Telangana Cabinet : ఈ నెల 30న తెలంగాణ మంత్రివర్గ సమావేశం కానుంది. ఈ భేటి రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్ష జరగనుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సమావేశంలో రైతు భరోసా, రేషన్‌కార్డుల జారీకి సంబంధించిన విధివిధానాలపై చర్చించే అవకాశం ఉంది. అలాగే భూమిలేని పేదలకు నగదు బదిలీ, యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు అంశాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. వచ్చే నెల 14వ తేదీ నుంచి అమలుచేస్తామన్ని రైతు భరోసా పథకంపై కూడా చర్చించనున్నారు.
స్వయం సహాయక బృందాలకు ఉపాధి కల్పన, సోలార్ ప్లాంట్ల ఏర్పాటు, ఎలక్ట్రికల్ బస్సులు ఇవ్వడంపై సీఎస్ ఈరోజు సమీక్ష నిర్వహించారు. తెలంగాణలోని ఐదు జిల్లాల్లో 231 ఎకరాల్లో సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మహిళా సంఘాలకు ఆలయ భూముల్లో సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తామన్నారు. స్వయం సహాయక బృందాలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారి కోసం తొలి విడతలో 231 ఎకరాల్లో విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు సీఎస్ శాంతికుమారి వెల్లడించారు.
కాగా, గతేడాది తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. రైతు భరోసాపై ఇప్పటికే ప్రకటన చేసినా.. అందుకు సంబంధించి ఇంకా విధివిధానాలు ఖరారు చేయలేదు. రైతు భరోసా కోసం గత ఏడాదిగా రైతులు ఎదురుచూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సంక్రాంతి పండగ తర్వాత రైతు భరోసా ఇస్తామని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీలో ప్రకటించారు. అయితే ఎన్ని ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు రైతు భరోసా ఇస్తారనే విధివిధానాలపై ఈ మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు.
Read Also: Telangana TDP : తెలంగాణలో టీడీపీ రీ ఎంట్రీ.. పీకే, రాబిన్ శర్మలతో చంద్రబాబు భేటీ