తెలంగాణ ప్రభుత్వం రిజర్వేషన్లకు వ్యతిరేకం : మంత్రి కేటీఆర్

ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగ రిజర్వేషన్లకు రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకమని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలకు రిజర్వేషన్లు ఉండవని, ప్రభుత్వ ఉద్యోగాలకు కేవలం రెండు శాతం రిజర్వేషన్లు మాత్రమే ఉంటాయన్నారు.

  • Written By:
  • Updated On - November 6, 2021 / 12:34 PM IST

ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగ రిజర్వేషన్లకు రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకమని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.  ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలకు రిజర్వేషన్లు ఉండవని, కేవలం ప్రభుత్వ ఉద్యోగాలకు మాత్రమే రెండు శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయన్నారు. (AIMIM) ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ ఉద్యోగాలలో స్థానికులకు రిజర్వేషన్లను కల్పించాలని ప్రస్తావించగా, మంత్రి కేటీఆర్ ఈ విధంగా స్పందించారు.

ఇది పోటీ ప్రపంచం. అమెజాన్, గూగుల్, ఇతర ప్రైవేట్ కంపెనీలకు స్థానికులను మాత్రమే నియమించుకోవాలని చెప్పలేనని, స్థానికులకే రిజర్వేషన్ కల్పించాలని తాము కోరితో ప్రతిష్టాత్మక సంస్థలు హైదరాబాద్ కు రావని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ కోటాలను పరిష్కరించడానికి బదులు.. స్థానిక యువతకు ఉపాధినిచ్చే ప్రైవేట్ కంపెనీలకు అదనపు ప్రోత్సాహకాలను అందిస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఏడేళ్ల కాలంలో  హైదరాబాద్ ఐటీ రంగాల్లో వేగంగా పురోగతిని సాధించిందని కేటీఆర్ తెలిపారు.

2014 లో రాష్ట్ర ఏర్పాటు సమయంలో 3.23 లక్షల ఉద్యోగులు ఉంటే.. ప్రస్తుతం ఆ సంఖ్య 6.28 లక్షల మందికి చేరిందని అన్నారు. తెలంగాణా ప్రభుత్వం TS-iPASS విధానం 2.15 లక్షల కోట్ల  పెట్టుబడులతో 16 లక్షలకు పైగా ఉద్యోగాలను సృష్టించిందని మంత్రి కేటీఆర్ అన్నారు. పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం ఏ ప్రభుత్వానికీ సాధ్యం కాదని, తెలంగాణలో కేవలం రెండు శాతం యువతకు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వగలమని ఆయన అన్నారు.