TBJP@10: టీబీజేపీ టార్గెట్ 10.. ఆ సీట్లపైనే గురి!

బీజేపీ నాయకత్వం తెలంగాణ కోసం దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ అగ్రనేతలు అమిత్ షా, నడ్డా, నిర్మల సీతరామన్ లాంటివాళ్లు

  • Written By:
  • Updated On - September 9, 2022 / 12:29 PM IST

బీజేపీ నాయకత్వం తెలంగాణ కోసం దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ అగ్రనేతలు అమిత్ షా, నడ్డా, నిర్మల సీతరామన్ లాంటివాళ్లు వరుస పర్యటనలు చేస్తూ తెలంగాణ ప్రజల ద్రుష్టిని ఆకర్షిస్తున్నారు. అయితే బీజేపీ ఎమ్మెల్యే స్థానాలతో పాటు ఎంపీ స్థానాలపై కూడా గురి పెట్టింది. లోక్‌సభలో మొత్తం 543 స్థానాలకుగాను 2019 ఎన్నికల్లో బీజేపీ 303 సీట్లు గెలుచుకుంది. వివిధ మిత్రపక్షాలతో కలిపి ఆ పార్టీ సారథ్యంలోని ఎన్డీఏ బలం ప్రస్తుతం 332గా ఉంది. కానీ ఈ సారి 50 నుంచి 70 సీట్లు తక్కువగానే గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మ్యాజిక్ ఫిగర్ 272 సీట్లు దాటే అవకాశాలు తక్కువ కనిపిస్తున్నాయి.

పైగా కొన్ని మిత్రపక్షాలు బీజేపీకి దూరమయ్యాయి. అలాగే చాలా రాష్ట్రాల్లో బీజేపీయేతర పార్టీలు బలంగా ఉన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో మళ్ళీ గెలిచి అధికారంలోకి రావడానికి బీజేపీ వ్యూహాలు మారుస్తుంది. కొత్త మిత్రపక్షాలని చేర్చుకోవడంతో పాటు ఇంతవరకు గెలవని కొన్ని సీట్లపై ఫోకస్ పెట్టి పనిచేస్తుంది. ఇదే క్రమంలో బలపడుతున్న తెలంగాణలో కనీసం 10 ఎంపీ సీట్లు అయిన గెలుచుకోవాలని టార్గెట్ పెట్టుకుంది.

17 సీట్లు ఉన్న తెలంగాణలో గత ఎన్నికల్లో టీఆర్ఎస్ 9, బీజేపీ 4, కాంగ్రెస్ 3, ఎం‌ఐ‌ఎం ఒక సీటు గెలుచుకుంది. ఇటీవల కొన్ని సర్వేల్లో టీఆర్ఎస్ 8, బీజేపీ 6, కాంగ్రెస్ 2, ఎం‌ఐ‌ఎం ఒక సీటు గెలుచుకుంటుందని తేలింది. అంటే ఇంకా బీజేపీ బలపడాల్సి ఉంది. ప్రస్తుతానికి బీజేపీ చేతులో కరీంనగర్, సికింద్రాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్ సీట్లు ఉన్నాయి…ఈ నాలుగు కాకుండా ఇంకో ఆరు సీట్లు దక్కించుకోవాలని చూస్తుంది. మల్కాజ్‌గిరి, మహబూబ్‌నగర్, చేవెళ్ళ స్థానాలతో పాటు ఉమ్మడి వరంగల్, నల్గొండ, మెదక్ జిల్లాల్లో ఒక్కో పార్లమెంట్ సీటుపై ఫోకస్ చేసింది. మొత్తానికి 10 సీట్లు టార్గెట్‌గా పెట్టుకుంది. అయితే ఇప్పుడున్న పరిస్తితుల్లో గట్టిగా కష్టపడితే ఆరు సీట్లు గెలుచుకోవచ్చు గాని, 10 సీట్లు అసాధ్యమని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.