TRS Vs BJP : టీఆర్ఎస్ పై బీజేపీ `బిగ్` ఆప‌రేష‌న్ ?

తెలంగాణ బీజేపీ ప్ర‌త్య‌ర్థి పార్టీల‌పై భారీ `ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్` కు తెర‌తీయ‌డానికి సిద్ధం అవుతోంది. అందుకు సంబంధించిన క‌స‌ర‌త్తు ఎమ్మెల్యే ఈటెల రాజేంద్ర, బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజ‌య్ సీరియ‌స్ గా చేస్తున్నారు.

  • Written By:
  • Publish Date - November 23, 2021 / 03:05 PM IST

తెలంగాణ బీజేపీ ప్ర‌త్య‌ర్థి పార్టీల‌పై భారీ `ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్` కు తెర‌తీయ‌డానికి సిద్ధం అవుతోంది. అందుకు సంబంధించిన క‌స‌ర‌త్తు ఎమ్మెల్యే ఈటెల రాజేంద్ర, బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజ‌య్ సీరియ‌స్ గా చేస్తున్నారు. రెండు రోజుల క్రితం ఇద్ద‌రూ ముఖాముఖి క‌లిసిన‌ సంద‌ర్భంగా టీఆర్ఎస్ పార్టీ నుంచి వ‌చ్చే సీనియ‌ర్లు, ప్ర‌జాద‌ర‌ణ ఉన్న ద్వితీయ‌శ్రేణి జాబితాపై అధ్య‌య‌నం చేసిన‌ట్టు తెలుస్తోంది. కేసీఆర్ ఢిల్లీ టూర్ ముగించుకుని వ‌చ్చే నాటికి రాష్ట్రంలోని రాజ‌కీయ ప‌రిణామాల‌ను మార్చేయాల‌నే దిశ‌గా `మాస్ట‌ర్ ప్లాన్` రెడీ అవుతోందని టాక్‌.

రెండున్న‌రేళ్ల క్రితం `గులాబీజెండాకు ఓన‌ర్లు ఎవ‌రు` అనే వ్యాఖ్య‌ల నుంచి టీఆర్ఎస్ పార్టీలో ముస‌లం పుట్టింది. ఆనాటి నుంచి ఒక‌టిరెండు సంద‌ర్భాల్లో కేసీఆర్ దొర‌త‌నం గురించి, పార్టీలో కుటుంబ పాల‌న గురించి బ‌య‌ట‌ప‌డిన ఎమ్మెల్యేలు కొంద‌రు ఉన్నారు. వాళ్ల‌లో ఈటెల రాజేంద్ర మొద‌టి వ‌రుస‌లో ఉండేవాడు. ఇప్పుడు ఆయ‌న బీజేపీలోకి వ‌చ్చిన త‌రువాత ఆయ‌న మాదిరిగా గులాబీ జెండా నీడ‌కింద ఇష్టంలేకుండా ఉండే వాళ్లు ఎందురు అనే అంశంపై బీజేపీ ఆరా తీస్తోంది. కాబోయే సీఎం కేటీఆర్ అంటూ కామెంట్లు వ‌చ్చిన సంద‌ర్భంగా అసంతృప్తి వాదులు గ‌ళం లోలోప‌ల కొంద‌రు విప్పారు. కొంద‌రికి ప‌ద‌వులు రాక‌పోవ‌డం, పార్టీలో ప్రాధాన్యత లేక‌పోవ‌డంతో చాలా మంది అసంతృప్తిగా ఉన్నార‌ని బీజేపీ అంచ‌నా వేస్తోంది.

క‌నీసం 30 మంది ఎమ్మెల్యేలు, ఎనిమిది మంది ఎంపీలు ట‌చ్ లో ఉన్నార‌ని దుబ్బాక ఎన్నిక‌ల సంద‌ర్భంగా బీజేపీ చీఫ్ బండి అన్నాడు. అవే మాట‌ల‌ను అనే సంద‌ర్భాల్లో ఆయ‌న వినిపించాడు. కేవ‌లం మైండ్ గేమ్ లో భాగంగా ఆ విధంగా వ్యాఖ్యానించార‌ని అనుకోవ‌డానికి లేదు. ఎందుకంటే, ఈటెల రాజేంద్ర టీఆర్ఎస్ నుంచి బ‌య‌ట‌కు రావ‌డం, పార్టీలో మారుతోన్న ప‌రిణామాలను గ‌మ‌నిస్తే ఎంతో కొంత నిజం ఉండే ఉంటుంద‌నే న‌మ్మ‌కం క‌లుగుతోంది. పైగా బీజేపీతో కేసీఆర్ క‌య్యానికి నేరుగా దిగ‌డం కూడా ఏదో పార్టీలో అంత‌ర్గ‌తంగా జ‌రుగుతుంద‌ని అనుమానించే వాళ్లు లేక‌పోలేదు.

ఒక‌నొక స‌మ‌యంలో మంత్రి హ‌రీశ్ రావు త‌న గ్రూప్ తో బ‌య‌ట‌కు రాబోతున్నాడ‌ని బీజేపీ మైండ్ గేమ్ ఆడింది. టీఆర్ఎస్ పార్టీ ఖాళీ కాబోతుంద‌ని ఉప ఎన్నిక‌లు వ‌చ్చిన ప్ర‌తిసారీ బండి బాణం వేస్తున్నాడు. ఇప్పుడు ఆయ‌న వ్యాఖ్య‌ల‌ను నిజం చేయ‌డానికి ఈటెల కూడా రంగంలోకి దిగాడ‌ని తెలిసింది. పైగా ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చే సీనియ‌ర్ల‌ను ఆక‌ర్షించాల‌ని బాహాటంగా తెలుగు రాష్ట్రాల బీజేపీ శాఖ‌ల‌కు తిరుప‌తి వేదిక‌గా అమిత్ షా దిశానిర్దేశం చేశాడు. ఆ దిశ‌గా ఇప్పుడు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి, ఎమ్మెల్మే ఈటెల మాస్ట‌ర్ ప్లాన్ రచిస్తున్నారు.

ఎమ్మెల్సీ ప‌ద‌వుల‌కు ఆశావ‌హులు చాలా మంది టీఆర్ఎస్ లో ఉన్నారు. కానీ, వాళ్ల‌కు ఈసారి కూడా నిరాశ మిగిలింది. రెండోసారి కూడా చాలా మందిని కొన‌సాగించ‌డానికి కేసీఆర్ నిర్ణ‌యం తీసుకున్నాడు. ఆ జాబితాలో క‌విత పేరును కూడా చేర్చాడు. కుటుంబంలోని అంద‌రికీ. కేసీఆర్ ప‌ద‌వులు ఇచ్చుకున్నాడు. ఇదే ఇప్పుడు ఆ పార్టీలో అంత‌ర్గ‌తంగా మండుతోన్న అంశం. సంస్థాగ‌త ప‌ద‌వుల విష‌యంలోనూ కొన్ని వ‌ర్గాల‌ను టీఆర్ఎస్ నిర్ల‌క్ష్యం చేసింది. ఆ విష‌యాల‌ను ఫోక‌స్ చేస్తూ బీజేపీ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ ను టీఆర్ఎస్ మీద ప్ర‌యోగించ‌డానికి సిద్ధం అవుతోంది. పైగా హుజురాబాద్ ఉప ఫ‌లితాలు బీజేపీ వైపు సీనియ‌ర్లు చేసేలా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ల‌డానికి ఎవ‌రూ సాహ‌సించ‌డంలేదు. అక్క‌డ గ్రూప్ విభేదాలు తారాస్థాయిలో ఉన్నాయ‌నే విష‌యం అందిరికీ తెలిసిందే. అందుకే, ప్ర‌త్యామ్నాయంగా బీజేపీ వైపు టీఆర్ఎస్ లోని అసంతృప్తి వాదుల చూపు ఉంది. వాళ్లకు వ‌ల వేయ‌డానికి ఈటెల త‌న‌దైన శైలిలో రాజ‌కీయ పావులు క‌దుపుతున్నాడు. అవి ఎంత వ‌ర‌కు ఫ‌లితాస్తాయో చూద్దాం.!