న రాష్ట్రాల‌ను ఎంచుకున్నారు. ఆయా రాష్ట్రాల్లో గ‌ణ‌నీయ‌మైన ఎంపీల‌ను పొందాల‌ని చూస్తున్నారు. అదే జ‌రిగితే, రెండు ఎంపీల‌తో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన త‌ర‌హాలోనే ఢిల్లీ గ‌ద్దెను ఎక్కొచ్చ‌ని కేసీఆర్ స్కెచ్ వేశార‌ట‌.

తెలంగాణ రాష్ట్ర స‌మితిని భార‌త రాష్ట్రీయ స‌మితిగా మార్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. కొత్త పార్టీ పెడ‌తాన‌ని ఆయ‌న కొన్ని నెల‌ల క్రితం వెల్ల‌డించిన విష‌యం విదిత‌మే. ఆర్థికంగా అన‌తికాలంలోనే అనూహ్యంగా స్థిర‌ప‌డిన క‌ల్వ‌కుంట్ల కుటుంబం దేశ రాజ‌కీయాల‌ను శాసించ‌డానికి సిద్ధం అయింది. ఆ క్ర‌మంలో బీహార్‌, క‌ర్ణాట‌క‌, జార్ఖండ్‌, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి వ‌చ్చే ఎంపీల‌తో కీల‌కం కావాల‌ని చూస్తున్నారు. రాజ‌కీయ శూన్య‌త బీహార్ లో ఉంద‌ని ఆయన విశ్వ‌సిస్తున్నారు. అందుకే, ప్ర‌శాంత్ కిషోర్ కు ఆర్థికంగా స‌హాయ‌స‌హ‌కారాలు అందించ‌డం ద్వారా అక్క‌డ పాగా వేయాల‌ని సూస్తున్నారని టాక్‌. అందుకే, పీకే పాద‌యాత్ర‌కు దిగుతున్నారు. పార్టీ ప్ర‌స్తావ‌న లేకుండా పాద‌యాత్ర‌కు దిగుతున్న ఆయ‌న భార‌త రాష్ట్రీయ స‌మితి త‌ర‌పున బీహార్ వ్యాప్తంగా ఎన్నిక‌ల రంగంలోకి అడుగు పెడ‌తార‌ని తెలుస్తోంది. ఇక జార్ఖండ్ సీఎం హేమంత్ సొరెన్ ఇప్ప‌టికే కేసీఆర్ తో చేతులు క‌లిపారు. ఇద్ద‌రూ ప‌లుమార్లు భేటీ అయ్యారు. జేఎంఎంతో జ‌ట్టు క‌ట్ట‌డం ద్వారా భార‌త రాష్ట్రీయ స‌మితికి జార్ఖండ్ లో పునాది వేయాల‌ని చూస్తున్నారు.

క‌ర్ణాట‌క రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ బ‌లంగా ఉన్న‌ప్ప‌టికీ జేడీఎస్ మూడో బ‌ల‌మైన పార్టీగా ఉంది. దానికి నాయ‌క‌త్వం ఉన్న‌ప్ప‌టికీ ఆర్థిక స‌హాయ స‌హ‌కారాలు అవ‌స‌రం. అందుకే, అక్క‌డ జేడీఎస్ పార్టీతో కేసీఆర్ ఒక అంగీకారానికి వచ్చిన‌ట్టు తెలుస్తోంది. ఎలాగూ , 2019 ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఏపీలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి ఆర్థిక స‌హాయ, స‌హ‌కారాలు పుష్క‌లంగా అందించారు. ప్ర‌తిఫ‌లంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తెలంగాణ వైపు చూడ‌కుండా కేసీఆర్ కు న‌మ్మ‌క‌స్తుడిగా ఉన్నారు. ఇద్ద‌రూ క‌లిసి ఇచ్చుపుచ్చుకునే దిశ‌గా రాజ‌కీయాల‌ను రెండు రాష్ట్రాల్లోనూ న‌డుపుతున్నారు. ఇక దేశ వ్యాప్తంగా సుమారు 11 రాష్ట్రాల్లో ప్ర‌త్యేక వాదం సెంటిమెంట్ ఉంది. దాన్ని ఆయా రాష్ట్రాల్లో రాజేయ‌డం ద్వారా భార‌త రాష్ట్రీయ స‌మితికి పునాదులు వేసుకోవ‌చ్చ‌ని కేసీఆర్ అంచ‌నా వేస్తున్నార‌ట‌. ప‌శ్చిమ బెంగాల్ లోనూ ప్ర‌త్యేక వాదం చాలా కాలంగా ఉంది. బీజేపీ కూడా ఆ రాష్ట్రాన్ని విడ‌దీయాల‌ని చూస్తోంది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ను నాలుగు రాష్ట్రాలుగా విభ‌జించాల‌ని మాయావ‌తి సీఎంగా ఉన్న‌ప్పుడు అసెంబ్లీ తీర్మానం కూడా చేశారు. ఇలాంటి అంశాల‌ను తెర‌మీద‌కు తీసుకురావ‌డం ద్వారా తెలంగాణ త‌ర‌హా రాజ‌కీయానికి కేసీఆర్ ప‌దును పెడుతున్నార‌ట‌.

జాతీయ స్థాయిలో ప్ర‌త్యామ్నాయ ఎజెండాను వినిపిస్తూనే, ఆయా రాష్ట్రాల్లోని ప్ర‌త్యేక వాదం సెంటిమెంట్ ను రెచ్చ‌గొట్టాల‌ని కేసీఆర్ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నార‌ని తెలుస్తోంది. అందుకు సంబంధించిన రూట్ మ్యాప్ ను ఇప్ప‌టికే ప్ర‌శాంత్ కిషోర్ త‌యారు చేశార‌ని వినికిడి. భావోద్వేగాలు, సెంటిమెంట్ ను రెచ్చ‌గొడ్డ‌డం ద్వారా రాజ్యాధికారం పొందొచ్చ‌ని నిరూపించిన కేసీఆర్ అదే త‌ర‌హాలో ఢిల్లీ పీఠాన్ని అందుకోవాల‌ని మాస్ట‌ర్ స్కెచ్ వేశార‌ని ఫాంహౌస్ వ‌ర్గాల టాక్‌. తెలంగాణ ప్ర‌జ‌ల్ని ఆక‌ట్టుకున్న రీతిలో ఆయా రాష్ట్రాల్లోని జ‌నాన్ని న‌మ్మంచ‌గ‌ల‌రా? అనేది చూడాలి.