Site icon HashtagU Telugu

SSC paper leak: బండి సంజయ్ కు రిమాండ్

Bandi Sanjay

Bandi Sanjay

SSC paper leak: తెలంగాణలో టెన్త్‌ పేపర్‌ లీక్‌ వ్యవహారం రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది. ఈ కేసులో బండి సంజయ్‌ను అరెస్ట్‌ చేయడం, మెజిస్ట్రేట్‌ రిమాండ్‌ విధించడం సంచలనంగా మారింది. ఈ కేసులో బండి సంజయ్‌ను ఏ1గా చేర్చి పోలీసులు అరెస్ట్‌ చేశారు. సంజయ్‌ని కరీంనగర్‌లో అరెస్ట్‌ చేసిన పోలీసులు… అనంతరం అక్కడి నుంచి భువనగిరిలోని బొమ్మలరామరం పీఎస్‌కు తరలించారు.

అక్కడి నుంచి పెంబర్తి మీదుగా పాలకుర్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షల అనంతరం నేరుగా జడ్జి నివాసానికి తీసుకెళ్లారు. ఇరువర్గాల వాదనలు విన్న జడ్జి…. బండి సంజయ్‌కి 14 రోజులు రిమాండ్‌ విధించారు. దీంతో బండి సంజయ్ ను కరీంనగర్ జైలుకు తరలించారు. ఇదిలా ఉంటే బండి సంజయ్ బిజెపి లీగల్ సెల్ ప్రతినిధులకు పోలీసులు తన పట్ల వ్యవహరించిన తీరును వెల్లడించారు. పోలీసులు తన పట్ల దురుసుగా వ్యవహరించారని, తనకు గాయాలయ్యాయని చొక్కా విప్పి లాయర్లకు బండి సంజయ్ చూపించారు. కావాలనే కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. మరోవైపు పేపర్ లీకేజి, రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ అరెస్టుపై రిమాండ్‌ రిపోర్ట్‌లో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు.

బండి సంజయ్‌ డైరెక్షన్‌లోనే పేపర్‌ లీకేజ్‌ వ్యవహారం అంతా నడిచిందన్నారు సీపీ రంగనాథ్‌. ఈ కేసులో ఏ1 బండి సంజయ్‌తో పాటు మరికొందరు ఉన్నారని తెలిపారు. ప్రశాంత్ అనే వ్యక్తి క్వశ్చన్ పేపర్ ను బండి సంజయ్ కు షేర్‌ చేసినట్లు తెలిపారు. పేపర్ లీక్‌కు ముందే బండి సంజయ్, ప్రశాంత్ మధ్య చాట్‌ నడిచిందని స్పష్టం చేశారు. మరోవైపు ఎంపీ బండి సంజయ్‌ను ఫోన్ గురించి అడిగితే ఎక్కడుందంటే తెలియదంటున్నారని సీపీ చెప్పుకొచ్చారు. ఫోన్ ఇస్తే కీలకమైన సమాచారం బయటకు వస్తుందని వారికి తెలుసని… అందుకే ఫోన్ ఇవ్వట్లేదని తెలిపారు. బండి సంజయ్ ఫోన్‌కాల్ డేటా సేకరిస్తే మరింత సమాచారం తెలుస్తుందన్నారు. మరోవైపు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ను అక్రమంగా అరెస్ట్ చేశారని బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది.

ఈ మేరకు పిటిషన్‌ను దాఖలు చేసింది. అరెస్ట్ సమయంలో పోలీసులు నిబంధనలు పాటించలేదని పిటిషన్ లో పేర్కొంది. అరెస్ట్ విషయాన్ని కనీసం కుటుంబ సభ్యులకు కూడా చెప్పలేదని పిటీషన్ లో తెలిపారు. ఈ పిటీషన్ ను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు గురువారం విచారించనుంది.