CM KCR : `పాల పిట్ట‌` పంజ‌రంలో కేసీఆర్‌

తెలంగాణ సీఎం కేసీఆర్ సెంటిమెంట్ ప‌రాకాష్ట‌కు చేరింది. ద‌స‌రా రోజున పాల‌పిట్ట‌ను చూస్తే మంచిద‌ని ఏకంగా ప్ర‌గ‌తిభ‌వ‌న్ కు తెప్పించారు.

  • Written By:
  • Publish Date - October 7, 2022 / 01:47 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్ సెంటిమెంట్ ప‌రాకాష్ట‌కు చేరింది. ద‌స‌రా రోజున పాల‌పిట్ట‌ను చూస్తే మంచిద‌ని ఏకంగా ప్ర‌గ‌తిభ‌వ‌న్ కు తెప్పించారు. పంజ‌రంలో బంధించిన పాల‌పిట్ట‌ను ద‌ర్శించుకున్నారు. కుటుంబ స‌మేతంగా పాల‌పిట్ట‌ను ప్ర‌గ‌తిభ‌వ‌న్లో ద‌ర్శించుకున్న ఫోటో ఇప్పుడు వివాద‌స్ప‌దం అయింది.

వైల్డ్ లైఫ్ ప్రొటెక్ష‌న్ యాక్ట్ 1972 ప్ర‌కారం పాల‌పిట్ట‌ను పంజ‌రంలో బంధించ‌డం నేరం. అంతేకాదు, దాన్ని ప్ర‌గ‌తిభ‌వ‌న్ కు తీసుకురావ‌డం మ‌రో నేరం కింద ప‌రిగ‌ణించాలి. పైగా తెలంగాణ వైల్డ్ లైఫ్ ప్రొటెక్ష‌న్ బోర్డుకు కేసీఆర్ చైర్మ‌న్ గా ఉన్నారు. ఆయ‌నే చ‌ట్టాన్ని ధిక్క‌రిస్తూ పాల‌పిట్ట‌ను బంధించారు. దీంతో బీఆర్ఎస్ ఆవిర్భావం మ‌రుస‌టి రోజు నుంచి వివాదంలోకి వెళ్లారు కేసీఆర్‌.

తెలంగాణ రాష్ట్ర అధికార ప‌క్షి పాల‌పిట్ట‌. దాన్ని కాపాడుకోవడానికి ప్ర‌త్యేకంగా శ్ర‌ద్ధ పెట్టాలి. సీఎం హోదాలో ఉన్న కేసీఆర్ ఆ పిట్టను బంధించ‌డం వ‌న్య‌ప్రాణుల ప్రేమికుల‌కు బాధ క‌లిగిస్తోంది. ఆయ‌న సెంటిమెంట్ కు ఇదో ప్ర‌త్య‌క్ష నిద‌ర్శ‌నంగా నిలుస్తోంది. అప్ప‌ట్లో స‌చివాల‌యం నిర్మాణం, యాదాద్రి పున‌ర్నిర్మాణం ఇలా ప్ర‌తి అంశాన్ని సెంటిమెంట్ గానే చూశారు. ఆయ‌న ఇప్ప‌టికీ బాస‌ర టెంపుల్ కు వెళ్లరు. సెంటిమెంట్ ను ఆయ‌న నెత్తికెత్తుకోవ‌డంతో పాటు రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికీ రుద్దుతున్నారు. పాల పిట్ట వివాద‌మైన ఆయ‌న మూర్ఖ‌పు సెంటిమెంట్ కు స‌మాధానం ఇస్తుంద‌ని ఆశిద్దాం.