CM KCR : ఎన్నిక‌ల దిశ‌గా గులాబీ బాస్ `బ్లూ ప్రింట్‌`

ఎన్నిక‌ల దిశ‌గా తెలంగాణ సీఎం కేసీఆర్ వేగంగా అడుగులు వేస్తున్నారు. ప్ర‌జా క్షేత్రాన్ని సానుకూలంగా మ‌లుచుకోవ‌డానికి ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

  • Written By:
  • Updated On - November 25, 2022 / 01:16 PM IST

ఎన్నిక‌ల దిశ‌గా తెలంగాణ సీఎం కేసీఆర్ వేగంగా అడుగులు వేస్తున్నారు. ప్ర‌జా క్షేత్రాన్ని సానుకూలంగా మ‌లుచుకోవ‌డానికి ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఆ క్ర‌మంలో కేంద్రాన్ని ప్ర‌తి అంశంలోనూ టార్గెట్ చేస్తూ వెళ్లాల‌ని స్కెచ్ వేశారు. అందుకు అసెంబ్లీని తొలుత‌ వేదిక‌గా చేసుకోబోతున్నారు. డిసెంబ‌ర్లో శీతాకాల స‌మావేశాలను నిర్వ‌హించ‌డం ద్వారా మోడీ స‌ర్కార్ ను ఎండ‌గ‌ట్టాల‌ని `డేటా` బ‌య‌ట‌కు తీస్తున్నారు. కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల హడావుడితో పాటు గ‌త ఆర్థిక సంవ‌త్స‌రం నుంచి ఉద్దేశ‌పూర్వ‌కంగా తెలంగాణ ప్ర‌గ‌తిని అడ్డుకున్న వైనంపై ఫోక‌స్ పెట్టాల‌ని మంత్రుల‌కు కేసీఆర్ దిశానిర్దేశం చేసిన‌ట్టు తెలుస్తోంది.

క‌నీసం వారం నుంచి 15 రోజుల పాటు అసెంబ్లీని నిర్వ‌హించ‌డం ద్వారా ప్ర‌జాక్షేత్రాన్ని అనువుగా మ‌లుచుకుని జిల్లాల ప‌ర్య‌ట‌న‌ల‌కు వెళ్లాల‌ని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నార‌ని గులాబీ శ్రేణుల్లోని వినికిడి. స‌రిగ్గా ఇలాంటి అడుగులే 2018 అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు గులాబీ బాస్ వేసిన విష‌యం అందిరికీ గుర్తుండే ఉంటుంది. ఏ మాత్రం కేంద్ర ఎన్నిక‌ల సంఘం నుంచి అనుకూల సిగ్న‌ల్ ల‌భించినా వెంట‌నే ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేసి ఈసారి ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ‌తార‌ని తెలుస్తోంది. ఎనిమిదేళ్ల రాష్ట్ర ప‌రిపాల‌నపై చ‌ర్చ జ‌ర‌గ‌కుండా రాజ‌కీయ టెంపో క్రియేట్ చేయాల‌ని స్కెచ్ వేస్తున్నార‌ని స‌మాచారం.

తెలంగాణ‌పై కేంద్రం ఆంక్షల గురించి అసెంబ్లీ వేదిక‌గా `డేటా`ను బ‌య‌ట‌పెట్టేందుకు కేసీఆర్ `బ్లూ ప్రింట్`ను సిద్ధం చేశార‌ని తెలుస్తోంది. మోడీ స‌ర్కార్ కార‌ణంగా 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్రానికి రూ.40 వేల కోట్ల రూపాయల ఆదాయం తగ్గిందని అంచ‌నా వేస్తున్నారు. ఆ విష‌యాన్ని తెలియ‌చేయ‌డం ద్వారా తెలంగాణ‌ ప్రగతికి కేంద్రం ఎలా అడ్డుతగులుతోందో చెప్పాల‌ని యోచిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేంద్రం ఆంక్షలపై సమావేశాల్లో చర్చిద్దామని మంత్రుల‌కు దిశానిర్దేశం చేశార‌ట‌.

అసెంబ్లీ త‌రువాత సుడిగాలి ప‌ర్య‌ట‌న‌ల‌కు గులాబీ బాస్ తెర‌లేప‌నున్నారు. వ‌చ్చే ఏడాది డిసెంబ‌ర్ ఆఖ‌రికి ప్ర‌భుత్వ గ‌డువు ఉన్న‌ప్ప‌టికీ ఆరు నెల‌లు ముందుగా ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని గులాబీ బాస్ తలోపోస్తున్నార‌ట‌. ఒక వేళ ప్ర‌భుత్వాన్ని అసెంబ్లీ స‌మావేశాల త‌రువాత ర‌ద్దు చేస్తే వెంట‌నే ఎన్నిక‌ల‌కు నిర్వ‌హించకుండా గ‌వ‌ర్న‌ర్ పాల‌న‌కు సిఫార‌స్సు చేస్తే మొద‌టికే మోసం వ‌స్తుందని శ్రేణుల్లో వినిపిస్తోంది. ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లిన చంద్ర‌బాబు కూడా 2004 ఎన్నిక‌ల్లో దెబ్బ‌తిన్నారు. ఆనాడు జ‌రిగిన ఎపిసోడ్ ను గుర్తు చేసుకుంటూ కేసీఆర్ ఆచితూచి అడుగు వేస్తున్నారు. అంతిమంగా కేసీఆర్ ఎలాంటి వ్యూహాన్ని అనుస‌రిస్తారో చూడాలి.