Site icon HashtagU Telugu

CM KCR : వ‌చ్చే నెల‌ కేసీఆర్ ఎన్నిక‌ల శంఖారావం?

Telangana Election

Kcr Election

తెలంగాణ సీఎం కేసీఆర్ ఎన్నిక‌ల శంఖారావాన్ని పూరించ‌బోతున్నారు. ముంద‌స్తు లేదంటూనే ఆ దిశ‌గా ఆయ‌న అడుగులు వేస్తున్నారు. మ‌రో 10నెలల్లో ఎన్నికలు ఉన్నాయ‌ని గుర్తు చేస్తున్న ఆయ‌న డిసెంబ‌ర్ 4న మ‌హ‌బూబ్ న‌గ‌ర్ నుంచి ప్ర‌చారానికి శ్రీకారం చుడ‌తార‌ని పార్టీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. మినీ ట్యాంక్‌బండ్‌ వద్ద పలు అభివృద్ధి కార్యక్రమాలను కేసీఆర్ ప్రారంభిస్తారు. అనంతరం బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తరువాత మహబూబాబాద్, సూర్యాపేటల్లో ఏర్పాటు చేసే బహిరంగ సభల్లో కేసీఆర్ పాల్గొంటారని గులాబీ శ్రేణుల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.

ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లోనే ఉండాలని, ప్రజలకు అందుబాటులో ఉండాలని కేసీఆర్ ఇప్ప‌టికే సూచించారు. వచ్చే 10 నెలల్లో యుద్ధ ప్రాతిపదికన పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయాలని ఆదేశించారు. 2023 డిసెంబర్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేసేందుకు బహిరంగ సభల్లో ప్రసంగించడంతోపాటు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు, పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు అన్ని జిల్లాల్లో పర్యటనలు చేస్తానని ఎమ్మెల్యేలకు హామీ ఇచ్చారు. అందులో భాగంగా తొలుత మ‌హ‌బూబ్ న‌గ‌ర్ ప‌ర్య‌ట‌న‌కు కేసీఆర్ వెళుతార‌ని తెలుస్తోంది.

Also Read:  Kishan Reddy : టీఆర్ఎస్ చేస్తోన్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని కార్యకర్తలకు కేంద్రమంత్రి పిలుపు..!!

పార్టీ షెడ్యూల్ ప్ర‌కారం ముఖ్యమంత్రి కేసీఆర్ డిసెంబర్ 4వ తేదీన మహబూబ్‌ నగర్ జిల్లాలో ప‌ర్య‌టిస్తారు. ఆ రోజు భారీ బహిరంగ సభను నిర్వ‌హిస్తారు. ఆ సభ ద్వారా 2023 అసెంబ్లీ ఎన్నికల ప్ర‌చారానికి శ్రీకారం చుడ‌తార‌ని తెలుస్తోంది. ఆ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలకు స‌భ స‌క్సెస్ బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించార‌ని స‌మాచారం. లక్ష మందికి పైగా ప్రజలను ఈ సభకు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకు అనుగుణంగా తరలింపు కోసం సమాయాత్తమౌతోన్నారు.

మహబూబ్ నగర్ జిల్లా పర్యటన సందర్భంగా కేసీఆర్ కొత్తగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కార్యాలయ భవన సముదాయాన్ని ప్రారంభిస్తారు. టీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయాన్ని అందుబాటులోకి తీసుకుని రానున్నారు. పాత కలెక్టరేట్‌ స్థలంలో ప్రభుత్వ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఆ త‌రువాత జ‌రిగే బ‌హిరంగ స‌భ‌లో కీల‌క ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశం ఉంద‌ని పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.

Also Read:  DHO Srinivas Sensational Comments: సీఎం కేసీఆర్ కాళ్లు వందసార్లు మొక్కుతా… మీకేమైనా ప్రాబ్లమా?

ఈ నెల 15వ తేదీన తెలంగాణ భవన్‌లో నిర్వహించిన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల సమావేశం జ‌రిగిన విష‌యం విదిత‌మే. ఆ సంద‌ర్భంగా ముందస్తుకు వెళ్లదలచుకోలేదని, షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. కానీ, ఎన్నికల సంవత్సరంలోకి అడుగుపెట్టామనీ అన్నారు. అక్టోబర్ 2023 తరువాత ఎప్పుడైనా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడొచ్చనే సంకేతాలు ఇచ్చార‌ని తెలుస్తోంది.

Exit mobile version