తెలంగాణ రాష్ట్రంలో సిజేరియన్ డెలివరీలు (Cesarean Deliveries) భారీగా పెరుగుతున్నాయి. తాజా వైద్య ఆరోగ్య శాఖ నివేదిక ప్రకారం.. రాష్ట్రంలో ప్రతి గంటకు సగటున 27 సిజేరియన్ డెలివరీలు జరుగుతున్నాయని వెల్లడైంది. గత రెండు నెలల్లో జరిగిన ప్రసవాల్లో 58 శాతం వరకు సిజేరియన్లే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. సాధారణ ప్రసవాలను తగ్గించుకోవడంపై సమగ్ర విశ్లేషణ అవసరమైందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
నివేదికలో అందించిన వివరాల ప్రకారం..ప్రైవేట్ ఆసుపత్రుల్లో సిజేరియన్ రేటు 73% గా ఉండగా, సర్కారు ఆసుపత్రుల్లో ఇది 48% గా నమోదైంది. మొత్తం 67,103 ప్రసవాల్లో 39,300 కేసులు సిజేరియన్ ద్వారా జరిగాయి. ఇది చాలా అధిక శాతం కాగా, ఆరోగ్య పరంగా తల్లులకు, శిశువులకు దీని ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రత్యేకించి ప్రైవేట్ ఆసుపత్రుల్లో వాణిజ్య ప్రయోజనాల నిమిత్తం ఈ విధంగా సిజేరియన్ కేసులు పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
WTC Final: 2031 వరకు అక్కడే.. డబ్ల్యూటీసీ ఫైనల్ వేదికను ప్రకటించిన ఐసీసీ!
తల్లుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు సాధ్యమైనంతవరకు నార్మల్ డెలివరీలే ప్రోత్సహించాలి అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసూతి ముందు శిక్షణ, తగిన వైద్య పర్యవేక్షణ, మానసిక భరోసా కల్పించే విధానాలు చేపట్టాలని ఆదేశాలు జారీచేసింది. రిస్క్ ఫ్యాక్టర్లు లేకుండా ఉన్న మహిళలకు సిజేరియన్ అవసరం లేదన్న అవగాహనను విస్తృతంగా పెంచేందుకు ప్రభుత్వం ప్రచార కార్యక్రమాలను నిర్వహించనుంది. ప్రస్తుతం ఉన్న గణాంకాలు పరిశీలిస్తే.. ప్రసూతి సేవలలో సమతుల్యత అవసరం స్పష్టమవుతోంది. సిజేరియన్ ప్రసవాల వల్ల తల్లులకు శస్త్రచికిత్సా సంబంధిత అవాంతరాలు, భవిష్యత్తులో మరో గర్భధారణపై ప్రభావాలు పడే అవకాశం ఉంది. కాబట్టి వైద్యులు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ప్రజల్లో కూడా నార్మల్ డెలివరీపై భయం తగ్గించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం, వైద్య నిపుణులు కలిసి పనిచేస్తేనే ఈ సమస్యకు పరిష్కారం కనుగొనడం సాధ్యమవుతుంది.