Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీలో (Telangana Assembly) బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వ్యాపార సలహా కమిటీ (BAC) సమావేశాన్ని బహిష్కరించడంపై తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లో భట్టి విక్రమార్క తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ సభ్యులకు స్పీకర్ పట్ల గౌరవం లేదని ఆయన ఆరోపించారు. అసెంబ్లీలో ప్లకార్డులు ఎత్తి నిరసనలు వ్యక్తం చేయొద్దని పలు మార్లు విజ్ఞప్తి చేసినా విపక్ష సభ్యులు ఆగకపోవడం దారుణమన్నారు.
భట్టి విక్రమార్క ఇంకా మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం తరచుగా పెండింగ్ బిల్లులను దశలవారీగా పరిష్కరిస్తోందని స్పష్టం చేశారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో పెండింగ్‌లో ఉన్న డిస్కమ్ బిల్లులను తాము క్లియర్ చేశామని, అదనంగా డైట్ ఛార్జీలను కూడా పెంచినట్లు వివరించారు. అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మధ్య లోన్ల విషయంలో మాటల యుద్ధం చోటు చేసుకుంది.
భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక పరిమితులు లేకుండా భారీగా లోనులు తీసుకుని ఖజానాపై అదనపు భారం మోపిందని ఆరోపించారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్‌మెంట్ చట్టం (FRBM) పరిధిలోనే లోనులు తీసుకుంటుందని స్పష్టతనిచ్చారు.
Also Read: Allu Arjun Will Meet Pawan: పవన్‌ను కలవనున్న అల్లు అర్జున్.. షాక్ ఇవ్వనున్న పోలీసులు!
అంతేకాకుండా తమ ప్రభుత్వం రూ.52 వేల కోట్ల అప్పు తీసుకుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. అదే సమయంలో రూ.66 వేల కోట్ల అప్పులను తిరిగి చెల్లించినట్లు తెలిపారు. ఖర్చు రూపాయితో సహా లెక్కగట్టి చెబుతామని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన బీఆర్ఎస్ నేతలు నీతులు చెప్తున్నారని దుయ్యబట్టారు. మరోవైపు కాంగ్రెస్ ఏడాది పాలనలోనే రూ.1.27 లక్షల కోట్ల అప్పు చేసిందని హరీశ్ రావు ఆరోపించారు.
వారి దొరతనం బయటపడింది: మంత్రి సీతక్క
బీఆర్ఎస్ నేతల నిరసనపై మంత్రి సీతక్క ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘‘నిరసనల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బేడీలు వేశారు తప్ప కేటీఆర్, హరీశ్‌రావు వేసుకోలేదు. అందులోనూ వారి దొరతనం బయటపడింది. నిరసనలో కూడా బీఆర్ఎస్ నేతల్లో సమానత్వంలేదు. రైతులకు బేడీలు వేయడంపై బీఆర్ఎస్ నేతలకు మాట్లాడే అర్హత లేదు. వారి హయంలోనే రైతులకు దాదాపు పది సార్లు బేడీలు వేశారు’’ అని మండిపడ్డారు.