Site icon HashtagU Telugu

Telangana BJP: టీ బీజేపీ మెరుపు ఆపరేషన్ షురూ!

తెలంగాణ బీజేపీ రాజకీయ మెరుపు ఆపరేషన్స్ కు బ్లూ ప్రింట్ సిద్ధం చేసింది. ఇతర పార్టీ ల నుంచి లీడర్స్ ను తీసుకోవడానికి ఇంద్రసేనారెడ్డి చైర్మన్ గా జాయినింగ్స్ అండ్ కో ఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేసింది. జితేందర్ రెడ్డి ఛైర్మన్ గా ఎస్సీ, గరికపాటి ఛైర్మన్ గా ఎస్టీ సమన్వయ కమిటీల ఏర్పాటు చేయడంతో మరింత దూకుడు పెంచింది. ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా బండి సంజయ్ కార్యాచరణ తయారు చేసాడు.

రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలొచ్చినా బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ కార్యాచరణను సిద్ధం చేశారు. ఒకవైపు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై భారీ ఎత్తున ఉద్యమాలు చేస్తూ ప్రజల్లోకి వెళుతున్న బండి సంజయ్ … అదే సమయంలో క్షేత్ర స్థాయిలో బీజేపీని తిరుగులేని శక్తిగా రూపొందించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ఎస్సీ, ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాలపై ప్రత్యేక ద్రుష్టి సారించిన బండి సంజయ్ ఆయా నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలను సమన్వయం చేసేందుకు ఎస్సీ, ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయ కమిటీలను నియమించారు. దీంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇతర పార్టీ ల నుండి పెద్ద ఎత్తున బీజేపీలో చేరేందుకు ఆసక్తిచూపుతుండటంతో పార్టీ పరంగా రాష్ట్రస్థాయిలో జాయినింగ్స్ అండ్ కో ఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేశారు.

• జాయినింగ్స్ అండ్ కో ఆర్డి నేషన్ కమిటీ ఛైర్మన్ గా బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు నల్లు ఇంద్రసేనారెడ్డి నియమితులయ్యారు. శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్, మాజీ మంత్రులు డాక్టర్ ఎ.చంద్రశేఖర్, రవీంద్ర నాయక్, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ ఎన్.రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజేశ్వర్ రావు, జీహెచ్ఎంసీ మహిళా మోర్చా మాజీ అధ్యక్షురాలు బండారి రాధిక లను జాయినింగ్స్ అండ్ కో ఆర్డినేషన్ కమిటీలో సభ్యులుగా నియమించారు.

• అట్లాగే ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయ కమిటీ ఛైర్మన్ గా మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి , ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయ కమిటీ ఛైర్మన్ గా మాజీ ఎంపీ గరికపాటి మోహన్ రావు నియమితులయ్యారు.

• ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయ కమిటీలో మాజీ ఎమ్మెల్యేలు ఒంటేరు జైపాల్, ఎం.ధర్మారావు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్, టీఎస్పీఎస్సీ మాజీ సభ్యుడు సీహెచ్.విఠల్ తోపాటు ఎస్సీ మోర్చా నాయకురాలు కాంచన క్రిష్ణలను సభ్యులుగా నియమించారు.

• ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయ కమిటీలో మాజీ ఎంపీ చాడా సురేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కూన శ్రీశైలం గౌడ్, కటకం మ్రుత్యుంజయం, పార్టీ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి చింతా సాంబమూర్తి, జిల్లా పరిషత్ మాజీ ఛైర్ పర్సన్ సుహాసినీ రెడ్డిలను సభ్యులుగా నియమించారు.