Site icon HashtagU Telugu

VRAs, VROs: మాకొద్దు.. ఈ ఉద్యోగాలు!

Vra

Vra

వీఆర్ఏ వ్యవస్థ… గ్రామ రెవెన్యూ డిపార్ట్ మెంట్ లో కీలకంగా వ్యవహరించే వ్యక్తులు. భూముల లెక్కలు, భూ సర్వేలు, గ్రామ రికార్డులు, ఇతర ముఖ్య పనులను చక్కదిద్దుంటారు. అలాంటి వ్యవస్థ ను వెట్టిచాకిరీ వెక్కిరిస్తోంది. గ్రామ రెవెన్యూ సహాయకులుగా పనిచేసే వీఆర్ఏలు కూలీలు, డ్రైవర్లుగా మారుతుండటంతో మొత్తం వ్యవస్థనే ప్రశ్నార్థకంగా మార్చేసింది. తహశీల్దార్లు, జిల్లా కలెక్టర్లు దగ్గర రోజువారీ కూలీలుగా పనిచేయాల్సి వస్తోందని కనీళ్ల పర్యంతమవుతున్నారు. ప్రభుత్వం 2020లో VRO వ్యవస్థను రద్దు చేయడంతో పలు అవమానకర సంఘటనలను ఎదుర్కోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయమై VRAs (డైరెక్ట్ రిక్రూట్స్) అసోసియేషన్ ప్రెసిడెంట్ రమేష్ బహదూర్ రియాక్ట్ అయ్యారు. ‘‘తెలంగాణలోని చాలా జిల్లాల్లో వీఆర్ఏలను పైస్థాయి అధికారులు తమ వ్యక్తిగత అవసరాల కోసం వాడుకుంటున్నారు. చిన్న చిన్న అవసరాలకు సైతం ఉపయోగించుకుంటున్నారు. ఒకవేళ అభ్యంతరం వ్యక్తం చేస్తే ఒత్తిడి తెచ్చి మరీ ఆదేశాలు జారీ చేస్తున్నారు. స్పష్టమైన గౌరవ ఉద్యోగ బాధ్యతలు లేకపోవడంతో అన్ని రకాలు పనులు చేయాల్సి వస్తోంది. వీఆర్ఏలకు సరైన విధులు కేటాయించాలని ముఖ్యమంత్రి ఆదేశించినా నేటికీ కార్యరూపం నోచుకోలేదు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

రెవెన్యూ శాఖ సిబ్బంది కొరతను ఎదుర్కొంటున్నప్పటికీ, గత రెండేళ్లుగా వారి సేవలను వినియోగించుకునేందుకు ప్రయత్నాలు చేయడం లేదని వీఆర్‌ఏల సంఘం పేర్కొంది. ప్రభుత్వం ప్రధానంగా కళ్యాణలక్ష్మి-షాదీ ముబారక్ వంటి సంక్షేమ పథకాల అమలును ధృవీకరించడం, భూ సర్వేలకు సంబంధించి రెవెన్యూ నోటీసులు అందించడం, ధరణి సంబంధిత సేవల కోసం బొటనవేలు ముద్రలు తీసుకోవడం, ప్రభుత్వ భూములు, ఆస్తులను రక్షించడం కోసం లాంటి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.  ‘‘క‌లెక్ట‌ర్ టెన్నిస్ ఆట ఆడుతుంటే.. బంతులు అందించేందుకు ఏకంగా 21 మంది వీఆర్ఏల‌కు బాధ్య‌త‌లు అప్ప‌గిస్తూ ఆ జిల్లాలో ఉత్త‌ర్వులు జారీ అయ్యాయని, నిర్మ‌ల్ త‌హ‌సీల్దార్ శివ‌ప్ర‌సాద్‌.. క‌లెక్ట‌ర్ టెన్నిస్ హెల్ప‌ర్లుగా 21 మంది వీఆర్ఏల పేర్ల‌ను ప్ర‌స్తావిస్తూ ఓ జాబితాను విడుద‌ల చేయడం వీఆర్ఏల వ్యవస్థకు అద్ధంపడుతోంది’’ అని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇక బ్యాలెట్ బాక్సుల తరలింపు వంటి పనులు చేపట్టాలని వీఆర్‌ఏలను కోరితే అందుకు ఎన్నికల సంఘం కొంత మొత్తాన్ని రెవెన్యూ శాఖకు చెల్లిస్తున్నప్పటికీ ఆ సొమ్ము వీఆర్‌ఏల చేతికి చేరడం లేదనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వం వాటిని వివిధ శాఖల్లో వినియోగించుకోవాలని భావిస్తుండగా, వీఆర్‌వోలు, వీఆర్‌ఏలు మాత్రం రెవెన్యూలో కొనసాగాలన్నారు. కొత్త రెవెన్యూ చట్టం వచ్చిన తర్వాత సెప్టెంబర్ 2020 నుంచి వీఆర్‌వో వ్యవస్థపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ‘తెలంగాణ వీఆర్వోల సంఘం’ అధ్యక్షుడు గోల్కొండ సతీష్ అన్నారు. కాగా ఉద్యోగ నిర్వహణలో వీఆర్ఏలు, వీఆర్ఓలు అవినీతికి అక్రమాలకు పాల్పడుతున్న కారణంగానే ప్రభుత్వం నాన్చుడు ధోరణి అవలంబిస్తోందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.