Site icon HashtagU Telugu

Telangana: బాలకార్మికుల నిర్మూలన చట్టం సవరణ.. విధివిధానాలు ఇవే..!

Childlabour

Childlabour

బాలకార్మిక వ్యవస్థ నిర్మూలించే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర చట్టానికి అనుగుణంగా రాష్ట్రంలో బాలకార్మిక చట్టాన్ని సవరిస్తూ విధివిధానాలు ఖరారు చేస్తూ .. కార్మికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 14 ఏళ్ల లోపు చిన్నారులతో పనిచేయించుకుంటే కఠిన చర్యలు తీసుకోనుంది. ఇందుకు ఆర్నెళ్ల నుంచి ఏడాది జైలుశిక్షతో పాటు 20 నుంచి 50 వేల రూపాయల వరకు జరిమానా విధిస్తారు.

ఒకవేళ 14 సంవత్సరాల వయసు లోపు పిల్లలను తల్లిదండ్రులు పనికి పంపిస్తే వారు కూడా శిక్షార్హులేనని కార్మికశాఖా స్పష్టం చేసింది. అయితే విద్యకు ఎలాంటి ఆటంకం కలగకుండా పనుల్లో చిన్నారులు వారి తల్లిదండ్రులకు సహాయపడవచ్చు.అది కూడా హానికరమైన పనులు, ఆదాయం వచ్చేలా తయారీ రంగం, ఉత్పత్తి, రిటైల్ పనులకు వినియోగించరాదు. పాఠశాల సమయాలతో పాటు రాత్రి ఏడు నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకు చిన్నారులు పని చేయరాదు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, పర్యవేక్షణ కోసం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో టాస్క్​ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేయనున్నారు. చిన్నారి ఎలాంటి అనుమతి లేకుండా 30 రోజుల పాటు పాఠశాలకు హాజరు కాకుంటే సంబంధిత పాఠశాల ప్రిన్సిపల్, ప్రధానోపాధ్యాయుడు ఆ విషయాన్ని నోడల్ అధికారి దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంటుంది.

పిల్లలు కళాకారులుగా పనిచేసేందుకు కూడా కార్మికశాఖ నిబంధనలు తీసుకువచ్చింది. సినిమాలు, ఇతర చిత్రీకరణలో చిన్నారులు నటించేందుకు కలెక్టర్ల నుంచి నిర్మాత లేదా దర్శకుడు ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. రోజుకు ఐదు గంటలకు మించి, విరామం లేకుండా మూడు గంటలకు మించి చిన్నారులను చిత్రీకరణలో పనిచేయించకూడదు. చిత్రీకరణ సమయంలో చిన్నారుల పరిరక్షణ, విద్యాహక్కు చట్టం, లైంగిక వేధింపుల చట్టం ఉల్లంఘనలు లేకుండా చూడాలి. చిన్నారులకు వచ్చే ఆదాయంలో కనీసం 25శాతం మొత్తాన్ని బ్యాంకులో ఫిక్స్​డ్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. చిన్నారుల ఇష్టాయిష్టాలకు వ్యతిరేకంగా వారిని ఎలాంటి చిత్రీకరణలోనూ ఉపయోగించరాదు.

Exit mobile version