Early Elections in TS : కేసీఆర్ ‘ముంద‌స్తు’కు ‘జ‌మిలి’ మెలిక‌

తెలంగాణ సీఎం కేసీఆర్ ఎప్పుడు ఎలాంటి వ్యూహాలు ర‌చిస్తాడో..తెలుసుకోవ‌డం కొంచం క‌ష్టం. సన్నిహితంగా ఉండే వాళ్ల‌కు మిన‌హా ఆయ‌న ఎత్తుగ‌డ‌లు అర్థం కావు.

  • Written By:
  • Publish Date - February 2, 2022 / 01:01 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్ ఎప్పుడు ఎలాంటి వ్యూహాలు ర‌చిస్తాడో..తెలుసుకోవ‌డం కొంచం క‌ష్టం. సన్నిహితంగా ఉండే వాళ్ల‌కు మిన‌హా ఆయ‌న ఎత్తుగ‌డ‌లు అర్థం కావు. ఇప్పుడు ఆయ‌న ముంద‌స్తుకు వెళుతున్నాడా? లేదా? అనే చ‌ర్చ జ‌రుగుతోంది. ఆ క్ర‌మంలో ఆయ‌న గ‌తంలో వేసిన రాజ‌కీయ అడుగుల‌ను అవ‌లోక‌నం చేసుకుంటే..ముంద‌స్తు వైపు చూస్తున్నాడ‌ని అర్థం అవుతోంది. అయితే..స‌మ‌యం, సంద‌ర్భం కోసం వేచిచూస్తున్న‌ట్టు అవ‌గ‌తం అవుతోంది. మోడీ స‌ర్కార్ జ‌మిలి మాట‌లు కేసీఆర్ ను ఎప్ప‌టిక‌ప్పుడు పున‌రాలోచ‌న‌లో ప‌డేస్తున్నాయ‌ని వికినిడి. లేదంటే, ఇప్ప‌టికే `ముంద‌స్తు` మీద ఒక క్లారిటీ వ‌చ్చి ఉండేది.ఎలాంటి ప్ర‌త్యేక కార‌ణంగా లేకుండా 2018లో ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు కేసీఆర్ వెళ్లాడు. ఆ ఏడాది మొద‌టి నుంచి విప‌క్షాల‌ను టార్గెట్ చేస్తూ వ‌చ్చాడు. మియాపూర్ భూ కుంభ‌కోణం, కాళేశ్వ‌రం ప్రాజెక్టులోని అవినీతి, మిష‌న్ భ‌గీర‌థ‌, మిష‌న్ కాక‌తీయ అంశాలు, డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం, న‌యీమ్ ఎన్ కౌంట‌ర్ త‌రువాత వ‌చ్చిన భూముల వ్య‌వ‌హారం, ద‌ళితుల‌కు మూడెక‌రాల భూమి త‌దిత‌ర అంశాల‌పై విప‌క్షాలు కేసీఆర్ స‌ర్కార్ ను టార్గెట్ చేశాయి. అసెంబ్లీ లోప‌ల‌, బ‌య‌ట తెలంగాణ స‌ర్కార్ ను బద్నాం చేయ‌డం పెరిగింది. ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త పెరుగుతోంద‌ని స‌ర్వేల ద్వారా ఆనాడు కేసీఆర్ తెలుసుకున్నాడు. సాధార‌ణ ఎన్నిక‌ల‌తో క‌లిసి వెళితే న‌ష్టం జ‌రుగుతుంద‌ని గ్ర‌హించాడు. వెంట‌నే, విప‌క్షాలు చేస్తోన్న ఆరోప‌ణ‌ల‌ను కార‌ణంగా చూపుతూ `ముంద‌స్తు` ఎన్నిక‌ల‌కు 2018లో వెళ్లాడు.

ఇప్పుడు కూడా స‌రిగ్గా 2018 ముంద‌స్తుకు వెళ్లే స‌మ‌యంలో ఉన్న ప‌రిస్థితులు రాష్ట్రంలో క‌నిపిస్తున్నాయి. విప‌క్షాల విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌ల హోరు పెరిగింది. కేసీఆర్ ప్ర‌భుత్వంపై బీజేపీ దూకుడుగా వెళుతోంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత ఆ పార్టీ క్రేజ్ ఎంతోకొంత పెరిగింది. టీఆర్ఎస్ పార్టీ కీల‌క లీడ‌ర్ ఈటెల రాజేంద్ర హుజురాబాద్ ఉప ఎన్నిక‌ల త‌రువాత కేసీఆర్‌కు వ్య‌తిరేకంగా గ్రౌండ్‌వ‌ర్క్ చేస్తున్నాడు.
ఆ ఫ‌లితాలు వ‌చ్చిన త‌రువాత వ‌రి ధాన్యం కొనుగోలు అంశాన్ని గ‌ల్లీ నుంచి ఢిల్లీ వ‌ర‌కు కేసీఆర్ తీసుకెళ్లాడు. ధీటుగా బీజేపీ కూడా తెలంగాణ స‌ర్కార్ మీద యుద్ధం చేసింది. ఉద్యోగుల బ‌దిలీల‌కు సంబంధించిన 317 జీవోపై బీజేపీ మిలియ‌న్ మార్చ్‌కి దిగుతోంది. ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల త‌రువాత కాంగ్రెస్ పార్టీ కూడా దూకుడు పెంచే అవ‌కాశం ఉంది.విప‌క్షాల దూకుడును ప‌సిగ‌ట్టిన కేసీఆర్ గ్రౌండ్ లో టీఆర్ఎస్ పార్టీ బ‌లంపై స‌ర్వేల‌ను కూడా చేయించాడ‌ని తెలుస్తోంది. ప్ర‌తికూల వాతావ‌ర‌ణం క్షేత్ర‌స్థాయిలో ఏర్ప‌డుతుంద‌ని అంచ‌నా వేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇప్పుడున్న వ్య‌తిరేక‌త కంటే రాబోవు రోజుల్లో మ‌రింత పెర‌గ‌డానికి అవ‌కాశం ఉంద‌ని టీఆర్ఎస్ పార్టీలో అంత‌ర్గ‌తంగా చ‌ర్చ జ‌రుగుతోంది. పైగా ఆరు నెల‌ల ముందుగానే అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టిస్తాన‌ని మంగ‌ళ‌వారం జ‌రిగిన మీడియా స‌మావేశంలో ఆయ‌న వెల్ల‌డించాడు. అంటే, ముందస్తుకు కేసీఆర్ మ‌రోసారి రెడీ అవుతున్నాడా? అనే అనుమానం క‌లుగుతోంది.
ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల త‌రువాత బీజేపీ మీద ఎంత వ్య‌తిరేక‌త ఉందో కేసీఆర్ అంచ‌నా వేయ‌బోతున్నాడు. ఆ ఫ‌లితాల ఆధారంగా ముంద‌స్తుకు వెళ్ల‌డ‌మా? లేదా? అనేదాన్ని నిర్థారించ‌బోతున్నాడ‌ని తెలుస్తోంది. సాధార‌ణ ఎన్నిక‌ల కంటే ముందుగా అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు వెళ్లిన కేసీఆర్ 2018లో స‌క్సెస్ అయ్యాడు. ఈసారి సాధార‌ణ ఎన్నిక‌ల‌తో వెళితే, లాభ‌ప‌డే అవ‌కాశం ఉంద‌ని యోచిస్తున్నాడ‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం మోడీ స‌ర్కార్ లోని బీజేపీ మీద వ్య‌తిరేక‌త ఉంద‌ని కేసీఆర్ స‌ర్వేల సారాంశం. ఇదే విధంగా కొన‌సాగితే, 2024 నాటికి పెద్ద ఎత్తున వ్య‌తిరేక‌త కేంద్రంపై వ‌చ్చే ఛాన్స్ ఉంద‌ని అంచ‌నా. అందుకే, జ‌మిలి దిశ‌గా మోడీ ఆలోచిస్తున్నాడు. గ‌ణ‌తంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగంలో కూడా జ‌మిలి ప్ర‌స్తావ‌న వ‌చ్చింది. అంటే, కేంద్రం ప్ర‌భుత్వం ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని భావిస్తోంది. అదే జ‌రిగితే, జ‌మిలి ఎన్నిక‌లు 2023లో జ‌రిగే ఛాన్స్ ఉంది.

మోడీ స‌ర్కార్ 2023 సాధార‌ణ ఎన్నిక‌ల‌కు వెళ్లే ప్ర‌య‌త్నం చేస్తే..అంత‌కంటే ముందు అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని కేసీఆర్ వ్యూహాలు ర‌చిస్తున్న‌ట్టు తెలుస్తోంది. అంటే, ఈ ఏడాది చివ‌రి నాటికి ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేసి ముంద‌స్తుకు వెళ‌తాడ‌ని గులాబీ శ్రేణుల్లోకి టాక్‌. సాధార‌ణ ఎన్నిక‌లు ఎప్ప‌టి మాదిరిగా 2024లో జ‌రిగే అవ‌కాశం ఉంటే మాత్రం కేసీఆర్ ముంద‌స్తుకు వెళ్ల‌డ‌ని తెలుస్తోంది. ఇప్పుడున్న కేసీఆర్ స‌ర్కార్ పూర్తి పాల‌న కాలం వ‌చ్చే ఏడాది డిసెంబ‌ర్ 13వ తేదీ నాటికి ముగుస్తుంది. ఆ తేదీకి ఆరు నెల‌లు ముందుగా ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించ‌డానికి ఎన్నిక‌ల క‌మిష‌న్ కు అధికారం ఉంది. అంటే, వ‌చ్చే ఏడాది జూన్ లేదా జూలై నాటికి ఎన్నిక‌ల షెడ్యూల్ ను ఈసీ ప్ర‌క‌టించ‌డానికి అవ‌కాశం ఉంది. ఆ స‌మ‌యంలోనే ఉత్త‌ర‌భార‌తదేశానికి చెందిన గుజ‌రాత్ తో పాటు మ‌రికొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌లు కూడా ఉన్నాయి. వీట‌న్నింటినీ క్రోడీక‌రించి కేంద్రం జ‌మిలికి కేంద్రం వెళితే..కేసీఆర్ వ్యూహం మారే అవ‌కాశం లేక‌పోలేదు. జ‌మిలి ఎన్నిక‌ల త‌తంగాన్ని బ‌ట్టి తెలంగాణ‌లో `ముంద‌స్తు` వ్యూహం ఉంటుంద‌న్న‌మాట‌.