Telangana BJP Upset: బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్.. కండువా కప్పుకునేవారేరి!

తెలంగాణ బీజేపీలో పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని కమలనాథులు ఆ మధ్య బాకా ఊది మరీ చెప్పారు.

  • Written By:
  • Updated On - September 28, 2022 / 12:11 PM IST

తెలంగాణ బీజేపీలో పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని కమలనాథులు ఆ మధ్య బాకా ఊది మరీ చెప్పారు. మంచి రోజులు లేవు శ్రావణ మాసంలో ఎంత మంది వస్తారో చెప్పలేమని ఊదరగొట్టారు. శ్రావణ మాసంలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తప్ప రాష్ట్రంలో చరిష్మా ఉన్న నాయకులు పెద్దగా కాషాయ కండువా కప్పుకోలేదు. ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, బొమ్మ శ్రీరామ్‌, రాజయ్య యాదవ్‌తోపాటు కొందరు రిటైర్డ్‌ అధికారులు మాత్రమే బీజేపీలోకి ఎంట్రీ ఇచ్చారు. బీజేపీ నేతలు ఆశించినట్టుగా వలస నేతల తాకిడితో పార్టీ గేట్లు తెగలేదు. తలుపులు తెరిచి కూర్చున్నా.. వచ్చే వాళ్లు వారికి కనుచూపు మేరలో కనిపించడం లేదు.

చేరికలపై ఎవరైనా ప్రశ్నిస్తే.. బీజేపీ నుంచి వచ్చే సమాధానం ఒక్కటే. సీక్రెట్‌ ఆపరేషన్‌ జరుగుతోందని.. త్వరలోనే ఆ ఆపరేషన్‌ ప్రభావం చూస్తారని చెబుతున్నారు. రోజులు గడిచిపోతున్నాయి కానీ.. చేరికలు లేవు.. ఆ మాటే మర్చిపోతున్న పరిస్థితి. అదిగో ఇదిగో అని పలువురి పేర్లు ప్రచారంలో ఉన్నప్పటికీ.. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నా.. బీజేపీ గడప తొక్కి పార్టీ కండువా కప్పుకోవడం లేదు. వేచి చూడండి ఎంత మంది పార్టీలో చేరతారని బీరాలు పలకడమే సరిపోతోంది.

అంతకుముందు బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి నేతృత్వంలో చేరికల కమిటీ వేశారు. తర్వాత ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ నేతృత్వంలో కొత్తగా చేరికల కమిటీ వచ్చింది. ఈ విషయంలో స్పీడ్‌ పెంచాలనే ఉద్దేశంతో బీజేపీ ఢిల్లీ నాయకత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. కానీ… అధిష్ఠానం ఆశలకు తగ్గట్టుగా రాష్ట్రంలో ప్రయత్నాలు లేవన్నది కాషాయ శిబిరంలో వినిపిస్తున్న మాట. ప్రస్తుత చేరికల కమిటీలో కీలక నాయకులే ఉన్నారు. ఈ కమిటీలో ఉన్న నాయకులు ఇప్పటి వరకు భేటీ అయ్యి చర్చించింది లేదు. అధిష్ఠానం ఫ్రీ హ్యాండ్‌ ఇచ్చినా.. చేరేందుకు సిద్ధంగా ఉన్నవారికి పూర్తి భరోసా ఇవ్వలేకపోతున్నారట. కమిట్‌మెంట్‌ ఇచ్చేందుకు సైతం కొందరు జంకుతున్నట్టు సమాచారం. ముఖ్యంగా కాంగ్రెస్‌ పార్టీ నుంచి పెద్ద సంఖ్యలో నేతలను బీజేపీలోకి లాగాలని చూసినా.. అది వర్కవుట్ కావడం లేదట.

రాష్ట్రంలో ఎన్నికలు, మంచి ముహూర్తాలు వస్తున్నాయి.. పోతున్నాయి. వరదలా బీజేపీలో చేరిక కలగానే మిగిలిపోతోంది. ప్రస్తుతం అందరి దృష్టీ మునుగోడు బైఎలక్షన్‌పై ఉంది. అక్కడ ఫలితాన్ని బట్టి బీజేపీలో చేరాలా వద్దా అని వివిధ పార్టీలలోని నేతలు ఆలోచిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ విషయం చెప్పుకొనే సమాధాన పడుతున్నారట బీజేపీ నేతలు. మునుగోడులో గెలిస్తే.. బీజేపీలోకి వలసలను ఆపలేమని కొత్త రాగం అందుకుంటున్నారు. మునుగోడులో ఫలితం ఆశించినట్టు రాకపోతే ఏంటన్నదానికి ఎవరూ జవాబు ఇవ్వడం లేదు.

తాజాగా రాష్ట్రానికి వచ్చిన బీజేపీ అగ్రనేత… కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. పార్టీ నేతలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. చేరికలపై ప్రత్యేకంగా అమిత్ షా ఆరా తీశారు. బీజేపీలో ఇతర పార్టీల నాయకులు ఎందుకు చేరడం లేదు అని గట్టిగానే ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఆపై నేతల నుంచి వచ్చిన సమాధానంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. మరి.. ఈ విషయంలో రాష్ట్ర బీజేపీ నేతలు కొత్త వ్యూహం ఎంచుకుంటారో లేక.. కాలం కలిసొచ్చే వరకు వేచి ఉంటారో చూడాలి.