Site icon HashtagU Telugu

BC Reservations : బీసీలకు 42% రిజర్వేషన్లు వాస్తవమవుతాయా? కేంద్రం అడ్డుకట్ట వేస్తోందా?

Bc Reservations

Bc Reservations

BC Reservations : తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుపై పెద్ద చర్చ సాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం బీసీలను రాజకీయంగా, విద్యలో, ఉద్యోగాల్లో సుస్థిరంగా ప్రాతినిధ్యం కల్పించాలనే లక్ష్యంతో ఈ ప్రణాళికను తెరపైకి తెచ్చింది. కుల గణన ద్వారా సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని ప్రభుత్వం శాస్త్రీయంగా స్టడీ చేసి అసెంబ్లీలో బిల్లు తీసుకువచ్చింది. రెండు సభల్లోనూ ఆమోదించిన ఈ బిల్లులు రాష్ట్రపతి ఆమోదం కోసం పంపినట్లు అధికారికంగా వెల్లడించారు.

కానీ ఆశించిన వేగంతో కేంద్రం స్పందించకపోవడం ప్రభుత్వానికి ఎదురుదెబ్బగా మారింది. ఇప్పటికే నాలుగు నెలలు గడుస్తున్నా రాష్ట్రపతి ఆమోదం రాకపోవడం, బిల్లులను తిరిగి పంపకపోవడం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. ఇదే సమయంలో, గత ప్రభుత్వ హయాంలో 2018లో తీసుకొచ్చిన రిజర్వేషన్ల క్యాప్ తొలగింపుపై పంపిన ఆర్డినెన్స్ కూడా ఆమోదం పొందలేదు.

ఈ నేపథ్యంలో కేంద్రంపై ఒత్తిడి తేవాలన్న ఉద్దేశంతో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీకి పెద్ద ఎత్తున కదిలింది. జంతర్ మంతర్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిసి ధర్నా చేపట్టారు. ‘ఇండియా’ కూటమిలోని ఇతర పార్టీల మద్దతు కూడా సంపాదించారు. ధర్నా అనంతరం రాష్ట్రపతిని కలిసి వినతిపత్రం సమర్పించాలని భావించినా, అపాయింట్మెంట్ లభించలేదు. దాంతో మోడీ సర్కార్ బీసీల రిజర్వేషన్ల పట్ల నిర్లక్ష్యం చూపుతోందని తీవ్ర విమర్శలు వచ్చాయి.

ఇప్పుడు ఢిల్లీ ప్రయత్నాలు ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో… తెలంగాణ సర్కార్ ఇక రాష్ట్రంలో నుంచే వ్యూహాత్మక చర్యలకు సిద్ధమవుతోంది. బీసీ రిజర్వేషన్ల కోసం పార్టీ, ప్రభుత్వంగా ఏం చేయాలి అన్న దానిపై లోతుగా చర్చించి కీలక నిర్ణయాలకు సిద్ధమవుతున్నారు. అదేవిధంగా ప్రజల్లో స్పష్టత కల్పించేలా క్షేత్రస్థాయి ఆందోళనలు కూడా చేపట్టే అవకాశం కనిపిస్తోంది.

మొత్తానికి, బీసీ రిజర్వేషన్ల ప్రయాణంలో కేంద్రం నిర్లక్ష్యం పెరుగుతుండగా, తెలంగాణ సర్కార్ మరో దశకు అడుగిడేందుకు సిద్ధమవుతోంది. బీసీలకు హక్కులు కల్పించాలన్న ఆత్మవిశ్వాసంతో… ఆరు దిక్కుల నుంచి పోరాటానికి సిద్ధమవుతోందన్నది అధికార వర్గాల మాట.

Cancer Research : గర్భాశయ కేన్సర్ ముప్పు పెంచే కొత్త డీఎన్‌ఏ మార్పులు వెలుగులోకి