TS BJP: బీజేపీ టార్గెట్ ఆ నియోజ‌క‌వ‌ర్గాలేనా..? వ్యూహాలు సిద్ధం చేస్తున్న కేంద్రం పెద్ద‌లు

బీఆర్ఎస్ నేత‌లుసైతం వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌దాన పోటీదారు కాంగ్రెస్ అని భావిస్తున్నారు. ఆ పార్టీ టార్గెట్‌గా విమ‌ర్శ‌లు ఎక్కుపెడుతున్నారు.

  • Written By:
  • Publish Date - June 5, 2023 / 10:30 PM IST

తెలంగాణ(Telangana) రాష్ట్రంలో వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌స్తామ‌ని ఇన్నాళ్లు రాష్ట్ర బీజేపీ(BJP) నేత‌లు దీమాగా చెబుతూ వ‌చ్చారు. అయితే, ఇటీవ‌ల వెలువ‌డిన క‌ర్ణాట‌క(Karnataka) ఎన్నిక‌ల ఫ‌లితాల‌తో ఆ పార్టీకి ఊహించ‌ని ఎదురు దెబ్బ త‌గిలింది. కాంగ్రెస్(Congress) పార్టీ అత్య‌ధిక స్థానాల్లో విజ‌యం సాధించి అక్క‌డ‌ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ ప్ర‌భావం తెలంగాణ‌పై ప‌డింది. క‌ర్ణాట‌క ఫ‌లితాల ముందు వ‌ర‌కు తెలంగాణ‌లో అధికారంలో ఉన్న‌ బీఆర్ఎస్(BRS) పార్టీకి ప్ర‌త్యామ్నాయం బీజేపీనే అన్న వాద‌న వినిపించింది. ఫ‌లితాల త‌రువాత బీజేపీ ప్ర‌భావం త‌గ్గిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆ పార్టీలోకి వెళ్లేందుకు మొగ్గుచూపిన ఇత‌ర పార్టీల్లోని నేత‌లుసైతం క‌ర్ణాట‌క ఫ‌లితాల త‌రువాత వెనుక‌డుగు వేయ‌టం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

మ‌రోవైపు బీఆర్ఎస్ నేత‌లుసైతం వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌దాన పోటీదారు కాంగ్రెస్ అని భావిస్తున్నారు. ఆ పార్టీ టార్గెట్‌గా విమ‌ర్శ‌లు ఎక్కుపెడుతున్నారు. ఆదివారం నిర్మ‌ల్ జిల్లాలో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో సీఎం కేసీఆర్(CM KCR) సైతం బీజేపీ మాటెత్త‌కుండా కేవ‌లం కాంగ్రెస్ పైనే ఫోక‌స్ పెట్టారు. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో మా ప్ర‌త్య‌ర్థి కాంగ్రెస్ అని చెప్ప‌క‌నే చెప్పారు. క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ముందు వ‌ర‌కు బీజేపీ టార్గెట్‌గా విమ‌ర్శ‌లు చేసిన కేసీఆర్ ప్ర‌స్తుతం రూట్‌మార్చి కాంగ్రెస్ పార్టీపై విమ‌ర్శ‌ల‌ను ఎక్కుపెట్టారు. తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌స్తుత రాజ‌కీయ‌ ప‌రిస్థితుల‌పై ఓ అంచ‌నాకు వ‌చ్చిన బీజేపీ పెద్ద‌లుసైతం రూట్ మార్చిన‌ట్లు స‌మాచారం. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌యం కంటే ఎక్కువ‌ లోక్‌స‌భ స్థానాల్లో విజ‌యం సాధించాల‌ని టార్గెట్ పెట్టుకున్న‌ట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో గ‌త ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ తొమ్మిది పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల్లో విజ‌యం సాధించింది. కాంగ్రెస్ మూడు, బీజేపీ నాలుగు, ఎంఐఎం ఒక స్థానంలో విజ‌యం సాధించాయి.

ఈసారి బీజేపీ గ‌తంలో విజ‌యం సాధించిన నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, సికింద్రాబాద్‌, కరీంనగర్‌ సిట్టింగ్‌ స్థానాలతో సహా మొత్తం 15 పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల‌పై పోక‌స్ చేసిన‌ట్లు స‌మాచారం. ఇందులో క‌నీసం 10 నుంచి 12 పార్ల‌మెంట్ స్థానాల్లోనైనా బీజేపీ అభ్య‌ర్థులు విజ‌యం సాధించేలా వ్యూహాలు సిద్ధం చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే కేంద్ర మంత్రులు, బీజేపీ సీనియ‌ర్ నేత‌లు, రాష్ట్ర పార్టీ నేత‌లు ఆయా పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల్లో విస్తృత ప‌ర్య‌ట‌న‌లు చేస్తూ, కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను ప్ర‌చారం చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు స‌మాచారం. ఈ మేర‌కు కేంద్ర పార్టీ అధిష్టానం ఓ ప్ర‌ణాళిక‌ను సిద్ధం చేసిన‌ట్లు తెలుస్తోంది.