Site icon HashtagU Telugu

CM KCR : కేసీఆర్ జాతీయ పార్టీ ఇప్పట్లో లేనట్లేనా? ఇంతలోనే ఏమైంది?

Cm Kcr

Cm Kcr

జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్న తెలంగాణ సీఎం కేసీఆర్…గత కొన్నాళ్లుగా అదే పనిలో బిజీగా ఉన్నారు. దేశవ్యాప్తంగా ఎంతో మంది నాయకులతో చర్చలు జరిపారు. బీజేపీ వ్యతిరేక శక్తులనంతా ఏకం చేయాలన్న ప్రయత్నం గట్టిగానే చేస్తున్నారు. త్వరలోనే జాతీయ పార్టీని కూడా పెట్టబోతున్నట్లు ప్రకటించారు. ఇంతలోనే ఏమైందో ఏమో కానీ ఇప్పట్లో కొత్త పార్టీ ప్రకటన లేనట్లేనని పార్టీ నేతలు అంటున్నారు. అన్నీ కుదిరితే దసరా రోజే కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటిస్తారన్న ప్రచారం జోరుగా సాగినప్పటికీ…ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే మాత్రం…దసరాకు కొత్త పార్టీ ఏర్పాటు కష్టమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జాతీయ పార్టీ ప్రకటన ముహూర్తం మారినట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. దసరాకు కాకుండా మరో రెండు నెలల తర్వాత ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.

ఇక జాతీయ పార్టీకి సంబంధించిన జెండా, ఎజెండా, విధి విధానాలపై కేసీఆర్ తీవ్రంగానే శ్రమిస్తున్నారు. దాని కోసం ప్రత్యేకంగా నిపుణులను ఏర్పాటు చేసిన నిత్యం సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ విషయంపై ఈసీతో చర్చలు జరిపి…దసరాకు పార్టీ ప్రకటించాలని అనుకున్నారు కేసీఆర్. కానీ ఏర్పాట్లు తుది దశకు రాకపోవడంతో…డిసెంబర్లో ప్రకటించాలన్న నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ఇంకా షురూ కాలేదట. ఇక కొత్త పార్టీని ప్రకటించిన తర్వాత దేశ రాజకీయాల్లో కేసీఆర్ మరింత దూకుడుగా వ్యవహరిస్తారని చెబుతున్నారు ఆ పార్టీ నేతలు. రైతు ఎజెండాతోనే జాతీయ రాజకీయాల్లో వెళ్లాలని భావిస్తున్నారు. మొత్తానికి దసరాకు పార్టీని ప్రకటిస్తారనుకున్న టీఆరెస్ వర్గాలు..ఇప్పుడా ప్రకటన రెండు నెలలకు వాయిదా పడటంతో…కొంత నిరుత్సాహానికి లోనవుతున్నారు.

Exit mobile version