Bandi Sanjay Yatra: బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర వాయిదా.. కార‌ణ‌మిదే..?

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్ర వాయిదా పడింది.

  • Written By:
  • Publish Date - October 3, 2022 / 10:18 PM IST

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్ర వాయిదా పడింది. మునుగోడు ఉపఎన్నిక షెడ్యూల్‌ రావడంతో సంజయ్‌ పాదయాత్రను వాయిదా వేసుకున్నారు. ఈ నెల 15 నుంచి ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్ర చేపట్టాలని సంజయ్‌ నిర్ణయించుకున్నారు. కానీ.. ఉపఎన్నిక నేపథ్యంలో మార్చుకుంటున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి.

యాత్రను మళ్లీ ఎప్పుడు నిర్వహించాలన్న దానిపై త్వరలోనే స్పష్టత వస్తుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. మునుగోడుతో పాటు అంధేరి ఈస్ట్‌ (మహారాష్ట్ర), మోకమా (బిహార్‌), గోపాల్‌గంజ్‌ (బిహార్‌), అదంపూర్‌ (హరియాణా), గోల గోఖర్నాథ్‌ (ఉత్తర్‌ప్రదేశ్‌), ధామ్‌నగర్‌ (ఒడిశా)లో స్థానాల్లో ఉప ఎన్నికలు జరగనున్నాయి. మునుగోడులో నవంబర్‌ 3న పోలింగ్‌ నిర్వహించి నవంబర్‌ 6న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు ఈసీ ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ నెల 7న మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆరోజు నుంచి ఈ నెల 14 వరకు నామపత్రాలు స్వీకరిస్తారు. 15న పరిశీలన ఉంటుంది. ఈ నెల 17 వరకు ఉప సంహరణకు గడువు ఉంటుంది. వచ్చే నెల మూడో తేదీన ఉప ఎన్నిక పోలింగ్ నిర్వహిస్తారు. ఓట్ల లెక్కింపు 6న చేపడతారు. 2022 జనవరి ఒకటో తేదీ అర్హతగా రూపొందించిన ఓటర్ల జాబితా ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తారు.