CM KCR : రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల చౌర‌స్తాలో కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్ మౌనంగా ఉన్నారంటే, ఏదో వ్యూహం ర‌చిస్తున్నార‌ని అర్థం.

  • Written By:
  • Updated On - June 22, 2022 / 10:27 AM IST

తెలంగాణ సీఎం కేసీఆర్ మౌనంగా ఉన్నారంటే, ఏదో వ్యూహం ర‌చిస్తున్నార‌ని అర్థం. ఆ విష‌యం ఆయ‌న పూర్వ‌పు రాజ‌కీయ చ‌తుర‌త‌ను గుర్తు చేసుకుంటే బోధ‌ప‌డుతోంది. జాతీయ స్థాయి రాజ‌కీయాల‌కు వెళ్లాల‌ని దూకుడుగా వెళుతోన్న ఆయ‌న రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో ఏదో ఒక నిర్ణ‌యం తీసుకోవాలి. ఆ ఎన్నిక‌ల‌కు దూరంగా ఉండాలా? వ‌ద్దా? అనే సందిగ్ధం ఇంత వ‌ర‌కు న‌డిచింది. కానీ, విప‌క్షాల ఉమ్మ‌డి అభ్య‌ర్థి య‌శ్వంత్ సిన్హాకు కేసీఆర్ మ‌ద్ధ‌తు ఇస్తార‌ని ఎన్సీపీ నేత శ‌ర‌ద్ ప‌వార్ ఢిల్లీ వేదిక‌గా ప్ర‌క‌టించారు.

విపక్ష పార్టీల లీడ‌ర్లు ఢిల్లీ వేదిక‌గా మంగ‌ళ‌వారం స‌మావేశం అయ్యారు. ఆ స‌మావేశానికి టీఆర్ఎస్ పార్టీ దూరంగా ఉంది. అయిన‌ప్ప‌టికీ సిన్హాకు మ‌ద్ధ‌తు ఇస్తార‌ని శ‌ర‌ద్ ప‌వార్ న‌మ్మ‌కంగా ఉన్నారు. బ‌హుశా వాళ్లిద్ద‌రి మ‌ధ్యా ఫోన్ సంభాష‌ణ జ‌రిగి ఉండొచ్చు. ఇటీవ‌ల ముంబై వెళ్లిన కేసీఆర్ ప్ర‌త్యామ్నాయ ఎజెండా గురించి ప‌వార్ తో చ‌ర్చించిన విష‌యం మ‌న‌కు తెలిసిందే. అంతేకాదు, శివ‌సేన సీఎం ఉద్ద‌శ్ ఠాక్రేను కూడా ఇటీవ‌ల కేసీఆర్ క‌లిశారు. ఆయా పార్టీల‌తో సంప్ర‌దింపులు జ‌రిపిన ఆయ‌న రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల‌కు దూరంగా ఉండ‌లేరు. ఒక వేళ దూరంగా ఉంటే, రాబోవు రోజుల్లో జాతీయ ప్ర‌త్యామ్నాయం ఎజెండాను ముందుకు తీసుకెళ్ల‌డానికి అవ‌రోధాలు ఉంటాయ‌ని టీఆర్ఎస్ లీడ‌ర్లు కొంద‌రు భావిస్తున్నారు.

రెండుసార్లు విప‌క్షాల భేటీ త‌రువాత ఫైన‌ల్ గా సిన్హాను రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించారు. ఆయ‌న మాజీ ప్రధాని వాజ్ పేయ్ హయాంలో ఆర్థిక మంత్రి ప‌నిచేశారు. తొలి నుంచి బీజేపీ భావ‌జాలం ఉన్న ఆయ‌న న‌రేంద్ర మోడీ ప్ర‌ధాన మంత్రి అయిన త‌రువాత ఆయ‌న విధానాల‌ను విభేదిస్తూ పార్టీని వీడారు. ఆ త‌రువాత తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఉపాధ్య‌క్ష ప‌ద‌విని చేప‌ట్టారు. ప్ర‌స్తుతం రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల రేసులో దిగుతోన్న ఆయ‌న టీఎంసీకి రాజీనామా చేశారు. ఆయ‌న రాజ‌కీయ నేప‌థ్యం, న‌రేంద్ర మోడీ విధానాల‌ను వ్య‌తిరేకించిన విధానం త‌దిత‌రాలన్నీ కేసీఆర్‌కు న‌చ్చేలా ఉన్నాయి. అందుకే, టీఆర్ఎస్ పార్టీ సిన్హాకు మ‌ద్ధ‌తు ఇస్తుంద‌ని ప‌వార్ ఆశించి ఉండొచ్చు.

రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌లైన త‌రువాత కేసీఆర్ ఢిల్లీ వైపు చూడ‌లేదు. జాతీయ స్థాయిలో పార్టీని పెట్ట‌డానికి క‌స‌ర‌త్తు చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ జెండా, ఎజెండాను ఫిక్స్ చేయ‌డానికి అధ్య‌య‌నం చేస్తున్నారు. ఉత్త‌ర భార‌త దేశం పెత్త‌నం అనే నినాదాన్ని తీసుకోవాల‌ని భావిస్తున్నారు. ఆ కోణంలో ఆలోచిస్తే, సిన్హాకు మ‌ద్ధ‌తుగా కేసీఆర్ నిలిచే అవ‌కాశం దాదాపుగా లేదు. మ‌రో వైపు ఎన్డీయే అభ్య‌ర్థిని ఎవ‌ర్ని ప్ర‌క‌టిస్తారు అనే అంశంపై కూడా ఆయ‌న ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఎందుకంటే, ఒక వేళ వెంక‌య్య‌నాయుడిని రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా బీజేపీ రంగంలోకి దింపితే తెలుగు రాష్ట్రాల్లోని అన్నీ పార్టీలు సంయుక్తంగా ఆయ‌న‌కు మ‌ద్ధ‌తు ఇస్తారు. తెలుగు వాడిగా ఆయ‌న్ను గుర్తించ‌డంతో పాటు ద‌క్షిణ భార‌త‌దేశం అనే కోణం నుంచి ఫోక‌స్ అవుతారు. అందుకే, ఇప్ప‌టి వ‌ర‌కు కేసీఆర్ రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల గురించి ప్ర‌స్తావ‌న చేయ‌లేదు. బ‌హుశా ఎన్డీయే అభ్య‌ర్థిని ప్ర‌క‌టించిన త‌రువాత ఏదో ఒక నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టిస్తార‌ని టీఆర్ఎస్ శ్రేణులు ఆశిస్తున్నారు. కానీ, ఎన్సీపీ నేత శ‌ర‌ద్ ప‌వార్ మాత్రం కేసీఆర్ మ‌ద్ధ‌తు ఇస్తార‌ని చెప్ప‌డం వెనుక ఆంత‌ర్యం ఏమిటో చూద్దాం!