Site icon HashtagU Telugu

Chandrababu KCR : గురువును మించ‌ని శిష్యుడు

Modi Kcr Babu

Modi Kcr Babu

తెలంగాణ సీఎం కేసీఆర్ దేశ ప‌ర్య‌ట‌న రాబోవు రాజ‌కీయ పొత్తుల‌కు తెర‌దీస్తోంది. జాతీయ ప్ర‌త్యామ్నాయ ఎజెండా అంటూ ఢిల్లీ వెళ్లిన ఆయ‌న వివిధ‌ పార్టీల చీఫ్ ల‌తో భేటీ అవుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆప్ చీఫ్ కేజ్రీవాల్‌, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాద‌వ్ ను క‌లిశారు. బీఎస్పీ చీఫ్ మాయావ‌తిని కూడా క‌లిసే అవ‌కాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలోని రాజ‌కీయ ప‌రిస్థితుల‌కు అనుగుణంగా ఆయ‌న జాతీయ పొత్తును పెట్టుకుంటార‌ని తాజాగా ప్ర‌చారం మొద‌లైయింది.

ఆప్ ప‌లు రాష్ట్రాల్లో ఇప్ప‌టికే పాగా వేసింది. పంజాబ్ , ఢిల్లీ రాజ‌కీయాల్లో రాజ్యాధికారం చెలాయిస్తోంది. గోవా, మ‌హారాష్ట్ర లాంటి చోట్ల ఎంతో కొంత ఉనికిని చాటుకుంటోంది. రాబోవు రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో పాగా వేయాల‌ని తీవ్రంగా ప్ర‌య‌త్నం చేస్తోంది. అందుకు సంబంధించిన ప్ర‌ణాళిక‌ను త‌యారు చేసుకుని పాద‌యాత్ర‌ను నిర్వ‌హిస్తోంది. ఆప్ మంత్రులు తెలంగాణ‌కు ప‌లు సంద‌ర్భాల్లో వ‌చ్చారు. క్యాడ‌ర్ ను బ‌లోపేతం చేయాల‌ని ఆలోచిస్తోంది. ఇంకో వైపు ఎస్పీ పార్టీ సామాజికంగా బీసీ వ‌ర్గానికి ఐకాన్ గా ఉంది. బీసీల‌కు ఇటీవ‌ల తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రాధాన్యం పెరిగింది. రాజ్యాధికారం దిశ‌గా అడుగులు వేస్తున్నారు. అలాంటి బ‌ల‌మైన వ‌ర్గాన్ని టీఆర్ఎస్ పార్టీ ఓన్ చేసుకోవ‌డానికి ఎస్పీని ప్ర‌యోగించ‌డానికి ఏ మాత్రం సంకోచించ‌దు. ఇక బీఎస్పీ పార్టీ దళితుల‌కు ఐకాన్ గా ఉంది. ఆ పార్టీ తెలంగాణ క‌న్వీన‌ర్ ఆర్ ఎస్ ప్ర‌వీణ్ కుమార్ ఇప్ప‌టికే రాష్ట్ర వ్యాప్తంగా ప‌ర్య‌టిస్తున్నారు. స్వారోల రూపంలో బీఎస్పీని బ‌లోపేతం చేస్తున్నారు. ఆ విష‌యాన్ని గ‌మ‌నించిన కేసీఆర్ బీఎస్పీ చీఫ్ మాయావ‌తిని క‌ల‌వాల‌ని ప్ర‌య‌త్నం చేస్తున్నారట‌. జాతీయ స్థాయిలో ఎస్పీ, బీఎస్పీ, ఆప్ పార్టీల‌తో పొత్తు పెట్టుకుంటే రాష్ట్రంలోనూ సామాజిక‌వ‌ర్గాల ప‌రంగా ఓటు బ్యాంకు పెరుగుతుంద‌ని కేసీఆర్ మాస్ట‌ర్ ప్లాన‌ట‌. అందుకే, జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతూ రాష్ట్రంలో మూడోసారి సీఎం కావ‌డానికి ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని వినికిడి.

2009 ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబానాయుడు ప్ర‌స్తుతం కేసీఆర్ చేసిన ప్ర‌య‌త్నం చేశారు. జాతీయ నేత‌ల‌ను ఉమ్మ‌డి ఏపీకి తీసుకొచ్చి ప్ర‌చారం చేయించారు. ఢిల్లీ వ్యూహాల‌కు అనుగుణంగా ఆనాడు అనివార్యంగా టీడీపీతో ఉభ‌య క‌మ్యూనిస్ట్ లు జై కొట్టాల్సి వ‌చ్చింది. అంతేకాదు, ఆ ఎన్నిక‌ల్లో ఏర్ప‌డిన కూట‌మిలో టీఆర్ఎస్ పార్టీ కూడా ఉంది. రెండోసారి వైఎస్
స‌ర్కార్ రాకుండా చేయాల‌ని జాతీయ స్థాయిలో వ్యూహాల‌ను ర‌చించిన చంద్ర‌బాబు రాష్ట్రంలో అమ‌లు చేశారు. సీన్ క‌ట్ చేస్తే, రెండోసారి సీఎంగా వైఎస్ గెలిచారు. ఆనాడు చంద్ర‌బాబు చేసిన జాతీయ పాలిటిక్స్ వ్యూహాల మాదిరిగానే కేసీఆర్ ఇప్పుడు వేస్తున్నారు. మూడోసారి సీఎం కావ‌డానికి జాతీయ స్థాయి రాజ‌కీయ వ్యూహాలు అవ‌స‌ర‌మ‌ని ఆయ‌న భావిస్తున్నార‌ట‌. కాంగ్రెస్, బీజేపీని ఢీ కొట్టాలంటే కూట‌మిని ఏర్పాటు చేయాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ని తెలుస్తోంది. ఆ క్ర‌మంలోనే ఎస్పీ,బీఎస్పీ, ఆప్ త‌దిత‌ర పార్టీల చీఫ్ ల‌తో ఢిల్లీ వేదిక‌గా స‌మావేశాలు నిర్వహిస్తున్నార‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

సాధార‌ణంగా జాతీయ స్థాయి ప్ర‌త్యామ్నాయ ఎజెండా త‌యారు చేయాలంటే మేధావులు, వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖుల‌తో భేటీ కావాలి. కానీ, కేసీఆర్ మాత్రం బీజేపీ, కాంగ్రెసేత‌ర పార్టీల చీఫ్ ల‌ను క‌లుసుకుంటున్నారు. వాళ్ల మ‌ద్ద‌తుతో రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వికి పోటీ ప‌డాల‌ని చూస్తున్నార‌ట‌. ఇలా హ‌డావుడి చేస్తున్న కేసీఆర్ ను ఢిల్లీ బీజేపీ అధిష్టానం పిలిచి మాట్లాడుతుంద‌ని ఒక అంచ‌నా గా ఉంది. అప్పుడు ఉప‌రాష్ట్ర‌ప‌తి ప‌ద‌విని చేజిక్కించుకోవ‌చ్చ‌నే ఎత్తుగ‌డ కూడా ఉంద‌ని కేసీఆర్ స‌న్నిహితుల్లోకి టాక్‌. మొత్తం మీద కేసీఆర్ హ‌వావుడిని గ‌మ‌నిస్తోన్న బీజేపీ స‌రైన స‌మ‌యంలో స‌రైన విధంగా బాబుకు ఇచ్చిన‌ట్టు జ‌ల‌క్ ఇస్తుందా? లేక కేసీఆర్ ను మ‌రో విధంగా వాడుకుంటుందా? అనేది చూడాలి.