CM KCR : కేసీఆర్ `పొలిటిక‌ల్ ఫార్ములా` ఛేంజ్ !

తెలంగాణ సీఎం కేసీఆర్ ఎప్ప‌టికప్పుడు ఎత్తుగ‌డ‌లు మార్చేస్తుంటారు. ఎప్పుడూ ఒకే ఫార్ములాను అనుస‌రించ‌రు. ఆ

  • Written By:
  • Publish Date - September 22, 2022 / 02:29 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్ ఎప్ప‌టికప్పుడు ఎత్తుగ‌డ‌లు మార్చేస్తుంటారు. ఎప్పుడూ ఒకే ఫార్ములాను అనుస‌రించ‌రు. ఆ విష‌యాన్ని ఆయ‌నే ప‌లు సంద‌ర్భాల్లో మీడియాకు చెప్పారు. 2018 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఉప‌యోగించిన సూత్రాన్ని ఇప్పుడు ఉప‌యోగించ‌ను, ఈసారి వేరే ఎత్తుగ‌డ ఉంటుంద‌ని ఇటీవ‌ల చెప్పారు. అదేంటో ఇప్పుడు ఎందుకు చెప్తాం, త‌రువాత మీకే తెలుస్తుందని మీడియాను ఉద్దేశించి అన్నారు. కానీ, ఆయ‌న వెళుతోన్న పంథాను గ‌మ‌నిస్తే, తొలుత మ‌మ‌త ఫార్ములాతో దూకుడుగా వెళ్లిన‌ట్టు క‌నిపిస్తోంది. ఫ‌లితం ఆశించిన స్థాయిలో ఉండ‌ద‌ని గ్ర‌హించి కేజ్రీవాల్ సూత్రాన్ని అందుకున్న‌ట్టు తెలంగాణ భ‌వ‌న్ వ‌ర్గాల్లో వినిపిస్తోంది.

జాతీయ ప్ర‌త్యామ్నాయ ఎజెండా అంటూ ఇటీవ‌ల బ‌లంగా వినిపిస్తున్నారు. ప‌లు రాష్ట్రాల‌కు ఆయ‌న వెళ్లారు. సేమ్ టూ సేమ్ బెంగాల్ సీఎం మ‌మ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప్ర‌యోగించిన సూత్రాన్ని కేసీఆర్ అనుస‌రించారు. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ని టార్గెట్ చేస్తూ రాష్ట్రంలోని ఎనిమిదేళ్ల వైఫ‌ల్యాలపై ప్ర‌చారం జ‌ర‌గ‌కుండా ప్లాన్ చేశారు. చాలా వ‌ర‌కు ఆ విష‌యంలో ఆయ‌న స‌క్సెస్ అయిన‌ట్టు స‌ర్వేలు చెబుతున్నాయ‌ని ఆ పార్టీ వ‌ర్గాల్లోని టాక్‌. కానీ, బీజేపీ, కాంగ్రెస్ వేర్వేరుగా చేస్తోన్న రాజ‌కీయ దాడికి సోష‌ల్ మీడియా కూడా తోడ‌వడంతో వైఫ‌ల్యాల‌పై జ‌రుగుతోన్న ప్ర‌చారాన్ని పూర్తిగా అధిగ‌మించ‌డానికి ఆస్కారం క‌లుగ‌లేద‌ని తెలుస్తోంది. పైగా ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ అక‌స్మాత్తుగా వ‌చ్చి ప‌డింది. దీంతో ఆయ‌న ఎంచుకున్న మ‌మ‌త ఫార్ములా భ‌విష్య‌త్ లో ప‌నిచేయ‌ద‌ని వెనుక‌డుగు వేసిన‌ట్టు కనిపిస్తోంది.

తాజాగా వివిధ రాష్ట్రాల్లో మేధావుల‌తో స‌మావేశం కావాల‌ని కేసీఆర్ నిర్ణ‌యించుకున్నార‌ట‌. ప్ర‌త్యేకించి ఆయా రాష్ట్రాల్లోని యువ‌త‌ను ఆక‌ట్టుకునేలా ప్లాన్ చేస్తున్నార‌ని తెలుస్తోంది. వివిధ రంగాల్లో నిష్ణాతులను స్పీచ్ ఆధారంగా ఎంపిక చేసే ప‌నిలో ఉన్నార‌ని స‌మాచారం. వాళ్ల ద్వారా జాతీయ ప్ర‌త్యామ్నాయ ఎజెండాను ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు తీసుకెళ్ల‌డానికి ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ట‌. ఇంగ్లీషు, హిందీ అన‌ర్గళంగా మాట్లాడే నైపుణ్యంతో పాటు స‌బ్జెక్టు మీద ప‌ట్టున్న చాకుల్లాంటి యువ‌కులను ఎంపిక చేయాల‌ని భావిస్తున్నార‌ట‌. ఆ ఎంపిక కోసం ప్ర‌త్యేకంగా ప్ర‌శాంత్ కిషోర్ టీమ్ కు బాధ్య‌త‌లు అప్ప‌గించారని తెలుస్తోంది.

ఫాంహౌస్ కేంద్రంగా మేధావులతో ప‌లుమార్లు స‌మావేశం అయిన కేసీఆర్ ప్ర‌త్యామ్నాయ ఎజెండాను త‌యారు చేస్తున్నార‌ట‌. ప్ర‌ధానంగా విద్యుత్‌, విద్య‌, వైద్యం, తాగు,సాగు నీళ్లు త‌దిత‌ర అంశాల‌పై దృష్టి పెట్టారు. నీళ్లు, నిధులు, నియామ‌కాల సూత్రాన్ని ప్ర‌యోగించ‌డం ద్వారా తెలంగాణ ఉద్య‌మాన్ని తీసుకొచ్చిన అనుభ‌వం ఆయ‌న సొంతం. అదే, పంథాను అనుస‌రిస్తూ కేజ్రీవాల్ ఫార్ములాతో ముందుకెళ్లాల‌ని భావిస్తున్నార‌ని తెలుస్తోంది. యువ‌కుల్ని, వివిధ రంగాల నిపుణుల‌ను జ‌నం మ‌ధ్య‌కు పంప‌డం ద్వారా ఆశించిన ఫలితాల‌ను అందుకోవ‌చ్చ‌ని స్కెచ్ వేశార‌ట‌.

ద‌స‌రా త‌రువాత జాతీయ పార్టీ ఉంటుంద‌ని మంత్రి మ‌ల్లారెడ్డి ఇటీవ‌ల చెప్పారు. కానీ, డిసెంబ‌ర్ త‌రువాత మాత్ర‌మేనంటూ మ‌ళ్లీ లీకులు టీఆర్ఎస్ పార్టీ నుంచి వ‌చ్చాయి. జాతీయ పార్టీ పెట్ట‌డానికి ముందుగా ఆ పార్టీలో టీఆర్ఎస్ ను విలీనం చేసే సాంకేతిక స‌మ‌స్య ఉందా? అనేది చూస్తున్నార‌ట‌. ప్ర‌త్యేక సింబ‌ల్, గుర్తింపు ఉండేలా జాతీయ పార్టీని రూపం ఇవ్వాల‌ని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. అందుకు సంబంధించిన జెండా, అజెండాను రూపొందించే ప‌నిలో ఉన్నారు కేసీఆర్‌. అదంతా పూర్త‌య్యేనాటికి ప్ర‌శాంత్ కిషోర్ దేశ వ్యాప్తంగా చాకుల్లాంటి య‌వ‌కుల‌ను ప్రచారం కోసం సిద్ధం చేస్తారు. వాళ్ల‌ను రంగంలోకి దింప‌డం ద్వారా మూడోసారి సీఎంతో పాటు జాతీయ స్థాయిలో కీ రోల్ పోషించాల‌ని కేసీఆర్ చూస్తున్నారు. మొత్తం మీద కేజ్రీవాల్ ఢిల్లీ, పంజాబ్‌, గోవా, మ‌హారాష్ట్ర త‌దిత‌ర రాష్ట్రాల‌కు ఎలా విస్త‌రించారో, అలాంటి ఫార్ములాను కేసీఆర్ ఎంచుకున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఎంత వ‌ర‌కు ఆయ‌న కొత్త లాజిక్ ప‌నిచేస్తుందో చూడాలి.