తెలంగాణ శాసనసభ, మండలి సమావేశాలు ఈ నెల 16వ తేదీకి వాయిదా పడ్డాయి. తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. తొలుత సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సభలో ప్రసంగించారు. 60 ఏళ్ల పోరాటాన్ని గౌరవించి, 4 కోట్ల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చి, మన దశాబ్దాల కలను నిజం చేసిన గొప్ప నాయకురాలు శ్రీమతి సోనియాగాంధీ అని కొనియాడారు. తెలంగాణ ప్రజల తరఫున ఆమెకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రంతో, ఇక్కడ ప్రజలతో సోనియాగాంధీది విడదీయలేని అనుబంధం అని పేర్కొన్నారు. ఏటా డిసెంబర్ 9న తెలంగాణ అవతరణ దినోత్సవంగా నిర్వహించాలని ప్రకటించారు. ఈ ప్రకటనపై సభ్యులు మాట్లాడిన తర్వాత సభను 16వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు.
అయితే సీఎం రేవంత్ – అదానీ ఫోటో ముద్రించిన టీషర్టులను ధరించి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అసెంబ్లీ లోనికి వెళ్లకుండా పోలీసులు, భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీ గేట్ వద్దే నిరసన తెలిపారు. టీషర్టులతోనే లోపలికి వెళ్తామని తేల్చిచెప్పగా.. పోలీసులకు, వారికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో కేటీఆర్ (KTR), హరీష్ రావు (Harish Rao) సహా నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. పార్లమెంటుకు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీలు అదానీ ఫోటో ఉన్న టీషర్టులు ధరించి వెళ్లారని కేటీఆర్ తెలిపారు. ‘లగచర్ల ప్రజల తరఫున నిరసన తెలిపేందుకు సభకు వెళ్తున్నాం. బలవంతపు భూసేకరణను వ్యతిరేకంగా రైతుల తరఫున పోరాడతాం. నడిరోడ్డుపైనే ఎమ్మెల్యేలను అడ్డుకోవడం సమంజసమా.?. అదానీకి కాంగ్రెస్ నేతలు దాసోహం అంటున్నారు. అదానీ – రేవంత్ బంధాన్ని బయటపెడతాం. పోలీసులను అడ్డు పెట్టుకుని సభకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో కుస్తీ.. గల్లీలో దోస్తీ కడుతున్నారు. ఆ పార్టీ దుర్మార్గ వైఖరికి వ్యతిరేకంగా అసెంబ్లీలో నిరసన తెలుపుతాం.’ అని పేర్కొన్నారు.
ఇటు హరీష్ రావు సైతం ఆగ్రహం వ్యక్తం చేసారు. శాసనసభలోకి వెళ్లకుండా ప్రతిపక్ష నాయకులను అడ్డుకొని అరెస్టులు చేయడం పట్ల మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ‘అదానీ దొంగ అని, అవినీతి చేశాడని రాహుల్ గాంధీ తిడితే, రేవంత్ రెడ్డి ఇక్కడ చీకటి ఒప్పందాలు చేసుకుంటున్నారు. వివిధ మార్గాల్లో ప్రతిపక్షాలు నిరసనలు తెలియచేస్తుంటాయి. అడ్డుకోవడం దుర్మార్గం. చీకటి ఒప్పందాలు బయట పడుతాయనే ప్రతిపక్షాన్ని సభలోకి రాకుండా అడ్డుకుంటున్నారు. మేము ప్రశ్నిస్తామని భయపడుతున్నారు. తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేయాలని ఎవరైనా ఉద్యమించారా.?. కొత్తగా రూపొందించిన విగ్రహంలో బతుకమ్మను తొలగించి చెయ్యి గుర్తు పెట్టారు. అలా చేయడం తెలంగాణ మహిళలను కించపరచడమే. ఇది రాష్ట్ర ప్రజలకు అవమానం.’ అని మండిపడ్డారు.
Read Also : 110 Murders : కొడుకుపై ‘చేతబడి’ అనుమానం.. 110 మందిని చంపించిన గ్యాంగ్ లీడర్