CM KCR: కేసీఆర్ కు ఉన్న ఆ ఒక్క ఆశా.. పాయే! ఫెడరల్ ఫ్రంట్ ఇక చరిత్రేనా?

అయిపోయింది.. ఉన్న ఆ ఒక్క ఆశ కూడా అడుగంటిపోయింది.

  • Written By:
  • Publish Date - April 18, 2022 / 01:00 PM IST

అయిపోయింది.. ఉన్న ఆ ఒక్క ఆశ కూడా అడుగంటిపోయింది. ఫెడరల్ ఫ్రంట్ ను ఏర్పాటుచేసి దాని ద్వారా బీజేపీపై సమరాన్ని ఉధృతం చేయాలనుకున్న కేసీఆర్ ఆశలకు అప్పుడే గండి కొట్టేశాయి మిగిలిన రాజకీయపార్టీలు. కాంగ్రెస్ పార్టీ లేకుండానే ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేద్దాం అంటూ బీజేపీయేతర సీఎంలతో కలిసి ముందుకెళ్లేలా కేసీఆర్ స్కెచ్ వేశారు. కానీ కాంగ్రెస్ లేకుండా ఈ ఫ్రంట్ ఏర్పాటు సాధ్యం కాదని.. 13 పార్టీలు తేల్చేశాయి. పైగా ఆ 13 పార్టీల సంయుక్త ప్రకటనలో అసలు కేసీఆర్ పేరే లేకపోవడంతో రాజకీయాల్లో ఇదో పెద్ద చర్చనీయాంశంగా మారింది. టీఆర్ఎస్ 21 ఏళ్ల పుట్టినరోజుకు ముందు ఇది ఆ పార్టీకి గట్టి దెబ్బే అని విశ్లేషకులు అంటున్నారు.

ఒకప్పుడు ఏ కాంగ్రెస్ పార్టీకైతే వ్యతిరేకంగా పావులు కదిపి ప్రచారం చేశాయో..అవే పార్టీలు ఇప్పుడు కాంగ్రెస్ నువ్వే మాకు దిక్కు అంటూ మోకరిల్లుతున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీతోపాటు తృణమూల్ కాంగ్రెస్ కూడా అదే బాటలో ఉన్నాయి. అందుకే అరవింద్ కేజ్రీవాల్, మమతాబెనర్జీలు కూడా కాంగ్రెస్ తో జట్టుకు తహతహలాడడం వెనుక అసలు ఉద్దేశం.. ఆ పార్టీకి ఉన్నంత జాతీయ స్థాయి నెట్ వర్క్ వీటికి లేకపోవడమే.

ఇలాంటి సమయంలో కేసీఆర్ ను గుర్తించి తగురీతిలో ఆయనకు తమ జట్టులో చోటు కల్పించడానికి కూడా ఆ పార్టీలు ఆసక్తిని చూపించలేదు. అయినా కేసీఆర్ ఢిల్లీ దీక్షకు విపక్షాల నుంచి సంఘీభావమే కొరవడింది. టికాయత్ తప్ప వేరే పార్టీల నేతలు ఎక్కడా ఆయనకు మద్దతుగా నిలవలేదు. దీక్ష చేసింది కూడా ఢిల్లీలోనే కనుక.. వివిధ పార్టీల నేతల ప్రతినిధులు అయినా వచ్చి మద్దతు తెలిపే అవకాశం ఉన్నా అలాంటిది జరగలేదు.

2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగే 7 రాష్ట్రాల ఎన్నికల్లో ప్రధాన పార్టీగా కాంగ్రెస్ పార్టీయే నిలుస్తుంది. అందుకే ఆ పార్టీని కాదని బీజేపీయేతర కూటమిని బలంగా ఉంచడం అసాధ్యమని విపక్షాలకు అర్థమైంది. రాజకీయంగా చూస్తే.. కేసీఆర్ ఫ్రంట్ కు ఇప్పుడు చోటు లేదంటున్నారు విశ్లేషకులు. దీంతో గులాబీబాస్ ఇప్పుడు ఎలాంటి స్కెచ్ తో ముందుకు వెళతారో చూడాలి.