Site icon HashtagU Telugu

Bandi: ‘తెలంగాణ గడ్డ’.. ఇక ‘కాషాయ’ అడ్డా!

Bandi Imresizer

Bandi Imresizer

తెలంగాణ గడ్డ… ఇక కాషాయం అడ్డా కాబోతోంది… హైదరాబాద్ పార్లమెంట్ ను బీజేపీ కైవసం చేసుకోబోతోంది…..అందుకే ఇక్కడి నుండే శంఖారావం పూరిస్తున్నామని అన్నారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. తెలంగాణలో బీజేపీ జెండా ఎగరేయబోతున్నాం… బీజేపీ అధికారంలోకి వచ్చాక పాతబస్తీలో ‘ఘర్ వాపసీ’ కార్యక్రమాన్నిఅమలు చేస్తాం… గణేష్ నిమజ్జనోత్సవాలను అధికారికంగా నిర్వహిస్తాం.’’అని బండి సంజయ్ పేర్కొన్నారు. నగరంలోని చంపాపేట మినర్వా గార్డెన్స్ లో ఆదివారం నాడు హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సదస్సు జరిగింది. బండి సంజయ్ తోపాటు కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, పార్టీ శాసనసభాపక్ష నేత రాజాసింగ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు దుగ్యాల ప్రదీప్ కుమార్, మంత్రి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, రాష్ట్ర కార్యదర్శి ప్రకాశ్ రెడ్డి సహా పలువురు సీనియర్ నాయకులతోపాటు హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన నాయకులు, పెద్ద ఎత్తున కార్యకర్తలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ ఉద్వేగభరిత ప్రసంగం చేశారు.

బండి సంజయ్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు:

పాతబస్తీ ఎంఐఎం అడ్డా అట …అక్కడ సభలెందుకని ఆనాడు పోలీసులు చెబితే… మన దమ్మేందో చూపించామా? లేదా?

పాతబస్తీలో ఒకనాడు కన్నడ, మరాఠా, గుజరాతీలు ఉండేవాళ్లు. ఇది మినీ భారత్ గా ఉండేది. ఎంఐఎం ఆగడాలు తట్టుకోలేక వాళ్లంతా మూసీనది అవతలకు వెళ్లిపోయారు.

కార్వాన్ లో కాషాయ జెండాను రెపరెపలాడించిన నాయకుడు బద్దం బాల్ రెడ్డి. నిరంతరం హిందూ ధర్మ రక్షకుడు రాజాసింగ్ గోషామహల్ లో జెండాను రెపరెపలాడిస్తున్నారు. గతంలో మలక్ పేటలో ఇంద్రసేనారెడ్డి గెలిచారు.

హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో నాలుగు అసెంబ్లీ స్థానాలను గెలుచుకునే సత్తా బీజేపీకి ఉంది. అలాంటప్పుడు హైదరాబాద్ పార్లమెంట్ స్థానాన్ని గెలుచుకోవడం పెద్ద కష్టమా? కానేకాదు.

కాశ్మీర్ లో పండిట్లపై ఉచకోత కోసి కొందరు కాశ్మీర్ ను ఆక్రమించుకున్నారు. పాతబస్తీలోనూ అదే మారణకాండను కొనసాగించి హిందువులను వెళ్లగొడుతున్నారు.

బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డాక…. ఎంఐఎం గూండాల అరాచకాలకు భయపడి వెళ్లిన వారందరినీ తిరిగి పాతబస్తీకి తీసుకొస్తాం. వాళ్ళ ఆస్తులను వాళ్లకు అప్పగించేలా చేస్తాం. ఘర్ వాపసీ కార్యక్రమం పాతబస్తీ నుండే స్టార్ట్ చేస్తాం.

దారుస్సలాం ఎవరిది…. రజాకార్లను తరిమికొట్టే తరుణంలో దారుస్సలాంను సర్దార్ వల్లభాయ్ పటేల్ సీజ్ చేశారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో సలావుద్దీన్ ఒవైసీ వెళ్లి దారుస్సలాం అప్పగిస్తే తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేస్తానని చెబితే..నాటి సీఎం కాసు బ్రహ్మానందరెడ్డి దారుస్సలాం భవనాన్ని ఎంఐఎంకు అప్పగించారు

తెలంగాణను మొదటి నుండి అడ్డుకున్న పార్టీ ఎంఐఎం, ఆగడాలకు పాల్పడ్డ పార్టీ ఎంఐఎం.

ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ చంకలోకి ఎక్కే పార్టీ ఎంఐఎం.

ఓట్ల కోసం అల్లా గురించి తెల్వకపోయినా మసీదులకు పోయి రాజకీయ నేతల గురించి జాగ్రత్తగా ఉండాలి.

నేను మసీదు, చర్చ్ లకు వెళ్లను. వాటి పవిత్రతను దెబ్బతీయలేను. ఎందుకంటే అల్లా, ఏసు క్రీస్తు గురించి నాకు తెల్వదు.

పాతబస్తీని న్యూసిటీలాగా మార్చాలన్నదే బీజేపీ తాపత్రయం. అధికార పార్టీతో చెట్టాపట్టాలేసుకునే ఎంఐఎం ఎందుకు ఇన్నేళ్లుగా పాతబస్తీని అభివ్రుద్ది చేయలేదో ఆలోచించలేదు. మెట్రో లేదు. రోడ్లు సరిగా లేవు. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదు.

నేనడుగుతున్నా… ఈ కుహానా శక్తులు ఒక ముస్లిం అమ్మాయి కాలేజీ యూనిఫాం వేసుకోవాలని అక్కడి విద్యార్థులు చెబితే… వేసుకోనని నినాదాలు చేస్తూ వెళ్లిపోతే భేష్ అన్న వాళ్లంతా…. యూనిఫాం వేసుకోవాల్సిందేనని పోస్ట్ చేస్తే నా తమ్ముడు హర్షను కత్తులతో పొడిచి చంపితే నోరెందుకు మూసుకున్నారు?

మాట్లాడితే బీజేపీని మతతత్వ పార్టీ అంటున్న వాళ్లను నేనడుగుతున్నా. 12 శాతం ఓట్లున్న ముస్లిం గురించి అన్ని పార్టీలు ఆలోచిస్తున్నాయో… మరి 80 శాతం ఓట్లున్న హిందువుల గురించి ఎందుకు ఆలోచించరు? హిందువులు చేసిన తప్పేంటి?

హైదరాబాద్ లో ఎట్టి పరిస్థితుల్లోనూ మెజారిటీ స్థానాలు కైవసం చేసుకుని తీరతాం. తద్వారా హైదరాబాద్ పార్లమెంట్ పై కాషాయ జెండాను రెపరెపలాడించి ఎంఐఎం కోటను బద్దలు కొడతాం.

నిఖార్సయిన హిందువని ఫోజులిస్తున్న కేసీఆర్ ను, టీఆర్ఎస్ నేతలను నేనడుగుతున్నా… ముస్లిం పండగలొస్తే… రంజాన్ శుభాకాంక్షలని ఫ్లెక్సీలు కడుతూ శుభాకాంక్షలు చెబుతారే… హిందూ పండగలప్పుడు ఎందుకు ‘హిందూ బంధువులకు దసరా శుభాకాంక్షలు’’అని ఫ్లెక్సీలు పెట్టరు?

హిందువులు తాము హిందువులని చెప్పుకుంటే మతతత్వమంటారా? దీనికి కారణం మన చేతగానితనమే. కేసీఆర్ హిందుగాళ్లు…బొందుగాళ్లని అంటే కరీంనగర్ ప్రజలు టీఆర్ఎస్ ను అక్కడ బొంద పెట్టారు.

భయపడే ప్రసక్తే లేదు…. కరీంనగర్ లో హిందువుల ఓట్లనే నేను గెలిచా. సికింద్రాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్ లో బీజేపీ గెలిచింది ఏ ఓట్లతో? మీరు ఒక్కసారి ఆలోచించండి.

ముస్లిం మహిళల వెనుకబాటు తనానికి ప్రధాన కారణం ట్రిపుల్ తలాఖ్ మూఢత్వ విధానమే కారణం. అందుకే నరేంద్రమోదీ ప్రభుత్వం ట్రిపుల్ తలాఖ్ ను రద్దు చేస్తే ఎంఐఎం, టీఆర్ఎస్ సమర్ధించడం లేదు.

ఇలానే ఉంటే ముస్లిం మహిళలు ఓట్లు వేయకుండా ఎంఐఎం ఫత్వా జారీ చేసే ప్రమాదం ఉంది.

అందుకే ప్రజలంతా టీఆర్ఎస్, ఎంఐఎం పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. ఏ సర్వే చూసినా ప్రజలు బీజేపీని ఆదరిస్తున్నారనే తేలిపోయింది. కేసీఆర్ చేసుకున్న సర్వేల్లోనూ ఇదే వెల్లడైంది.

అందుకే బీజేపీని బదనాం చేయడానికే హత్య కుట్ర కేసు అంటూ టీఆర్ఎస్ డ్రామాలు చేస్తోంది.

టీఆర్ఎస్ నేతల బెదిరింపులకు, కేసులకు భయపడే ప్రసక్తే లేదు. బీజేపీ కార్యకర్తలంతా జైలుకు వెళ్లేందుకు, లాఠీ దెబ్బలు తినేందుకు సిద్ధం. కేసీఆర్?.. నీ బడ్జెట్ లో జైళ్ల కోసం, అదనపు లాఠీల కోసం నిధులు కేటాయించుకుంటే బెటర్…

1400 మంది యువకులు బలిదానం చేసి సాధించుకున్న తెలంగాణ ఎవరి కోసం.. ఈ అవినీతి, నియంత, కుటుంబ పాలన కోసమా?

ప్రజలంతా ఆలోచించాలి. ప్రజాస్వామిక తెలంగాణ కోసం ఇదే చివరి ఉద్యమం కావాలి. టీఆర్ఎస్ ను కూకటి వేళ్లతో పెకలించాలి.

కేసీఆర్ ఇంట్లో సీఎం సీటు కోసం టీవీలు పగులుతున్నాయి. మనవడొచ్చి మా అయ్యను సీఎంను ఎప్పుడు చేస్తావని గోల చేస్తున్నాడట

ప్రజలు తిరగబడుతున్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చే ప్రసక్తేలేదని తేలిసే… కొడుకును సీఎం చేయాలని కేసీఆర్ ఇంట్లో పెద్ద గోల మొదలైంది. అందుకే ప్రజలను దారి మళ్లించేందుకు, తానేదో దేశ రాజకీయాల్లోకి వెళుతున్నట్లు కేసీఆర్ డ్రామా చేస్తున్నారు

ఎవరూ పిలవకపోయినా తానే ఇతర రాష్ట్రాలకు పోతున్నాడు. స్టాలిన్ పుస్తకావిష్కరణ సభకు కూడా కేసీఆర్ ను పిలవలేదు. రాంచీ వెళితే కేసీఆర్ మాట్లాడుతుంటేనే అక్కడి సీఎం సోరెన్ లేచి వెళ్లిపోతుంటే..బలవంతంగా కూర్చోపెట్టిన ద్రుశ్యాలు మీరు చూసే ఉంటారు.

కేసీఆర్ మాటలు నమ్మేవాళ్లెవరూ లేరు. నెంబర్ వన్ ద్రోహి. నెంబర్ వన్ అవినీతి పరుడు. ఆప్ ఎమ్మెల్యే కూడా కేసీఆర్ ను నెంబర్ వన్ అవినీతిపరుడు ఆయన మాటలు నమ్మేది లేదని మాట్లాడుతున్నారు

తెలంగాణ సమాజం కేసీఆర్ ద్రోహాన్ని గుర్తించింది. ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చింది. కేంద్రంలో మాదిరిగానే రాష్ట్రంలోనూ బీజేపీకి అధికారం ఇచ్చి డబుల్ ఇంజిన్ పాలనను స్వాగతిస్తున్నారు.

అసలు కేసీఆర్ ఫాలనలో చేస్తున్నదేమిటి? కేసీఆర్ కిట్, కళ్యాణ లక్ష్మీ, రైతు బంధు… ఇవి మాత్రమే ఇంతకు మించి కేసీఆర్ చేసిందేమీ లేదు.

నరేంద్రమోదీ ప్రభుత్వం తెలంగాణలో రోడ్లు నిర్మిస్తోంది. గ్రామాలను అభివ్రుద్ధి చేస్తోంది. కిలోకు రూ.29లు ఖర్చు చేసి పేదలందరికీ రేషన్ బియ్యం కేంద్రమే ఇస్తోంది. టాయిలెట్లు, రైతు వేదికలు నిర్మిస్తోంది బీజేపీ. లైట్ల కోసం, హరిత హారం కోసం డబ్బులిస్తోంది బీజేపీనే.

చివరకు కోవిడ్ వస్తే 130 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తున్న ప్రభుత్వం నరేంద్రమోదీదే.

ప్రభుత్వ ఆసుపత్రుల ఆధునీకరణ కోసం నిధులిస్తున్న ప్రభుత్వం నరేంద్రమోదీదే.

అయినా తెలంగాణకు కేంద్రం చేసిందేమీ లేదంటూ బదనాం చేస్తూ టీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోంది. దీనిని అడుగడుగునా అడ్డుకోవాల్సిన బాధ్యత బీజేపీపై ఉంది.

కేసీఆర్ అవినీతి అందరికీ తెలిసిపోయింది. ఆయన జైలుకు పోవడం ఖాయం. అందుకే జైలుకు వెళ్లకుండా, సానుభూతి సంపాదించేందుకు ఇతర రాష్ట్రాలకు పోతున్న వ్యక్తి కేసీఆర్.

ఏడేళ్లుగా ప్రగతి భవన్, ఫాంహౌజ్ కే పరిమితమైన కేసీఆర్ ను రోడ్ల మీదకు తీసుకొచ్చిన ఘనత బీజేపీ దే.

నిరుద్యోగులు, రైతులు, ఉద్యోగులు సహా అన్ని వర్గాల ప్రజల కోసం పోరాడుతున్న పార్టీ బీజేపీ. 317 జీవో సవరణకు ఉద్యమిస్తే నా పార్టీ కార్యాలయంపై దాడి చేసి జైలుకు పంపింది నిజం కాదా? ధాన్యం కొనాలని డిమాండ్ చేస్తే టీఆర్ఎస్ గూండాలతో దాడులు చేయించింది టీఆర్ఎస్.