Telangana BJP : ఫేక్ వీడియోలపై బీజేపీ సీరియస్.. చర్యలు తీసుకోవాలని డిమాండ్

ఉప ఎన్నికకు పోలింగ్ దగ్గర పడుతుండటంతో హుజురాబాద్ లో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ప్రచారం పర్వం ముగియడంతో పలు పార్టీల స్థానిక నేతలు ప్రలోభాల పర్వానికి దిగారు.

  • Written By:
  • Updated On - October 29, 2021 / 02:57 PM IST

ఉప ఎన్నికకు పోలింగ్ దగ్గర పడుతుండటంతో హుజురాబాద్ లో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ప్రచారం పర్వం ముగియడంతో పలు పార్టీల స్థానిక నేతలు ప్రలోభాల పర్వానికి దిగారు. ‘ఓటుకు నోటు’ అంటూ ఒక్కో ఓటరుకు రూ. 6 వేల నుంచి రూ.10 వేల వరకు డబ్బులు పంచుతున్నారు. రెండు గ్రామాల ప్రజల తమకు డబ్బులు అందలేదని రోడ్డుపై ధర్నాలకు దిగడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు డబ్బులు పంచుతున్నాయంటూ కాంగ్రెస్ నేతలు ఈసీని కలిసిన విషయం తెలిసిందే. హుజురాబాద్ లో డబ్బులతో ఓటర్లను కొంటున్నారని, వెంటనే ఎన్నికను రద్దు చేయాలని ఈసీని కోరారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో తమ పేరుమీద ఫేక్ వీడియోలు వైరల్ అవుతున్నాయని తెలంగాణ బేజేపీ నాయకులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలో కొందరు వ్యక్తులు కమలం గుర్తు ఉన్న కవరులను, పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ పేరును ముద్రించి, రూ.10,000 నగదును ఓటర్లకు పంచుతున్నారని బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఈసీకి ఫిర్యాదు చేసింది. ముఖాలు కనిపించని వీడియోలను కూడా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ప్రసారం చేస్తున్నారని బీజేపీ ఆరోపించింది.

హుజూరాబాద్ నియోజకవర్గంలో భాజపా ప్రతిష్టను దిగజార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. కేంద్ర ఎన్నికల కమిషన్ కు వరుసగా ఫిర్యాదులు వస్తుండటంతో వెంటనే అలర్ట్ అయ్యింది. రేపు (అక్టోబర్ 30)న పోలింగ్ ఉండటంతో ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. పోలీస్, అదనపు బలగాల మధ్య పోలింగ్ నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటోంది.