Telangana Cabinet Meeting Highlights : శుక్రవారం సాయంత్రం సీఎం రేవంత్ అధ్యక్షతన తెలంగాణ మంత్రి వర్గ సమావేశం (Telangana Cabinet Meeting ) జరిగింది.ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తమగానే కాదు దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసిన హైడ్రా (Hydraa) కు విస్తృత అధికారాలు ఇస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్లో చెరువులను ఆక్రమించి కట్టిన నిర్మాణాలను కూల్చేస్తున్న హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ‘మిగతా శాఖలకు ఉండే పూర్తి స్వేచ్ఛ హైడ్రాకూ వర్తిస్తుంది. దీనికి సంబంధించిన నిబంధనలు సడలించాం. అవసరమైన 169 మంది అధికారులు, 964 మంది ఔట్సోర్సింగ్ సిబ్బందిని వివిధ శాఖల నుంచి డిప్యుటేషన్పై రప్పిస్తున్నాం’ అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) వెల్లడించారు.
దీంతోపాటు మూడు యూనివర్సిటీల పేర్లు మార్చుతూ ప్రభుత్వం కాబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. కోటీ మహిళా యూనివర్సిటీ పేరును చాకలి ఐలమ్మ యూనివర్సిటీగా, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరును సురవరం ప్రతాప్ రెడ్డి విశ్వవిద్యాలయం, టెక్స్‌టైల్స్ అండ్ హ్యాండ్‌లూమ్స్ యూనివర్సిటీకి కొండ లక్ష్మణ్ బాపూజీ యూనివర్సిటీగా మార్చేందుకు ఆమోదం తెలిపారు.
అలాగే కోర్ అర్బన్ రీజియన్ లో హైడ్రా పని చేస్తుందని , 51 గ్రామ పంచాయతీలు హైడ్రా పరిధిలోకి వస్తాయని , ఆర్ఆర్ఆర్ ను ఖరారు చేసేందుకు 12 మందితో కమిటీని ఏర్పాటు, మనోహరాబాద్ మండలంలో లాజిస్టిక్ హబ్ కు ఆమోదం, ఎస్ఎల్బీసీ టన్నెల్ రివైజ్డ్ ఎస్టిమేట్ పనులకు ఆమోదం, టన్నెల్ పనులకు రూ. 4637 కోట్లు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పొంగులేటి వివరించారు.