Telangana BJP : టీడీపీతో క‌లిస్తే తెలంగాణ‌లో బీజేపీకి లాభ‌మా? న‌ష్ట‌మా? టీబీజేపీ ఎందుకు భ‌య‌ప‌డుతుంది?

బీజేపీ కేంద్ర అధిష్టానం తెలంగాణ‌పై దృష్టి కేంద్రీక‌రించింది. తెలంగాణ‌లో అధికారంలోకి రాక‌పోయిన‌ప్ప‌టికీ అత్య‌ధిక స్థానాల్లో విజ‌యం సాధించాల‌ని భావిస్తోంది.

  • Written By:
  • Publish Date - June 4, 2023 / 07:47 PM IST

తెలుగు(Telugu) రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర‌ ప‌డుతుండ‌టంతో పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. ఏపీలో మ‌రోసారి అధికారంలోకి రావాల‌ని వైఎస్ఆర్‌సీపీ(YSRCP) అధినేత‌, సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(CM Jaganmohan Reddy) వ్యూహాల‌కు ప‌దును పెడుతున్నారు. మ‌రోసారి 150 స్థానాల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా ఆ పార్టీ టార్గెట్‌గా పెట్టుకుంది. టీడీపీ(TDP) గ‌త అనుభ‌వాల‌ను దృష్టిలో పెట్టుకొని జ‌న‌సేన‌(Jaanasena)తో పొత్తుతో అసెంబ్లీ ఎన్నిక‌ల బ‌రిలోకి దిగేందుకు స‌న్న‌ద్ధ‌మ‌వుతుంది. ఇప్ప‌టికే ప‌వ‌న్‌, చంద్ర‌బాబు(Chandrababu Naidu) మ‌ధ్య ప‌లు ద‌ఫాలుగా చ‌ర్చ‌లు జ‌రిగాయి. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ(BJP)తో క‌లిస్తే జ‌గ‌న్‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కోవ‌చ్చ‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు భావిస్తున్నారు. ఈక్ర‌మంలో శ‌నివారం రాత్రి కేంద్ర మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్య‌క్షులు జేపీ న‌డ్డాతో చంద్ర‌బాబు భేటీ అయ్యారు. ఈ భేటీలో రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజ‌కీయ ప‌రిస్థితుల‌పై చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా బీజేపీ కేంద్ర అధిష్టానం తెలంగాణ‌పై దృష్టి కేంద్రీక‌రించింది. తెలంగాణ‌లో అధికారంలోకి రాక‌పోయిన‌ప్ప‌టికీ అత్య‌ధిక స్థానాల్లో విజ‌యం సాధించాల‌ని భావిస్తోంది. అదేవిధంగా ఎక్కువ ఎంపీ స్థానాల్లో పాగావేసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తుంది. ఈ క్ర‌మంలో చంద్ర‌బాబుతో భేటీలో అమిత్‌షా, జేపీ న‌డ్డాలు తెలంగాణ రాజ‌కీయాల‌పై ప్ర‌ధానంగా చ‌ర్చించిన‌ట్లు స‌మాచారం. తెలంగాణ‌లో టీడీపీకి ప్ర‌జాద‌ర‌ణ ఉంది. ముఖ్య‌నేత‌లు పార్టీ మారిన‌ప్ప‌టికీ కార్య‌క‌ర్త‌లు టీడీపీని అంటిపెట్టుకొని ఉన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో బీజేపీ, టీడీపీ క‌లిసి ప‌నిచేయ‌డం ద్వారా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌యం అలా ఉంచితే అత్య‌ధిక ఎంపీ స్థానాల్లో విజ‌యం సాధించే అవ‌కాశం ఉన్న‌ట్లు బీజేపీ కేంద్ర అధిష్టానం భావిస్తుంది.

తెలంగాణ‌లో గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌, టీడీపీలు క‌లిసి పోటీ చేశాయి. చంద్ర‌బాబు, రాహుల్ గాంధీలు క‌లిసి ఒకే వేదిక‌పైకి వ‌చ్చి ప్ర‌చారం నిర్వ‌హించారు. కానీ, కాంగ్రెస్‌కు ఆ ఎన్నిక‌ల్లో ఊహించ‌ని ఎదురుదెబ్బ త‌గిలింది. ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో మిన‌హా టీడీపీ, కాంగ్రెస్ పొత్తు తెలంగాణ‌లో పెద్ద‌గా ప్ర‌భావం చూప‌లేదు. ఇందుకు ప్ర‌ధాన కార‌ణం లేక‌పోలేదు. సీఎం కేసీఆర్ టీడీపీని, చంద్ర‌బాబునాయుడును తెలంగాణ వ్య‌తిరేక పార్టీగా ముద్ర‌వేయ‌డంలో విజ‌య‌వంతం అయ్యారు. ఫ‌లితంగా తెలంగాణ ప్ర‌జ‌లు టీడీపీ, కాంగ్రెస్‌ను ఆశించిన స్థాయిలో ఆద‌రించ‌లేదు. ప్ర‌స్తుతం అమిత్‌షా, న‌డ్డాలు చంద్ర‌బాబుతో భేటీ కావ‌డం, తెలంగాణ‌లో రెండు పార్టీలు క‌లిసి ప‌నిచేసేలా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌న్న స‌మాచారం రావ‌డంతో టీ బీజేపీ శ్రేణుల్లో ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతున్న‌ట్లు తెలుస్తోంది.

టీడీపీతో క‌లిస్తే సీఎం కేసీఆర్‌కు మ‌న‌మే స‌గం విజ‌యాన్ని చేకూర్చిన‌ట్లు అవుతుంద‌ని టీబీజేపీలోని కొంద‌రు నేతలు భావిస్తున్నారు. ఇందుకు ఉదాహ‌ర‌ణ‌గా గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీడీపీ, కాంగ్రెస్ పొత్తు ఫ‌లితాల‌ను తెర‌పైకి తెస్తున్నారు. ఈ క్ర‌మంలోనే టీబీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ కీల‌క వ్యాఖ్య‌లు చేసిన‌ట్లు తెలుస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ, బీజేపీ పొత్తు ఉంటుంద‌నేది ఊహాగానాలేన‌ని, ఊహాజ‌నిత క‌థ‌నాలు ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని పేర్కొన‌డం గ‌మ‌నార్హం.

 

Also Read :  Chandrababu: బీజేపీ హైకమాండ్ తో నాయుడు భేటీ