CM KCR : తెలంగాణ ‘షిండే’ ఎవ‌రు? స‌ర్కార్ ర‌ద్దు దిశ‌గా.!

తెలంగాణ సీఎం కేసీఆర్ కు భ‌యం ప‌ట్టుకుందా? కేంద్రం ఏదో చేయ‌బోతుందని డౌట్ వ‌చ్చిందా?

  • Written By:
  • Updated On - July 11, 2022 / 12:33 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్ కు భ‌యం ప‌ట్టుకుందా? కేంద్రం ఏదో చేయ‌బోతుందని డౌట్ వ‌చ్చిందా? ఎందుకు ఏక్ నాథ్ షిండే మాట‌ను ప‌దే ప‌దే ఆయ‌న ప్ర‌స్తావిస్తున్నారు? ఇలాంటి ప్ర‌శ్న‌లు ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ఆయ‌న వ్యాఖ్య‌ల‌కు తగిన విధంగా గ‌త కొన్ని రోజులుగా బీజేపీ అగ్ర‌నేత‌ల డైలాగులు ఉన్నాయి. ప‌ది రోజుల్లో ఏదో ఒక‌టి తేలుస్తామ‌ని బీజేపీ తెలంగాణ చీఫ్ బండి రెండు రోజుల క్రితం మీడియాకు చెప్పారు. ఇదంతా చూస్తుంటే, ఏదో జ‌ర‌గ‌బోతుంద‌ని అనుమానం రావ‌డం స‌హ‌జం.

యూపీఏ ప్ర‌భుత్వంలో ఆయ‌న కేంద్ర కార్మిక‌శాఖ మంత్రిగా ప‌నిచేశారు. ఆ సంద‌ర్భంగా స‌హారా గ్రూప్ కు ఉద్యోగుల ఈపీఎఫ్ ఖాతాల‌ను వాడుకోవ‌డానికి అనుమ‌తి ఇచ్చారు. ఫ‌లితంగా ఇప్ప‌టికీ కొన్ని ల‌క్ష‌ల మంది ఉద్యోగులు ఇబ్బందులు ప‌డుతున్నారు. ఆ కేసుకు సంబంధించి సీబీఐ విచార‌ణ చేస్తోంది. ఆయ‌న‌పై 2017వ సంవ‌త్స‌రం కేంద్రం కూడా విచార‌ణ‌కు న్యాయ‌పోరాటం చేసింది. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు ఆ కేసుకు సంబంధించిన ఫైల్ ఒక అడుగు కూడా ముందుకు క‌ద‌లేదు. దీనికి కార‌ణం ఎన్డీయే ప్ర‌భుత్వానికి కేసీఆర్ లొంగిపోయాడ‌ని కాంగ్రెస్ చెబుతోంది. ఆ మేర‌కు ప‌లు సంద‌ర్భాల్లో ఆ పార్టీ నేత‌లు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోప‌ణ‌లు చేస్తున్నారు.

ఈఎస్ఐ స్కామ్ లోనూ కేసీఆర్ ప్ర‌మేయం ఉంద‌ని సీబీఐ విచార‌ణ చేసింది. యూపీఏ హ‌యాంలో న‌మోదైన కేసు ఇప్ప‌టికీ విచార‌ణ ద‌శ‌లోనే ఉంది. నామినేటెడ్ ప‌ద్ధ‌తిన ఆస్ప‌త్రులు నిర్మించ‌డానికి కాంట్రాక్టును సానుకూల ఉండే కంపెనీకి అప్ప‌గించారు. ఆ స్కామ్ కు సంబంధించిన విచార‌ణకు కూడా బ్రేక్ ప‌డింది. ఎన్టీయే ప్ర‌భుత్వానికి పార్ల‌మెంట్ బ‌య‌ట‌, లోప‌ల టీఆర్ఎస్ స‌హ‌క‌రించినందుకు కేసీఆర్ పై విచార‌ణ ఆగిపోయింద‌ని కాంగ్రెస్ చెబుతోంది. ఆ రెండు పార్టీలు తెలంగాణ ప్ర‌జ‌ల‌తో గేమాడుతున్నాయ‌ని కాంగ్రెస్ నేత‌ల ప్ర‌ధాన ఆరోప‌ణ‌.

తెలంగాణ‌లో తాజాగా మారిన రాజ‌కీయాల నేప‌థ్యంలో కేసీఆర్ అరెస్ట్ ఖాయ‌మంటూ బీజేపీ నేత‌లు చెబుతున్నారు. ఆయ‌న‌పై ఉన్న ఈఎస్ ఐ, స‌హార ఫైళ్లపైన అధ్య‌య‌నం జరుగుతుంద‌ని బండి అంటున్నారు. అంతేకాదు, సుమారు 40 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ట‌చ్ లో ఉన్నార‌ని చాలా కాలంగా చెబుతూ వ‌స్తున్నారు. ఆ 40 మందికి ఏక్ నాథ్ షిండే ఎవ‌రు? అనేది ఇప్పుడు కేసీఆర్ కు ఉన్న అనుమానం. అందుకే, మ‌హారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే ఆప‌రేష‌న్ అంటూ ప‌దేప‌దే ఆయ‌న మీడియా స‌మావేశంలో చెప్పుకొచ్చారు. ఆ రాష్ట్రంలో తాజాగా ఏమి జ‌రిగిందో అంద‌రం చూశాం. శివ‌సేన రెబ‌ల్స్ కు ఏక్ నాథ్ నాయ‌క‌త్వం వ‌హించారు. బీజేపీ మ‌ద్ధ‌తుతో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు శివ‌సేన ఎవ‌రిది? అనే ప్ర‌శ్న ఉత్ప‌న్నం అవుతోంది.

తెలంగాణాలోనూ మ‌హారాష్ట్ర ఎపిసోడ్ న‌డుస్తుంద‌ని కేసీఆర్ గ్ర‌హించిన‌ట్టు ఉన్నారు. ముందుగానే మీడియా ఎదుట వాపోయారు. మ‌హారాష్ట్ర‌లో చేసిన‌ట్టు తెలంగాణ‌లో చేస్తామంటే కుద‌ర‌ద‌ని స‌వాల్ చేస్తూనే ప్ర‌భుత్వం ర‌ద్దుకు సంకేతాలు ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. ఒక వేళ ఏక్ నాథ్ షిండే ఎపిసోడ్ వ‌స్తే ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేస్తానంటూ ప‌రోక్షంగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ దుమారం రేపుతున్నాయి. ఇలా ఆయ‌న వ్యాఖ్యానించ‌డం వెనుక సానుభూతి పొందాల‌ని ప్లాన్ చేశారా? అనే కోణం నుంచి కూడా విప‌క్ష నేత‌లు చ‌ర్చించుకుంటున్నారు. నిజంగానే తెలంగాణ ఏక్ నాథ్ షిండే సిద్ధం అయ్యాడా? అనే ప్ర‌శ్న కూడా ఇప్పుడు ఉత్ప‌న్నం అవుతోంది. మొత్తం మీద కేసీఆర్ కు మాత్రం ఏదో తెలియ‌ని కంగారు మొద‌లైయింద‌ని స్ప‌ష్టం అవుతోంది.