KCR and Jagan: ఎన్నికల వేళ మళ్లీ అన్నదమ్ముల నీళ్ళ పంచాయితీ

విద్యుత్ ఉత్పత్తిని శ్రీశైలం (Srisailam) పై ఆపాలని తెలంగాణ ఫిర్యాదు చేసింది.

  • Written By:
  • Publish Date - February 18, 2023 / 06:00 PM IST

ఎన్నికలు (Election) దగ్గరపడుతున్న వేళ నీళ్ల వివాదం అన్నదమ్ముల మధ్య రాజుకుంటుంది. విద్యుత్ ఉత్పత్తిని శ్రీశైలం (Srisailam) పై ఆపాలని తెలంగాణ ఫిర్యాదు చేసింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కృష్ణా ప్రాజెక్టు నీటిని పంపిణీ చేసేందుకు ఏర్పడిన కృష్ణా బోర్డు కు రాతపూర్వకంగా వివాదానికి దిగింది. మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టులో నీరు అడుగంటుకుంది. ఈ క్రమంలో అక్కడ జలవిద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలని కోరుతూ కేఆర్ఎంబీకి తెలంగాణ లేఖ రాసింది. శ్రీశైలం ప్రాజెక్టులో నీళ్లు వర్షాలు లేక వేసవి కంటే ముందే భానుడి ప్రభావం అధికంగా ఉండడంతో అడుగంటుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని జల విద్యుత్​ ఉత్పత్తి కేంద్రాల ద్వారా ప్రాజెక్టులోని నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఫలితంగా ప్రాజెక్టుకు దిగువన సాగునీటి, తాగునీటి అవసరాలకు రానున్న వేసవిలో తీవ్ర ఇబ్బంది ఏర్పడనుంది. అయితే వెంటనే జల విద్యుత్​ ఉత్పత్తిని నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని కృష్ణా బోర్డును తెలంగాణ నీటి పారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్​ లేఖలో కోరారు.కృష్ణా జలాల్లో ఇప్పుటికే ఆంధ్రప్రదేశ్​ ఎక్కువ నీటిని వినియోగించుకుందని ఆ లేఖలో పేర్కొన్నారు. కేటాయింపుల ప్రకారం చూస్తే ఆంధ్రాకు 615.17 టీఎంసీలు, తెలంగాణకు 316.90 టీఎంసీల వాటాను కలిగి ఉన్నాయని చెప్పారు. గత నెల 25వ తేదీకి ఏపీ 542.45 టీఎంసీలు వినియోగించుకోగా ఇంకా 59.68 టీఎంసీలు ఇంకా వాడుకోవడానికి ఉన్నాయన్నారు. అదే తెలంగాణ  (Telangana) 183.05 టీఎంసీల నీటిని వినియోగించుకోగా ఇంకా 10.20 టీఎంసీల నీరు వాడుకోవడానికి ఉందన్నారు. అయితే తెలంగాణకు 123.63 టీఎంసీలు, ఏపీకి 13.03 టీఎంసీలు కృష్ణా ప్రాజెక్టులో మిగులు ఉందని ఆలేఖలో తెలిపారు.రెండు తెలుగు రాష్ట్రాల అవసరాలకు అనుగుణగా కృష్ణా నీటిని పంపిణీ చేసేందుకు కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం అయింది.

గత ఏడాది డిసెంబరులో జరగాల్సిన బోర్డు సమావేశం అనేక కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. తాజా సమావేశంలో తెలుగు రాష్ట్రాలకు కృష్ణా ప్రాజెక్టుల్లో నుంచి ఎంత మేరకు నీరు అవసరమో అన్న అంశాన్ని చర్చించి నీటి పంపిణీని ఖరారు చేయనున్నారు. శ్రీశైలం (Srisailam) ప్రాజెక్టులో ఇప్పటివరకు 34 టీఎంసీలు నీరు అందుబాటులో ఉండగా నీటిని తోడుకునే కనీస మట్టం స్థాయి 18 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.అలాగే నాగార్జునసాగర్​లో 90 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు నీటి పారుదల అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నీటి ఏడాది మే 31 ముగిసే నాటికి తెలుగు రాష్ట్రాల అవసరాలను పరిగణలోకి తీసుకోవాలని అనుకుంటున్నారు. ఇప్పటికే వినియోగించిన వాటా పోను అందులో మిగిలిన నీటిని ఈ రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయనున్నారు.

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులకు సుప్రీం గ్రీన్​ సిగ్నల్​

పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు పనులు కొనసాగించేందుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 7.15 టీఎంసీల వరకు పనులు కొనసాగించుకునేందుకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రతివాదులు అందరికీ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఆగస్టులో చేపట్టనున్నట్లు ధర్మాసనం తెలిపింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో 7.15 టీఎంసీల వరకు పనులు కొనసాగించుకునేందుకు సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. పర్యావరణ అనుమతులు 7.15 టీఎంసీల ఉపయోగించుకోవటానికి సర్వోన్నత న్యాయస్థానం గ్రీన్​సిగ్నల్​ ఇచ్చింది. అయితే తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించుకు కోవాలని స్పష్టం చేసింది. ప్రజలు తాగునీటి ఎద్దడిని ఎదుర్కొకుండా ఇబ్బందులకు గురికాకూడదన్న ఉద్దేశ్యంతో ఈ అవకాశం కల్పిస్తున్నట్లు జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ ఎంఎం సుందరేశ్‌లతో కూడిన ధర్మాసనం తీర్పును వెలువరించింది. ఈ కేసులో మెరిట్స్‌ ఆధారంగానే తగిన నిర్ణయాలు ఉంటాయని ధర్మాసనం సూచించింది.

ఈ ప్రాజెక్టు నిర్మాణంలో పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించారని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ విధించిన రూ. 500 కోట్ల జరిమానాపై మాత్రం అత్యున్నత న్యాయస్థానంలోని ధర్మాసనం స్టే విధించింది.అయితే పాలమూరు-రంగారెడ్డిపై ఎన్జీటి (NGT) జరిమానా విధిస్తూ.. ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం సవాల్​ చేసింది. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపించింది. తాజాగా ప్రజల తాగునీటి అవసరాలకు అవసరమయ్యే విధంగా 7.15 టీఎంసీల నీటి వరకు మాత్రమే పనులకు అనుమతిని ఇచ్చింది. ఈ కేసులో ఉన్న ప్రతివాదులందరికి ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. ఆరు వారాల్లో ప్రతివాదులు అంతా.. కౌంటర్‌ అఫిడవిట్‌లు దాఖలు చేయాలని, ఆ తర్వాత ఆరు వారాల్లో వాటికి సమాధానంగా రిజాయిండర్‌లు దాఖలు చేయాలని పిటిషనర్‌ను ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణ ఆగస్టులో చేపట్టనున్నట్లు తెలిపింది. పాలమూరు-రంగారెడ్డి (Palamuru and Rangareddy) ప్రాజెక్టులో అవినీతి జరిగిందని మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి గత నెలలో సుప్రీంకోర్టులో పిటిషన్​ వేశారు. పిటిషనర్​ వాదనలను వినాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. అప్పుడు జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌, జస్టిస్‌ హిమాకోహ్లితో కూడిన ద్విసభ్య ధర్మాసనం తీర్పును రెండు వారాలకు వాయిదా వేసింది. ఇంకా ఆ తీర్పు కాకముందనే తాజాగా సుప్రీంకోర్టు పాలమూరు- రంగారెడ్డికి అనుమతులు ఇచ్చింది.

వ్యూహాత్మకంగా కేసీఆర్ నీళ్లు , నిధులు సమకూర్చుకుంటున్నారు. కానీ జగన్ మాత్రం తెలంగాణ ఇవ్వాల్సిన నిధులనుకుడా పొందలేకపోతున్నారు. కృష్ణా, గోదావరి నదులపై కేసీఆర్ వేగంగా ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు. శ్రీశైలం (Srisailam) విద్యుత్ తయారీ, నదుల్లో వాటాలు, పాలమూరు రంగారెడ్డి నిర్మాణంపై వచ్చిన అనుమతులు వెరసి ఎన్నికల నాటికి ఏపీ, తెలంగాణ మధ్య నీటి యుద్ధాన్ని చూడబోతున్నా మన్నమాట. ఇదే అన్నదమ్ముల ఎన్నికల ఎత్తుగడగా ప్రత్యర్థులు భావిస్తున్నారు.

Also Read: Rats Eat Cannabis: గంజాయి తిన్న ఎలుకలు.. కేరళ కోర్టు తీర్పులో బిగ్ ట్విస్ట్!