Telangana Elections: బీజేపీ బిగ్ స్కెచ్.. జూన్ తర్వాత ఎన్నికల సమరం!

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఎప్పుడు నోటిఫికేట్ ఉంటుంది? అనేది దాదాపుగా తెలిసిపోయింది.

  • Written By:
  • Updated On - April 20, 2023 / 03:18 PM IST

తెలంగాణ (Telangana)లో ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, ఇతర పార్టీలు ఎన్నికలకు సిద్దమవుతున్నాయి. ఇప్పటికే ఆత్మీయ సమ్మేళనాలతో బీఆర్ఎస్, కార్నర్ మీటింగ్స్ తో బీజేపీ, సభలు, సమావేశాలతో కాంగ్రెస్ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో అసెంబ్లీ (Assembly) ఎన్నికలు ఎప్పుడు ఉంటాయి? అనుకున్న తేదీకే ఎన్నికలు ఉంటాయా? అనే విషయాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో జూన్ తర్వాత ఎప్పుడైనా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. జూన్ తర్వాత ఎప్పుడైనా ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చు. నిబంధనల ప్రకారం ఏ రాష్ట్రంలోనైనా అసెంబ్లీ గడువు ముగియడానికి ఆరు నెలల ముందు ఎన్నికల షెడ్యూల్‌తో ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ (Notification) జారీ చేయవచ్చు.

జూన్ తర్వాత ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసే అధికారం తెలంగాణలో ఎన్నికల కమిషన్‌కు ఉందని, నగరంలోని కమిషన్ అధికారులు కూడా రెండు రోజుల క్రితం అసెంబ్లీ ఎన్నికల సన్నాహాలను సమీక్షించారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు తెలంగాణలో కేసీఆర్ కు మరింత సమయం ఇచ్చేందుకు బీజేపీ (BJP) సిద్ధంగా లేదని, ఎన్నికల నిబంధనలను పూర్తిగా వినియోగించుకోవచ్చని చెబుతున్నారు. తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ మరింత మెరుగ్గా రాణించేందుకు పక్కా ప్లాన్ వేసినట్లు సమాచారం. బీజేపీ నాయకత్వం ముందస్తు ఎన్నికలు లేదా దేశంలో సార్వత్రిక ఎన్నికలతో పాటు తెలంగాణ ఎన్నికలను సమర్థిస్తోంది.

దీంతో పాటు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ (Telugu States) రెండు రాష్ట్రాలలో కూడా ఒకేసారి ఎన్నికలు జరుగుతాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు తెలంగాణలో 2023 అసెంబ్లీ ఎన్నికలకు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) సన్నాహాలు ప్రారంభించింది. ఏర్పాట్లను పరిశీలించేందుకు డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ కుమార్ వ్యాస్ నేతృత్వంలోని ముగ్గురు సీనియర్ అధికారుల బృందం ఇటీవల హైదరాబాద్ చేరుకుంది. ప్రధాన ఎన్నికల అధికారి విశ్వరాజ్ తదితరులతో కమిషన్ అధికారులు సమావేశమయ్యారు. సమావేశంలో, నితీష్ కుమార్ వ్యాస్ ఓటర్ల జాబితా నవీకరణతో పాటు ఓటర్ల పేర్లను చేర్చడం, మినహాయించడంపై సమీక్షించారు. ఓటరు (Voters) జాబితాపై అధికారులు నిఘా ఉంచి లోపాలు లేని జాబితాను రూపొందించాలని కోరారు. కాగా తెలంగాణలో ప్రస్తుత పరిణామాలను బట్టి చూస్తే ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు అనే విషయం స్పష్టంగా తెలుస్తోంది.

Also Read: Hyderabad Police: బండి నెంబర్ ప్లేట్ ట్యాంపరింగ్ పై పోలీసుల ఫోకస్.. దొరికితే అంతే!