KCR Tour : దేశవ్యాప్త పర్యటనకు కేసీఆర్…నేటి నుంచి 8 రాష్ట్రాల్లో పర్యటన…ఇదీ ప్లాన్.!!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్..దేశ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు సిద్ధమయ్యారు

  • Written By:
  • Publish Date - May 20, 2022 / 11:32 AM IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్..దేశ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు సిద్ధమయ్యారు. నేటి నుంచి ఎనిమిదిరోజుల పాటు ఆయన పర్యటన సాగనుంది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన కాలంలో చనిపోయిన రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం అందించనున్నారు. చైనా సరిహద్దు పోరులో అమరులైన జవాన్ల కుటుంబాలను కూడా ఆదుకుంటామని ప్రకటించడం దేశవ్యాప్త పర్యటనలో ముఖ్యాంశంగా ఉన్నాయి. తొలిదశ పర్యటనలో మొత్తం 8 రాస్ట్రాలకు సంబంధించి కేసీఆర్ కార్యకలాపాలు ఉండనున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తారు. అక్కడి నుంచి కేసీఆర్ దేశవ్యాప్త పర్యటన ప్రారంభం అవుతుంది. రాబోయే రోజుల్లో కేసీఆర్ ఏం చేయబోతున్నారో…పర్యటనలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం.

సీఎం కేసీఆర్ నేటి మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరుతారు. పలు రాజకీయపార్టీల నేతలో సమావేశం అవుతారు. ప్రముఖ ఆర్థికవేత్తలతో సమావేశమై…దేశ ఆర్థిక పరిస్థితులపై చర్చించనున్నారు. జాతీయమీడియా సంస్థల జర్నలిస్టు ప్రముఖులతోసమావేశం అవుతారు. 22వ తేదీని చండీగఢ్ కు వెళ్తారు. రైతు ఉద్యమంలో మరణించిన పంజాబ్ , హర్యానా, యూపీ, ఢిల్లీకి చెందిన సుమారు 6వందల మంది రైతుల కుటుంబాలను పరామర్శిస్తారు. వారికి ఆర్థికంగా భరోసానిచ్చేందుకు ఒక్కో కుటుంబానికి రూ.3లక్షల చొప్పున చెక్కులను పంపిణీ చేస్తారు. ఈ కార్యక్రమానికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ తో కలిసి చేపడతారు. సుమారు నాలుగు రోజులపాటు ముఖ్యమంత్రి కేసీఆర్ చంఢీగఢ్ లో గడుపుతారు.

ఛండీగఢ్ క్యాంపు నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 26న కర్నాటక చేరుకుంటారు. బెంగుళూరులో పర్యటిస్తారు. జేడీఎస్ ముఖ్యనేతలు మాజీ ప్రధాని దేవెగౌడ, కర్నాటక మాజీ సీఎం కుమారస్వామితో కేసీఆర్ భేటీ అవుతారు. రాత్రికి బెంగళూరులోనే బస చేస్తారు. 27న మహారాష్ట్రలోని రాలేగావ్ సిద్ధికి బయలుదేరుతారు. అక్కడ సామాజిక ఉద్యమకారుడు అన్నాహజరేతో భేటీ అవుతారు. తర్వాత షిర్డీ వెళ్లి సాయిబాబను దర్శించుకుంటారు. తిరిగి హైదరాబాద్ పయనమవుతారు. మళ్లీ గంటల వ్యవధిలోనే మే 20 లేదా 30న పశ్చిమబెంగాల్ , బీహార్ రాష్ట్రాల పర్యటనకు ముఖ్యమంత్రి రెడీ కానున్నారు. ఆ రెండు రాష్ట్రాల్లో అమరజవాన్ల కుటుంబాలను ఆదుకోనున్నారు సీఎం కేసీఆర్.