గంజాయి మాఫీయాను అణచివేయండి.. సీఎం కేసీఆర్ సీరియస్

తెలుగు రాష్ట్రాల్లో గంజాయి చాపకింద నీరులా విస్తరిస్తుండటం.. పల్లెల్లో, తండాల్లో గుప్పుమంటుండటంతో మహిళలు వితంతువులుగా మారుతున్నారు. ఈ నేపథ్యంలో గంజాయి సాగు, అక్రమార్కులపై సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు.

  • Written By:
  • Publish Date - October 21, 2021 / 12:06 PM IST

తెలుగు రాష్ట్రాల్లో గంజాయి చాపకింద నీరులా విస్తరిస్తుండటం.. పల్లెల్లో, తండాల్లో గుప్పుమంటుండటంతో మహిళలు వితంతువులుగా మారుతున్నారు. ఈ నేపథ్యంలో గంజాయి సాగు, అక్రమార్కులపై సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు. గంజాయి రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు డైరెక్టర్ జనరల్ ర్యాంక్ అధికారి నేతృత్వంలో ప్రత్యేక సెల్‌ని ఏర్పాటు చేస్తున్నట్టు కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. గంజాయి అక్రమ సాగు, రవాణా, అమ్మకం నియంత్రించడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించడానికి పోలీసు శాఖ ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ అధికారులతో ఆయన సమావేశమయ్యారు.

గంజాయి రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా విద్యా సంస్థల వద్ద ప్రత్యేక నిఘా పెంచాలని అధికారులను ఆదేశించారు. ఎన్‌ఫోర్స్ మెంట్ వింగ్, ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖలో ఫ్లయింగ్ స్క్వాడ్‌లను పటిష్టం చేయాలని సూచించారు. తెలంగాణ సరిహద్దుల్లో చెక్‌ పాయింట్ల సంఖ్యను పెంచాలని, కమ్యూనికేషన్ నెట్‌వర్క్ ను బలోపేతం చేయాలని పేర్కొన్నారు. గంజాయి ఉత్పత్తిని నిర్మూలించడానికి వెంటనే సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.

 

అమాయక గిరిజన యువకులు గంజాయి దందాకు బలవుతున్నారని, విద్యార్థులు, యువకులు గంజాయి తీసుకోవడం వల్ల మానసిక స్థితి మారి ఆత్మహత్యలకు దారి తీస్తుందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో గంజాయి సులభంగా దొరుకుతుందని, అధికారులు పకడ్బందీగా వ్యవహరించాలని, గంజాయి సాగు, రవాణా చేస్తున్న నేరస్థులు ఎంతటివాళ్లయినా సరే ఉపేక్షించవద్దని అధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు. వ్యవసాయ పొల్లాల్లో గంజాయి సాగు చేస్తే.. ఆ రైతులకు సంబంధించి రైతుబీమా, రైతుబంధం పూర్తిగా నిలిపివేస్తామని కేసీఆర్ హెచ్చరించారు. అధికారులు, టాస్క్ ఫోర్స్, ఎక్సైజ్ అధికారులు సమన్వయంతో పనిచేసి తెలంగాణను గంజాయి రహిత రాష్ట్రంగా మార్చాలని సీఎం కేసీఆర్ కోరారు.